గాంధేయవాదులు కూడా బహిష్కృతులే -గాంధియన్ హిమాంషుతో ఇంటర్వ్యూ

కూల్చివేసిన ఆశ్రమం వద్ద హిమాంషు కుమార్హిమాంషు కుమార్ గాంధీయన్ కార్యకర్త. మావోయిస్టులకు పట్టు ఉన్నట్లు భావించే దంతెవాడ జిల్లాలో ‘వనవాసి చేతన్ ఆశ్రమ్’ అనే ఎన్.జి.ఓ సంస్ధను 22 సంవత్సరాల పాటు తన భార్యతో కలిసి నిర్వహించారాయన. స్ధానిక ఆదివాసీల భాష ‘గోండి’ నేర్చుకుని చట్టబద్ధంగా ఆదివాసీలకు హక్కులు దక్కేలా చేయడానికి ఆశ్రమ్ ద్వారా ప్రయత్నించారు. 2005 మొదలుకుని ఆదివాసీలకు వ్యతిరేకంగా సల్వాజుడుం పేరుతో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్.పి.ఓ) నిర్వహించిన దారుణ హంతక దాడులతో కకావికలై అడవి వదిలి వెళ్ళిపోయిన గిరిజనులను తిరిగి వారి వారి గ్రామాలకు రప్పించడానికి ప్రయత్నించారు. తప్పుడు కేసులు ఎదుర్కొంటూ జైళ్ళలో ఉన్న గిరిజనులను బైటికి రప్పించడానికి, పోలీసులు, సల్వాజుడుం సంస్ధల వల్ల బాధితులైన గిరిజనులకు న్యాయం దక్కించడానికి ప్రయత్నించారు.

కానీ పోలీసులకు హిమాంషు అహింసా పద్ధతులు కూడా నచ్చలేదు. దంతెవాడ నుండి ఆయన్ని తరిమివేయడానికి చేయాల్సిన పనులన్నీ చేశారు. రెవిన్యూ, పోలీసు యంత్రాంగం అంతా కట్టగట్టుకుని ఆయన ఆశ్రమాన్ని బుల్ డోజర్లతో కూల్చివేశాక చెట్టు కింద ఆశ్రమాన్ని నడపడానికి కూడా ప్రయత్నించారు. చివరికి ప్రాణ భయంతో అక్కడి నుండి ఆశ్రమాన్ని ఎత్తివేసి ఢిల్లీకి మారేంతవరకూ ప్రభుత్వ యంత్రాంగం శాంతించలేదు. హిమాంషు కుమార్ ను జస్టిన్ పొదుర్ ఫిబ్రవరి 2013లో ఇంటర్వ్యూ చేశారు. దంతెవాడలోని తన అనుభవాలను హిమాంషు ఇంటర్వ్యూలో వివరించారు. దేశ సంపదలను ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడానికి కృతనిశ్చయంతో ఉన్న పాలకుల ముందు వారు నల్లవారైనా, తెల్లవారైనా గాంధీయిజం పనికిరాదని ఆయన తెలుసుకోవలసి వచ్చింది. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్య భాగాలు:

—*—

జస్టిన్ పొదుర్ (జె.పి): నేను మొదట ఇక్కడికి వచ్చినపుడు బహుశా ఈ పాటికి మీరు జైలులో ఉంటారని అనుకున్నాను. ఆ కధతో మొదలు పెడితే బాగుంటుందేమో?

