భారత దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజ్ఞానానికి రాజధానిగా భాసిల్లుతున్న బెంగుళూరు లో కుల, మతాల మూఢత్వం ‘ఆధునికత’ ముసుగులో పరిఢవిల్లుతోందని ‘ది హిందూ’ వెల్లడించింది. సామాజిక వ్యవస్ధల్లో మనుషుల మధ్య తీవ్ర వైరుధ్యాలకు కారణంగా నిలిచిన కుల, మతాలు కాల క్రమేణా బలహీనపడుతున్నాయన్న విశ్లేషణల్లో నిజం లేదని ‘ది హిందూ’ పత్రిక ప్రచురిస్తున్న పరిశోధనాత్మక కధనాల ద్వారా తెలుస్తోంది. భూస్వామ్య వ్యవస్ధ మూలాలయిన కులం, మత విద్వేషాలు ఆధునికతకు మారుపేరుగా భావించే మెట్రో నగరాల్లో బలహీనపడకపోగా యధాశక్తితో కొనసాగుతున్నాయని పత్రిక ప్రచురిస్తున్న వరుస కధనాలు వెల్లడిస్తున్నాయి. వ్యాపార ప్రయోజనాలకు ఆటంకం కావలసిన సామాజిక విద్వేషాలు సరికొత్త మార్గాల్లో ఆర్ధిక పరంగా కూడా కేంద్రీకృతం అవుతూ వర్గ విశ్లేషణకు పరీక్ష గా నిలిచాయి.
పరిశోధనలో భాగంగా ది హిందూ పత్రిక బెంగుళూరు లోని వివిధ ధనిక, పేద కాలనీల్లో సమాచార సేకరణ జరిపింది. ఇళ్ల నిర్మాణంలోనూ, అద్దెకు ఇళ్ళు దొరికే విషయంలోనూ పత్రిక ప్రధానంగా కేంద్రీకరించింది. దళితులకు, ముస్లింలకు ఇళ్ళు అద్దెకు దొరకడం బెంగుళూరులో కష్టమేనని పత్రిక పరిశీలనలో తేలింది. ‘గౌరవనీయత’, ‘వెజిటేరియన్’, ‘పరిశుభ్రత’… ఇత్యాది ముసుగుల్లో కులాధిక్యత, అస్పృశ్యత, మత వివక్ష లు కొనసాగుతున్నాయని పత్రిక పరిశీలనలో వెల్లడయింది. ధనిక దళితులకు, సంపన్న ముస్లింలకు కూడా అద్దెకు ఇళ్ళు ఇవ్వలేని బలహీనతలను అనేకమంది ప్రదర్శిస్తున్నారని వెల్లడయింది. వివక్షలకు దూరంగా ఉండవలసిన ప్రభుత్వ సంస్ధ ‘బెంగుళూరు డెవలప్ మెంట్ ఆధారిటీ’ సైతం కులాల వారీగా లే ఔట్లు రూపొందించి కాలనీలు నిర్మిస్తున్నట్లుగా స్వతంత్ర సంస్ధల అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి.
‘ది హిందూ’ ఉదాహరణలు
‘ది హిందూ’ ప్రస్తావించిన వివిధ ఉదాహరణలు ఇలా ఉన్నాయి.
ఫర్ధీన్ అహ్మద్ (పేరు మార్చబడినది) పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. ముప్ఫై యేళ్లుగా అనేక వేలమందికి ఆస్తులు సమకూర్చిన సంస్ధకు అతను యజమాని. బెంగుళూరులో తీవ్ర పోటీ ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన సంస్ధ నిలదొక్కుకున్నది. ఆయన పరోపకారి కూడా. సెక్యులర్ భావాలతో పలు అభ్యుదయ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. మతభావనల నుండి తనను తాను వేరు చేసుకున్నప్పటికీ ఆధునికత ముసుగు తొడిగిన మత వివక్షకు అతను బలికాక తప్పలేదు. 2009 వేసవి అతనికి చేదు అనుభవాలను రుచి చూపింది. ఒక ముస్లిం మతస్ధుడి అభ్యుదయం గుర్తింపుకు నోచుకోబోదని గుర్తు చేసింది.