హిమాంషు కుమార్ (హెచ్.కె): ఇంకో కధతో నన్ను మొదలుపెట్టనివ్వండి. ఇటీవలి కధే. 2006లో నలుగురు అమ్మాయిలను సల్వాజుడుం నాయకులుగా చెలామణి అవుతున్న ఎస్.పి.ఓ లు అత్యాచారం చేశారు. ఆ అమ్మాయిలను మా ఆశ్రమానికి, మా న్యాయ సహాయ కేంద్రానికి గ్రామానికి చెందిన ఒక యువకుడు తీసుకువచ్చాడు. దంతెవాడలోని పోలీసు స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ (ఫిర్యాదు) నమోదు చేయడానికి మేము ప్రయత్నించాము. కానీ నేరస్ధులు ఎస్.పి.ఓలు కావడంతో ఆ ఫిర్యాదు ఎప్పటికీ నమోదు కాలేదు. వారి దరఖాస్తును సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.పి) వద్దకు తీసుకెళ్లాము. ఆయన అసలు బదులు ఇవ్వలేదు. ఆ తర్వాత కొంటా లోని జె.ఎం.ఎఫ్.సి కోర్టుకు వెళ్లాము. జడ్జి బాధితుల వాంగ్మూలాలను, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలను తీసుకుని అరెస్టు వారెంట్లు జారీ చేశాడు. కేసును దంతెవాడ సెషన్ కోర్టుకు బదిలీ చేశాడు.

ఇదిలా జరుగుతుండగానే నేను (అప్పటి) హోమ్ మంత్రి పి.చిదంబరంను కలిశాను. దంతెవాడ వచ్చి సల్వాజుడుం, ఎస్.పి.ఓల బాధితులను స్వయంగా కలవాలని నేను ఆయనని ఆహ్వానించాను. ఆయన స్వయంగా రావడం ముఖ్యమని, అలా జరిగితే రాజ్యం తమపట్ల శ్రద్ధగా ఉన్నదని ప్రజలు నమ్ముతారని ఆయనకు చెప్పాను. రావడం ద్వారా వ్యవస్ధ శ్రద్ధ తీసుకుంటోందన్న సందేశం ఇచ్చినవారవుతారని చెప్పాను. వివిధ డాక్యుమెంట్లు, అమ్మాయిల సాక్ష్యాలతో కూడిన ఒక సి.డి కూడా ఆయనకు ఇచ్చాను. తాను తప్పకుండా వస్తానని చిదంబరం హామీ ఇచ్చారు. కానీ ఎప్పటికీ రానేలేదు.

మూడు సంవత్సరాల తర్వాత డిసెంబర్ 19, 2009 తేదీన అత్యాచార బాధితులకు ఎటువంటి న్యాయము చెయ్యని పోలీసులు అమ్మాయిలను కిడ్నాప్ చేశారు. సుక్మా జిల్లాలోని డోర్నగల్ పోలీసు స్టేషన్ లో 5 రోజుల పాటు వారిని ఉంచి విడుదల చేశారు. వారిని భ్యభ్రాంతులకు గురి చేశారు. హిమాంషుతో చెప్పడానికి మీకు ఎంత ధైర్యం అని వారు అమ్మాయిలను బెదిరించారు.

ఆ అయిదు రోజుల్లో నేను చిదంబరంను సంప్రదించాను. ‘ఇది నా సమస్య కాదు, అధికారులతో మాట్లాడండి’ అని ఆయన చెప్పేశారు. నేను (కేంద్ర) హోమ్ కార్యదర్శి జి.కె.పిళ్లైతో మాట్లాడాను; ఛత్తీస్ ఘర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) తో మాట్లాడాను; దంతెవాడ ఎస్.పితో మాట్లాడాను; దంతెవాడ కలెక్టర్ తో మాట్లాడాను. ఎవ్వరూ సహాయం చేయలేదు.

అమ్మాయిలు తిరిగి వచ్చాక వారు మాతో మాట్లాడడానికి నిరాకరించారు. వారు భయభ్రాంతులయ్యారు; కోపంతో ఉన్నారు. న్యాయం చేస్తామని వారికి గట్టిగా హామీ ఇచ్చాము. కానీ మేము ఘోరంగా విఫలం అయ్యాము. పైగా వారిని మరింత ప్రమాదంలోకి నెట్టాము. నాకిక వ్యవస్ధ పైన ఉన్న నమ్మకం అంతా పోయింది.

జె.పి: 2010లో మీరొక చర్చలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం గిరిజనుల కోసం పని చేసేలా చెయ్యడమే మీ కోరికగా ఆ సందర్భంగా చెప్పారు. గిరిజనుల కోసం పని చేయలేనట్లయితే భారత ప్రజాస్వామ్యానికి ఎటువంటి విలువా లేదని మీరు చెప్పారు.  ఇలాంటి అనుభవాలు ఆ లక్ష్యం గురించి ఏమి చెబుతున్నాయి?