ఫర్దీన్ 2009 లో శివాజీ నగర్ లో ఉన్న తన బంగ్లాను ఆధినీకరించాలని భావించాడు. అందుకోసం ఆయనకి తాత్కాలికంగా అద్దె ఇల్లు అవసరం అయింది. ‘గౌరవనీయులు’ నివసించే లోకాలిటీలో ఇల్లు చూసుకోవాలని భావించిన ఫర్దీన్ కి అది సాధ్యం కాలేదు. ‘గౌరవనీయులైన’ ఇంటి యజమానులకి ఫర్దీన్, ఆయన కుటుంబం మాంసం తినే ముస్లిం లుగా మాత్రమే కనిపించారు. తన వద్ద ఉన్న ఉద్యోగులను పురమాయించినా, ఎన్ని ఆర్ధిక వనరులని చేతులో ఉంచుకున్నా కొన్ని నెలల దాకా ఆయనకి మంచి ఇల్లు దొరకలేదు. తన స్టేటస్ కి తగినదిగా భావించిన లోకాలిటీల్లో ఆన స్టేటస్ ని అంగీకరించేవారు దొరకలేదు.
అవార్డు వచ్చినా ఇల్లు దొరకదు
దళిత ఫెమినిస్టు రూత్ మనోరమ కూడా చేదు అనుభవం ఎదుర్కొంది. ‘ఆల్టర్నేట్ నోబెల్ ప్రైజ్’ గా భావించే ‘లైవ్లీ హుడ్ అవార్డ్’ ఆమెను వరించినా భారత దేశ సామాజిక వ్యవస్ధ ఆమెను ‘దళితురాలి’గానే చూస్తోంది. జయ నగర్ నాలుగవ బ్లాక్ లో ఆమె ఆఫీసు ఉంటుంది. తన ఆఫీసుని కొద్ది మీటర్ల దూరంలోని మరో విశాలమైన భవనంలోకి ఆఫీసుని మార్చాలని ఆమె భావించింది. “ఆ ఇల్లు చాలా పెద్దది. చక్కనైన, మంచి ఇంగ్లీషు మాట్లాడే బ్రాహ్మణ వృద్ధ దంపతులు ఆ ఇంటికి యజమానులు” అని రూత్ తెలిపింది. కానీ వారు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించారు. “అవార్డు వచ్చాక వార్తాపత్రికలన్నీ ఆ విషయాన్ని కవర్ చేశాయి. ఫీచర్లు ప్రచురించాయి. దానివల్ల నేను దళితురాలిననీ, క్రిస్టియన్ ని అనీ అందరికీ తెలిసిపోయింది” అని ఆమె వివరించింది.
రూత్ చెప్పిన దంపతులు సామాన్యులు కారు. రిటైర్డ్ శాస్త్రవేత్తలు. వారి పుత్రుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. మాంసాహారులకు తాము ఇల్లు అద్దెకు ఇవ్వలేమని వారు తమ కారణం చెప్పారు. “నేను ఆఫీసుకి ఇల్లు అడిగాను. ఆ ఇంటిని బిర్యానీ హోటల్ గా మార్చాలనేమీ అనుకోలేదు” అని ఆమె చెప్పింది. మాంసాహారాన్ని కారణంగా చెప్పినప్పటికీ అసలు కారణం రూత్ మనోరమ దళితురాలు కావడమేనని చెప్పడానికి సామాజికవేత్తలే కానవసరం లేదు. శాస్త్రవేత్తలుగా పని చేసిన అనుభవజ్ఞులు మాంసాహారాన్నాయినా కారణంగా చూపి ఇల్లు ఇవ్వడానికి నిరాకరిస్తారని మామూలుగానైతే ఊహించలేని విషయం. కులాలు లేని పశ్చిమ దేశాల్లో మాంసాహారం కారణంగా ఆఫీసులకి అద్దెకు దొరకని ఇళ్ళు ఉంటాయా?
కవైతేనేం, దళితుడేగా?
దళిత కవి సిద్ద లింగయ్య ది మరో చేదు అనుభవం. ‘కన్నడ బుక్ ఆధారిటీ’ కి ఛైర్మన్ కూడా అయిన సిద్ద లింగయ్య కు, అగ్ర కులస్ధులకు, ధనిక వర్గాలకూ కూడా నిలయమైన సౌత్ బెంగుళూరు లో ఇల్లు దొరకడం గగనమని తెలిసి వచ్చింది. “నా పేరు కారణంగా అనేకమంది ఇంటి యజమానులు నన్ను (సో కాల్డ్) అగ్రకులమైన లింగాయత్ కులానికి చెందినవాడినని భావించారు. కానీ నల్లగా ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. నా కులం అడగడానికి వారేమీ సిగ్గుపడలేదు. నేను దళితుడినని చెప్పుకోవడానికి నేనూ సిగ్గుపడలేదు” అని సిద్ధ లింగయ్య తెలిపాడు. తన కులం తెలిసినవెంటనే అప్పటివరకూ సజావుగా సాగుతున్న చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోవడం రివాజు అయింది.