హెచ్.కె: ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే, అది అత్యంత బలహీన పౌరుల కోసం కూడా పని చేయాలి. అలా పని చేయకపోతే అదిక ప్రజాస్వామ్యం కాదు.

జె.పి: కనుక, ప్రజాస్వామ్యం పని చేయకపోతే సాయుధ పోరాటాన్ని ఆశ్రయించడం అర్ధం చేసుకోదగ్గదేనా?

హెచ్.కె: నేను చెప్పడం ప్రారంభించాను, ‘ఇప్పుడు నాకు అర్ధం అవుతోంది’ అని. ఎందుకో నేనిప్పుడు చెప్పగలను. నేను హింసకు సానుభూతి చూపిస్తున్నానని అంటోంది. నేనేమన్నానంటే ‘లేదు, నేను సానుభూతి చూపడం లేదు’ అని. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నా విశ్లేషణను ఇస్తున్నాను.

జె.పి: ఆదివాసీ అంత బలహీనంగా (vulnerable) ఉండడానికి కారణం చట్టం ప్రకారం తమకు ఏ హక్కులు ఉన్నాయో వారికి తెలియకపోవడమేనని కూడా 2010లో చెప్పారు. కానీ రాజ్యమే చట్టాలను పాటించనప్పుడు చట్టం గురించిన అవగాహన వల్ల ఫలితం ఏముంటుంది?

హెచ్.కె: 2005లో సల్వాజుడుం మొదలయ్యాక పరిస్ధితిలో తీవ్రమైన మార్పు వచ్చింది. అంతకుముందు రాజ్యం చట్టాన్ని పాటించేటట్టు చూసేలా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉండింది. సల్వాజుడుం తర్వాత వనరులను కొల్లగొట్టడంలో అదొక ఆధునిక ప్రక్రియగా మారిపోయింది; పాలక వర్గాలకు అదే ప్రధమ కర్తవ్యంగా ముందుకు వచ్చింది; రాజ్యాంగ ప్రక్రియలు, చట్టాలు, ఒప్పందాలు అన్నింటినీ ఉల్లంఘించడం వారు ప్రారంభించారు; హింసాత్మక పద్ధతుల ద్వారా భూముల్ని లాక్కోవడం ప్రారంభించారు. చట్టబద్ధంగా ప్రజల హక్కులను వ్యాపింపజేస్తున్నామన్న మా అవగాహన అంతా అసందర్భం అయిపోయింది.

ఒక ఉదాహరణ చెబుతాను. అంతర్జాతీయ మానవ హక్కుల రోజు (డిసెంబర్ 10, 2009) నాడు మా ఆశ్రమ కార్యకర్తలో ఒకరైన కోపా కుంజంను అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్ లో అతన్ని పట్టుకుని చావబాదుతున్నారు. ‘హ్యూమన్ రైట్స్ లా నెట్ వర్క్’ కి చెందిన ఒక లాయర్, అల్బన్ టోపో, అతని వెంట ఇంటారాగేషన్ గదిలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. గదిలో తానూ ఉంటానని టోపో చెప్పినపుడు పోలీసులు ఆయన్ని కూడా చావబాదారు. ఆ రోజు రాత్రంతా ఆయన్ని స్టేషన్ లోనే ఉంచారు. ఆ తర్వాత రోజు ఉదయం ‘రాత్రి కావడంతో, చిమ్మ చీకటిగా ఉండడంతో, తాను తన ఇష్టాపూర్వకంగానే పోలీసు స్టేషన్ లో రాత్రంతా గడిపానని’ ఆయన చెప్పినట్లుగా ఒక కాగితం పైన సంతకం తీసుకున్నారు. అనంతరం ఆయన వెళ్లిపోయాడు.

జె.పి: ఆశ్రమ్ కూల్చివేత కూడా ఒక ఉదాహరణ అనుకుంటాను.