ఈశాన్య ప్రజలపై వివక్ష
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నాగా విద్యార్ధులకి కావలసినన్ని అనుభవాలు. వారి రూపమే ఒక టాబూ. “చాలామంది ఇంటి యజమానులకి మేము కుక్క మాంసం తినేవాళ్లం, వ్యభిచర వృత్తి చేసేవారం, లేదా డ్రగ్స్ కి అలవాటు పడ్డవాళ్లం” అని నాగా స్టూడెంట్స్ యూనియన్ నాయకుడొకరు చెప్పారు. పేరు చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. ఏప్రిల్ నెలలో నాగా విద్యార్ధి ‘రిచర్డ్ లోయితమ్’ హత్యకు గురయ్యాడు. విద్వేషమే ఆయన హత్యకు కారణమని చెబుతూ వందలమంది ఈశాన్య రాష్ట్రాల విద్యార్ధులు బెంగుళూరు లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తమను అంతా విదేశీయులుగా పరిగణిస్తారని అనేకమంది విద్యార్ధులు చెప్పినట్లు అప్పట్లో ‘ది హిందూ’ కధనం ప్రచురించింది. వారికి ఇల్లు అద్దెకి ఉవ్వడానికి చాలామంది ముందుకు రారని కూడా వారు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ సంస్ధల సాక్షిగా
‘సెవెన్ రాజ్ ఎస్టేట్ ఏజన్సీ’ అనే రియల్ ఎస్టేట్ సంస్ధకి సెవెన్ రాజ్ యజమాని. ఆయన ప్రకారం బెంగుళూరులో కుల, మత వివక్షలు సర్వ సాధారణం. “ఇక్కడ అవన్నీ స్పష్టంగా ఉన్నాయి. కానీ సాధ్యమైనంతవరకూ ‘కమ్యూనల్-మైండెడ్’ జనంతో నేను వ్యాపారం చేయను” అని సెవెన్ రాజ్ వివరించాడు. తనకే మతమూ లేదనీ, తన క్లయింట్లను కూడా ఎప్పుడూ అడగననీ ఆయన చెప్పాడు. సెవెన్ రాజ్ ప్రకారం నగరంలో మంచి సౌకర్యాలున్న ప్రాంతాలన్నింటిలో వివక్షను పాటిస్తున్నారు. జయా నగర్, బసవంగుడి, మల్లేశ్వరం, సదాశివ నగర్, ఇందిరా నగర్, రాజాజీ నగర్, అప్పర్ పాలెస్ ఆర్కర్డ్స్, కోరమంగళ, జె.పి.నగర్ లాంటి పోష్ లోకాలిటీలు అత్యంత హీనమైన వివక్షలను పాటిస్తున్నాయి.
“ఈ లోకాలిటీల్లో తక్కువ కులం వారికి గానీ, మైనారిటీ మతస్ధూలకు గానీ ఎవరైనా ఇల్లు అద్దెకు ఇస్తే వారికి వ్యతిరేకంగా ఇరుగు, పొరుగు వారంతా ముఠాలు కట్టేస్తారు.” ఈ మాటలన్నది ఒక కార్పొరేటర్. ‘బృహత్ బెంగుళూర్ మహానగర్ పాలిక” కార్పొరేటర్ ఏం.పారి ప్రకారం కులాల ఏకాంతవాసానికి ‘బెంగుళూరు డెవలప్ మెంట్ ఆధారిటీ’ (బి.డి.ఎ) లాంటి సంస్ధలు కూడా బాధ్య్లులు. “బి.డి.ఎ రూపొందించిన కొన్ని నివాస లే ఔట్లను కులపరంగా సర్వే చేస్తే తేలిందేమంటే, ప్రధాన ప్లాట్లన్నీ అగ్రకులాల దరఖాస్తుదారులకే కేటాయించారు. దళితులకి గానీ, ముస్లిం లకి గానీ ఇ.డబ్ల్యూ.ఎస్ (ఎకనమికల్లీ వీకర్ సెక్షన్) కాలనీల్లోనే కేటాయింపులు జరిగాయి” అని పారి వివరించాడు.
2004-05 లో ‘జన సహయోగ్’ అనే ఎన్.జి.ఓ సంస్ధ చేసిన సర్వేను పారీ ఉద్దేశించాడు. ‘ఆంత్రోపోలాజికల్ స్టడీ ఆఫ్ స్లమ్స్ ఇన్ బెంగుళూర్’ అని ఈ సర్వేకి పేరు పెట్టారు. “కన్నడ మాట్లాడే మురికివాడల నివాసుల్లో 85 శాతం మంది అస్పృశ్యులుగా చెప్పబడే కులాలకు చెందినవారే. కన్నడేతర భాషలు మాట్లాడేవారిలో 65 శాతం మంది అస్పృశ్య కులాలుగా భావిస్తున్నవాటికి చెందినవారు” అని సర్వే గురించి తెలిసిన ఐజాక్ అరుల్ సెల్వ తెలిపాడు.
వార్తా పత్రికల ‘ప్రకటనలు మాత్రమే’ పేజీల్లోని ఆస్తులు, రియల్ ఎస్టేట్ సెక్షన్లు లోపలి దృశ్యాన్ని స్పష్టంగా చెబుతాయి. ‘వెజిటేరియన్లకు మాత్రమే’ అంటూ కనపడే ప్రకటనలు ప్రధానంగా జయనగర్, బసవంగుడి, మల్లేశ్వరం లాంటి లోకాలిటీలనుండి వచ్చేవే. అలాంటి ప్రకటనల నిజమైన అర్ధం సదరు యజమానులతో ‘ది హిందూ’ విలేఖరి (సుదీప్తో మండల్) మాట్లాడినప్పుడు వెల్లడయింది. “ఇది బ్రాహ్మణుల లే ఔట్. ఎస్.సి/ఎస్.టి లెవరూ మాకు అవసరం లేదు” అని ఒక మహిళ విసురుగా చెప్పి ఫోన్ పెట్టేసింది. “కాశ్మీర్ ముస్లింలు వద్దు. ఇతర ముస్లింలయితే ఫర్వాలేదు” అని హెచ్.ఆర్.బి.ఆర్ లే ఔట్ లోని ఒక యజమాని చెప్పాడు. “ముస్లింలయినా ఫర్వాలేదు. కానీ శుభ్రమైన ముస్లింలు అయి ఉండాలి” అని హెచ్.ఎస్.ఆర్ లే ఔట్ నుండి మరొకరు చెప్పారు.
లాయర్ ఎన్.జగదీశ ఇలా అంటున్నాడు. “వెజిటేరియన్లు మాత్రమే అనడం ‘బ్రాహణులు మాత్రమే’ అని చెప్పడానికి కోడ్ మాత్రమే. వారు నిజంగా చెప్పదలుచుకున్నది చెబితే ఐ.పి.సి లోని ఎస్.సి/ఎస్.టి అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టొచ్చు.” వివక్షను వదలలేనప్పుడు చట్టాలను మభ్యపెట్టడానికి కొత్త కొత్త పదజాలాన్ని సృష్టించుకోవడం గౌరవనీయులకు పెద్ద పనేమీ కాదు, తరతరాల సంస్కృత వేద జ్ఞానం వారికే సొంతం కనుక.
అర్ధ భూస్వామ్య వ్యవస్ధలో కులం దానంతటదే బలహీనపడుతుందా?
భారత సామాజిక వ్యవస్ధలో కులాల పట్టు బలహీనపడుతోందన్న వాదనను జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ వాదనల సారాంశం ఏమిటంటే ‘కాల క్రమేణా’ కులాల పట్టింపులు, వివక్షలు బలహీనపడుతున్నాయని. పరిశ్రమల్లో, ఆఫీసుల్లో, బస్సుల్లో, రైళ్లలో కలిసి పని చేస్తున్నారు కనుక, కలిసి కూర్చుంటున్నారు గనక ఆ మేరకు కులం బలహీనపడినట్లేనని ఈ వాదనలు చెబుతున్నాయి. కార్యాలయాల్లో, పరిశ్రమల్లో ఆర్ధిక అవసరం రీత్యా కలిసి పని చేస్తే, బస్సుల్లో, రైళ్లలో ప్రయాణ అవసరం రీత్యా కలిసి ప్రయాణిస్తే కులం బలహీనపడిందని విశ్లేషించగలిగితే మరి అవే కార్యాలయాల్లో, అవే పరిశ్రమల్లోని కార్మిక సంఘాల్లో కులాల ఏకీకరణని కులం బలపడుతోందనో లేదా కొనసాగుతోందనో విశ్లేషించవలసిన అవసరం లేదా? పరిశ్రమలో, ఆఫీసులో కలిసి పనిచేసిన వ్యక్తి తన ఇంటిని దళితుడికి అద్దెకు ఎందుకు ఇవ్వడు? కార్మిక సంఘంలో దళితులతో కలిసి ఒకే యూనియన్ లో ఉండే అగ్రకుల వ్యక్తులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కమ్మ, రెడ్డి ఇత్యాదిగా గల సంక్షేమ సంఘాలలో క్రియాశీలకంగా ఎందుకు ఉంటున్నారు? దళిత సంపన్నులకు కూడా స్ధానం ఇవ్వవలసిన పోష్ లోకాలిటీలు వివిధ పేర్లతో లే ఔట్లలో స్ధానం ఎందుకు ఇవ్వరు? వర్గ ఐక్యత చూపవలసిన పోష్ లోకాలిటీలు కుల వివక్షను పాటించడం ఏమిటి?
నిజానికి కాల క్రమేణా కుల, మతాలు బలహీనపడుతున్నాయి అన్న వాదనకు వర్గ విశ్లేషణలో స్ధానం లేదు. కులాలు బలహీనపడతాయన్న వాదనకు సైద్ధాంతీక వివరణ ఇవ్వాలి. భారత దేశ సామాజిక వ్యవస్ధ ‘అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్ధ’ అన్న వర్గీకరణను అంగీకరించినట్లయితే కులాలు బలహీనపడుతున్నాయన్న వాదనకు కూడా ఆ వర్గీకరణ పరిధిలో వివరణ ఉండాలి. దేశంలో అర్ధ భూస్వామ్య వ్యవస్ధ కులం ఆధారంగా మనుతోందని ముందు గ్రహించాలి. కులం, అర్ధ భూస్వామ్యం ఒకదానికొకటి సహకరించుకుంటూ తమ అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నాయని గ్రహించాలి. భూస్వామ్య దోపిడీ సాధనం ప్రధానంగా ‘కుల వ్యవస్ధ’ గనుక, ‘కాల క్రమేణా’ కులాలు బలహీనపడడం అంటే ‘కాల క్రమేణా’ అర్ధ భూస్వామ్యం బలహీనపడుతోందని కూడా అర్ధం. అర్ధ భూస్వామ్యం బలహీనపడడం అంటే, భూస్వామ్య వ్యవస్ధ పునాదులు బలహీనపడుతున్నాయని అర్ధం. వర్గ విశ్లేషణలో అది సాధ్యమేనా? ఆర్ధిక పునాది అయిన భూస్వామ్య వ్యవస్ధ వర్గ ఘర్షణ లేకుండా, దోపిడీ ని అంతం చెయ్యకుండా బలహీనపడుతుందా? భూస్వామ్య వ్యవస్ధను బలహీనపరచవలసిన వ్యవసాయక విప్లవం లేకుండా ఆ వ్యవస్ధకు ఆదరువుగా ఉన్న కులం ఎలా బలహీనపడుతుంది?
భారత దేశ విప్లవోద్యమానికి అత్యంత ప్రధాన సమస్య భూమి సమస్య. దేశంలో ఇప్పటికీ 65 శాతం గ్రామాల్లో నివసిస్తున్నారు. దళితులు, బి.సీలు, ముస్లింలు లాంటి బడుగు వర్గాలకు చెందిన ప్రజలు ఇంకా భూములతో సావాసం కోసం పరితపిస్తున్నారు. ఎ చిన్న అవకాశం దొరికినా భూములను ఆశిస్తున్నారు. వ్యవసాయంలో అత్యధిక భాగం వర్షాధారమే తప్ప నీటి పారుదల సౌకర్యాలు లేవు. భూముల సమస్య పాలకపవర్గాలకు సమస్యగా మారినపుడో, లేక తమలో తమకు వైరుధ్యాలు తలెత్తినపుడో ఒకరి గుట్టు మట్లు మరొకరు బయటపెట్టుకునే చర్యల్లో భాగంగా ఎన్నెన్ని వేల, లక్షల ఎకరాలు భూస్వాముల ఆక్రమణల్లో, ఎమ్మెల్యేల అనుభవాల్లో ఉన్నాయో రింగు రోడ్డు రాజకీయాల ద్వారా, రాజధాని ఆశల ద్వారా, ప్రాంతీయ ఆకాంక్షల ద్వారా వెల్లడి అవుతున్న సంగతి పత్రికలు చెబుతున్నాయి. అలాంటి భూమి సమస్య ప్రధానంగా ఉన్న భూస్వామ్య వ్యవస్ధ కు పట్టుగొమ్మ గా ఉన్నది ‘కుల వ్యవస్ధే’. అలాంటి కుల వ్యవస్ధ కాల క్రమేణా బలహీనపడుతున్నదని చెప్పడానికి బస్సు, రైలు ప్రయాణాలను, ఆఫీసు, పరిశ్రమల పనులను నిదర్శనంగా చూపడం కుల సమస్యపై చేయవలసిన కృషిని పక్కకు మళ్ళించడమే.