హెచ్.కె: ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వ భూమిలోనే మా ఆశ్రమ్ ని ప్రారంభించామని గుర్తుంచుకోండి. సల్వాజుడుం సాగిస్తున్న దాడులు, లైంగిక అత్యాచారాలు, హత్యలు, గ్రామ దహనాలు మొదలైన వాటిని మేము ప్రశ్నించడం ప్రారంభించాక ప్రభుత్వానికి కోపం వచ్చింది. వారు చేసిన మొదటి పని ఏమిటంటే ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణంలో మేము ఉన్నామని నోటీసు పంపడం. మొదటిది: గ్రామ సభ (చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడిన గ్రామ సమావేశం) అనుమతితో ఆ భూమిలో ఆశ్రమ్ ని నెలకొల్పి పని చేసుకుంటున్నామని మేము వాదించాము రాజ్యాంగం ప్రకారం, గిరిజన ప్రాంతాల్లో, గ్రామ సభ ఒక తీర్మానం ఆమోదిస్తే ప్రభుత్వం దానికి కట్టుబడి ఉండాలి. రెండోది: ప్రభుత్వ అనుమతితోనే ఇన్నాళ్లూ పని చేసినా ఆశ్రమ్ నిర్మాణంతో వారికి ఇంతవరకూ సమస్య రాలేదు. హఠాత్తుగా మేము చట్టవిరుద్ధంగా ఎలా మారాము?

అది అటవీ భూమి కాబట్టి దానిని కేటాయించడానికి వీలు లేదని ప్రభుత్వం నుండి తిరుగు సమాధానం వచ్చింది. కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం అది వ్యవసాయ భూమి అని మేము బదులిచ్చాము. ‘కాదు, కాదు, భూమి స్టేటస్ ని 1996లో మార్చారు’ అని ప్రభుత్వం తిరుగు టపాలో తెలిపింది. దానితో నేను లాండ్ రికార్డుల కోసం ‘సమాచార హక్కు’ చట్టాన్ని ప్రయోగించాను. రికార్డులు కనపడడం లేదని వారు చెప్పారు. ఫర్వాలేదు రెండో కాపీ రెవిన్యూ ఆఫీసులో ఉంటుంది చూడమని కోరాను. 1996 రికార్డు, కేవలం ఆ సంవత్సరం రికార్డు మాత్రమే, కనపడ్డం లేదని రెవిన్యూ అధికారి రాశాడు. అయినా ఫర్ఫాలేదు, మూడో కాపీ గ్రామ అకౌంటెంటు (గ్రామ పట్వారీ) వద్ద ఉండాలి అని చెప్పాను. తమ వద్ద కూడా 1996 నాటి రికార్డు కనపడ్డం లేదని పట్వారీ కూడా మాకు రాశాడు. దానితో మేము కోర్టుకి వెళ్లాము.

మేము కోర్టులో ఉండగానే వాళ్ళు బుల్ డోజర్లు తెచ్చి మా ఆశ్రమ్ ని కూల్చివేశారు.

జె.పి: ఆ తర్వాత కూడా మీ పని కొనసాగించారా?

హెచ్.కె: మరి! దంతెవాడలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ఆ ఇంటి యజమాని ఒక ప్రభుత్వ  ఉద్యోగి. కలెక్టర్ ఆయన వద్దకి వెళ్ళి మాకు ఇల్లు అద్దెకు ఇవ్వడం కొనసాగితే అతన్ని ఉద్యోగం నుండి తీసేస్తామని బెదిరించాడు. వాళ్ళు మా ఇంటికి విద్యుత్ ని కట్ చేశారు. దానితో ఒక చెట్టు కింద ఆశ్రమం పెట్టుకుని అక్కడి నుండే పని చేయడం మొదలుపెట్టాము. “వారికి దూరంగా ఉండండి, లేదా….” అని పోలీసులు గ్రామస్ధులను బెదిరించారు.

జె.పి: అక్కడ ఇక ఎంత మాత్రం మీరు పని చేయలేరని గ్రహించిన ఆ చివరి క్షణాలు ఏమిటి?

హెచ్.కె: గోంపాడ్ గ్రామంలో సోడి సాంబో అనే మహిళను కాలి పైన తుపాకితో కాల్చారు. ఇప్పుడు ఆమె కేసు సుప్రీం కోర్టులో ఉంది. ఆమె గ్రామంలో 16 మంది హత్యకు ఆమె ప్రత్యక్ష సాక్షి. కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (సి.ఆర్.పి.ఎఫ్), కోబ్రాలు గ్రామంపై దాడి చేసి కత్తులు, పిడి బాకులతో దాడి చేసి 16 మందిని చంపేశారు. 18 సంవత్సరాల బాలుడి చేతుల వేళ్ళను కోసేశారు; అతని తల్లిని తలలో పిడిచారు, ఆమెపై అత్యాచారం చేశారు; 70 యేళ్ళ ముసలావిడ రొమ్ములను కోసేశారు; కళ్ళు లేని 80 యేళ్ళ పెద్దాయనను చంపేశారు. సోడిని కాలిపై కాల్చారు. కానీ ఆమె బతికిపోయింది. సర్జరీ కోసం మేము ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లాము. రెండోసారి ఆమెను ఢిల్లీ తీసుకు వస్తుండగా పోలీసులు కిడ్నాప్ చేశారు. పైగా నేనే కిడ్నాప్ చేశానని పోలీసులు నాపై ఆరోపణ చేశారు. నేను తప్పించుకుని తిరుగుతున్నానని త్వరలో అరెస్టు చేస్తామని ప్రకటించారు. నేనేమీ ఆలోచించానంటే -నేను అన్ని కేసులు ఫైల్ చేశాను, నేను జైలులో ఉన్నట్లయితే, వారికిక అవకాశం ఉండదు. అలా ఆలోచించి జనవరి 4, 2010 తేదీన అర్ధరాత్రి పూట నేను దంతెవాడ వదిలిపెట్టాను.

జె.పి: ఈ సంఘటనల నుండి కొద్దిగా వెనక్కి వెళ్లగలిగితే గనక; మీ గురించి తెలిసినవారంతా మీరు గాంధేయవాది అని చెబుతారు. మీరు ఇక్కడ దేని గురించైతే చెబుతున్నారో, అటువంటి సందర్భంలో, ఈ స్ధలంలో, ఈ కాలంలో గాంధీ బోధనలను మీరు ఎలా అన్వయించగలరో నాకు ఆసక్తిగా ఉంది.

హెచ్.కె: నేను గాంధేయవాదిని అవునో కాదో నాకు తెలియదు, కానీ, ఆయన చెప్పిన వాటిలో కొన్ని అంశాలను నేను నమ్ముతాను. గ్రామాలు స్వతంత్ర యూనిట్లు; ప్రజలే సర్వాధికారులు; గ్రామాలు రాజకీయంగానూ, ఆర్ధికంగానూ స్వయం సమృద్ధితో ఉండాలి, అంటే గ్రామ్ స్వరాజ్, గ్రామాల స్వయం పరిపాలన; గ్రామ స్వయం పాలన అహింసాత్మక పద్ధతుల్లో సాధించాలి… ఇవన్నీ.

(ఇక్కడి నుండి హిమాంషు కుమార్ తన సిద్ధాంతాన్ని చెప్పుకొచ్చారు. మార్క్సిస్టు సిద్ధాంతాలు గొప్పవని చెబుతూనే వాటికి గాంధీ సిద్ధాంతాలను జత చేయాలని ఆయన చెప్పారు. అంటే గాంధీయన్ మార్క్సిజం అని కావచ్చు. వాస్తవంలో అవి రెండూ పొసగనివి. అహింసా సిద్ధాంతం పాలక వర్గాల ప్రయోజనం కోసం వారి దోపిడీ కొనసాగడానికి వీలుగా రూపొందించిన సిద్ధాంతం. హిమాంషు సిద్ధాంతం గురించి ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే ఈ లింక్ లో చూడవచ్చు.

జస్టిన్ పొదుర్ టొరొంటో నగరంలో ఒక రచయిత. యార్క్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ప్రస్తుతం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్మాలియాలో విజిటింగ్ ప్రొఫెసర్ కూడా. ఆయన బ్లాగ్: www.killingtrain.com ట్విట్టర్: @JustinPodur)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: