మార్క్సిజం పుట్టుక పరిణామం, మానవ స్వభావం, సోషలిజం అనివార్యత

మానవ స్వభావంలో మార్క్సిజం లో ఇమడని లక్షణాలు ఉన్నాయని’, ‘మార్క్సిజం లో ఖాళీలున్నాయనీ‘, “మార్క్సు చూడనిది మానవ స్వభావంలో ఏదో ఉందనిఇలాంటి భావాలు మానవ హక్కుల సంఘం నేత బాలగోపాల్ గారు ఒక ధీసిస్ లాంటిది రాశారు. అప్పటివరకూ ఆయన పౌరహక్కుల సంఘం నాయకుడుగా ఉంటూ పీపుల్స్ వార్ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారు. దానినుండి బైటికి వచ్చి ఆయన మానవ హక్కుల సంఘం పెట్టారు. పౌర హక్కుల…” నుండి మానవ హక్కుల…” అనే కాన్సెప్ట్ కి మారడం వెనక ఆయన మారిన అవగాహన ఉంది. అదొక సంగతి.

బాల గోపాల్ గారు రాసిన ధీసిస్ పైన రంగనాయకమ్మ గారు విమర్శ లేదా మార్క్సిస్టు దృక్పధంతో సమాధానం రాశారు. ఆవిడ రాసిన పుస్తకం పేరు కొండను తవ్వి ఎలకను కూడా పట్టనట్లు. బాలగోపాల్ గారు మార్క్సిజంలో తాను కనిపెట్టానని రాసిన ఖాళీలు నిజానికి ఎప్పుడో చర్చించబడ్డ అంశాలేననీ, వాటినే కొత్తగా బాలగోపాల్ తెచ్చారనీ సవివరంగా చర్చించి ఆయన వాదనలోని ఖాళితనాన్ని ఆవిడ తన పుస్తకంలో రుజువు చేశారు. దానికి బాలగోపాల్ గారు సమాధానం ఇవ్వలేదు. ఇవ్వడానికి కూడా ప్రయత్నించలేదు. నేను ఒకసారి ఓ చోట కలిసినపుడు (పరిచయం లేదు లెండి) రంగనాయకమ్మగారి విమర్శకి సమాధానం రాస్తున్నారా అని అడిగాను. దానికాయన ఎందుకు లెండి. నేను రాస్తే ఆవిడ ఇంకొకటి రాస్తుంది. ఎందుకదంతా?” అని కొట్టిపారేశారు. మార్క్సిజంలో ఆయన కనిపెట్టిన ఖాళీల ఖాళీతనం అలా ఉంది. బాలగోపాల్ గారు తన కొత్త భావాలను అలా పుస్తకాలుగా రాయడం, దానిపైన విమర్శలు రావడం, విమర్శలకు ఆయన జవాబులు ఇవ్వకపోవడం జరుగుతుండేది.

ఒక ధీసిస్ లాంటిది ఆయన రాసి పడేశాక దానిపైన విమర్శలు వస్తే సమాధానం తప్పనిసరిగా ఇవ్వలని ఆయన భావించకపోవడం విచిత్రం. ధీసిస్ లాంటిది అని ఎందుకంటున్నానంటే, మార్క్సిజం గురించి పైపైన తెలిసినవారికి, లేదా పూర్తిగా అవగాహన లేక పోయినా బాగా తెలుసు అనుకుంటున్నవారికి అది ధీసిస్ లాగా కనిపిస్తుంది. కాని మార్క్సిజం ని సరిగ్గా అర్ధం చేసుకున్నవారికి అది ధీసిస్ కాదని, తలా తోకా లేని ఆలోచనల కలబోత అని అర్ధం అవుతుంది. లేదా ఆ విమర్శలో మార్క్సిజంలోనే సమాధానం ఉందన్న విషయం అర్ధం అవుతుంది. నేను గతంలో రాసినట్లు మార్క్సిజం తమకు తెలుసునని భావిస్తూ నిజానికి దానిగురించి సరైన అవగాహన లేనివారు చాలామంది ఉన్నారు. వారికి బాలగోపాల్ వాదనలు గొప్ప ధీసిస్ లాగా అనిపించేవి. మార్క్సిజాన్ని సరిగా అర్ధం చేసుకోవడంలో వైఫల్యం జరిగినపుడు సహజంగానే అందులో ఏదో ఖాళీ ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ ఖాళీని ఖాళీ కాదని చూపిస్తూ, మార్క్సిజం మాటల్లొ చెప్పినపుడు దానికి తిరిగి సమాధానం రాయాల్సిన బాధ్యత బాలగోపాల్ పైన ఉన్నా ఆయనా పనికి పూనుకోలేదు.

మార్క్సిజం అద్దాలతో సమాజాన్ని, అందులోని సమస్యలను చూడడం అంటే ఏమిటి? ఏది ముందు? ఏది వెనక?

సమాజాలు మారుతూ వచ్చాయి. విఫ్లవాల ద్వారా ఆ మార్పులు జరుగుతూ వచ్చాయి. మరోపక్క శాస్ర సాంకేతిక రంగంలోజివ శాస్త్రంలో డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం, భౌతిక శాస్త్రంలొ శక్తి నిత్యత్వ సూత్రం, సామాజిక శాస్త్రంలొ ఫ్రెంచి ఫ్యూయర్ బా సోషలిస్టు భావాలు, తత్వ శాస్త్రంలో జర్మన్ హెగెల్ గతి తర్కంఇవన్నీ అప్పటికీ అభివృద్ధి చెంది ఉన్నాయి. వీటిలో వేటినీ మార్క్సు కనిపెట్టలేదు. కాని అవన్నీ మార్క్సిజానికి ప్రాణవాయువులుగా ఉపయోగపడ్దాయి. ఎంతగా ఉపయోగపడ్డాయంటే అవి లేకుండా మార్క్సిజం లేదు. ఏంగెల్స్ మార్క్సిజం పుట్టుకను గురించి వ్యాఖ్యానిస్తూ కాలం గర్భంతో ఉండి మార్క్సుని కన్నదిఅని అంటాడు. అంటే అప్పటికి మార్క్సిజం పుట్టడానికి కావలసిన పరిస్ధితులన్నీ మానవ సమాజంలో ఏర్పడి ఉన్నాయని అర్ధం. ఆ పరిస్ధితులు ఏర్పడకపోయినట్లయితే మార్క్స్ మిగతా మనుషుల్లాగే పుట్టి గిట్టేవాడు. కాకపోతే తత్వ శాస్త్రంలో మరొక పుస్తకం రాసి ఉండేవాడు కాని మార్క్సిజం పుట్టి ఉండేది కాదు.

క్కడ చెప్పదలుచుకున్నది మార్క్సిజం, మార్క్సిజం కోసమో లేక అప్పటికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కనుక తానూ ఒక సిద్ధాంతం సృష్టించాలని మార్క్స్ కి ఉన్న ఉబలాటం వల్లనో పుట్టలేదు. మార్క్సిజం జన్మించడానికి అప్పటికి ఒక చారిత్రక అవసరం ఏర్పడి ఉంది. ఆదిమ కమ్యూనిస్టు వ్యవస్ధ, బానిస వ్యవస్ధగానూ, బానిస వ్యవస్ధ ఫ్యూడల్ వ్యవస్ధగానూ, ఫ్యూడల్ వ్యవస్ధ పెట్టుబడిదారీ వ్యవస్ధగానూ అభివృద్ధి చెందింది. పెట్టుబడిదారీ వ్యవస్ధ లో వైరుధ్యాలు తీవ్రమై సంఘర్షణ జరుగుతున్న కాలం అది. అటువంటి ఒక సంఘర్షణ ఫలితంగా పారిస్ కమ్యూన్ పుట్టింది (పారిస్ ని కార్మికులు సాయుధంగా వశం చేసుకుని రెండు నెలలకు పైగా తమను తాము పాలించుకున్నారు. అది పారిస్ కమ్యూన్ గా చరిత్రలో రికార్డయ్యింది). పారిస్ కమ్యూన్ కూడా మార్క్సిజం లోని ఒక అంశాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడింది.

అంటే మార్క్సిజం అనేది కేవల కారల్ మార్క్స్ బుర్రలో మాత్రమే పుట్టింది కాదు. అది అప్పటి సమాజంలో పరిపక్వానికి వచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్ధితులనుండి పుట్టింది. అప్పటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్ధితుల ఉమ్మడి ప్రభావం, కారల్ మార్క్స్ మెదడు లో ప్రతిబింబించి మార్క్సిజంగా జనించింది. (భావాలు ఎలా పుడతాయి? అని ప్రశ్నించుకుంటే, మనిషి చుట్టూ ఉన్న సామాజిక పరిస్ధితుల ప్రతిబింబాలే మెదడులో భావాలుగా జనిస్తాయి అని సమాధానం చెప్పుకుంటాము. అదే నేనిక్కడ చెబుతున్నాను. నా సొంత సిద్ధాంతం కాదిది.) కానీ మార్క్స్ కే ఎందుకు తట్టింది? మరో పుల్లయ్యకి ఎందుకు తట్టలేదు?

ఎందుకంటే, కారల్ మార్క్స్ అప్పటికి తత్వశాస్త్ర పరంగా హెగెల్ అనుచరుడుగా ఉన్నాడు. హెగెల్ నిజానికి భావవాది. కాని మార్క్సు ఫ్యూయర్ బా నుండి సోషలిస్టు భావాజాలం అందిపుచ్చుకున్నాక హెగెల్ తత్వంలోని గతి తర్కాన్ని దానికి జోడించగలిగాడు. హెగెల్ తత్వ శాస్త్రం లేనట్లయితే మార్క్సుకి ఫ్యూయర్ బా భౌతిక వాద సోషలిజం అందినా వృధా అయి ఉండేది. పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే మార్క్సు హెగెల్ కి శిష్యుడు. తన చుట్టూ అభివృద్ధి చెందిన వివిధ శాస్త్రాల సిద్ధాంతాలను ఫ్యూయర్ బా భౌతికవాదానికి అన్వయించినపుడు హెగెల్ గతి తర్కం తలకిందులుగా ఉన్న అంశాన్ని మార్క్సు గ్రహించాడు. ఈ గమనింపు అత్యంత ముఖ్యమైనది. తలకిందులుగా ఉన్న హెగెల్ గతి తర్కాన్ని యధాస్ధానానికి తెచ్చి ఫ్యూయర్ బా బౌతికవాదానికి అన్వయించి, అప్పటికి అభివృద్ధి చెందిన శక్తి నిత్యత్వ సూత్రమూ, డార్విన్ పరిణామ సిద్ధాంతమూ తదితర శాస్త్ర ఆవిష్కరణలను, తన చుట్టూ ఉన్న సామాజికార్ధిక రాజకీయ పరిస్ధితుల వెలుగులో పరిశీలించిన మార్క్సు గతితార్కిక భౌతికవాద తత్వ శాస్త్రాన్ని ఆవిష్కరించాడు.

ఈ ఆవిష్కరణ జరిగాక మార్క్సు ఇక ఎంత మాత్రమూ హెగెల్ శిష్యుడిగా లేడు. పైగా హెగెల్స్ తత్వ శాస్త్రానికి పూర్తిగా భిన్న ధృవమైన అత్యంత మౌలికమైన, ఆధునిక తత్వ శాస్త్రానికి పరమ మూలమైన గతితార్కిక భౌతిక వాద తత్వ శాస్త్రానికి సృష్టికర్తగా నిలిచాడు. గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాన్ని సామాజిక పరిణామాలకి అన్వయించి చారిత్రక భౌతికవాద సిద్దాంతాన్ని ఆవిష్కరించాడు. తన తాత్విక చింతనను ఆర్ధిక వ్యవస్ధ పునాదులకి అన్వయించి “దాస్ కేపిటల్” రచించాడు. దాస్ కేపిటల్ రచించడానికి మార్క్సుకి తోడ్పడిన ముఖ్యమైన అంశం మరొకటుంది. అది బ్రిటన్ పెట్టుబడిదారీ విధానం. బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందకపోయినట్లయితే కారల్ మార్క్స్ చేతి నుండి “దాస్ కేపిటల్” మనకి అంది ఉండేది కాదు. దాస్ కేపిటల్ లో కారల్ మార్క్సు కనిపెట్టిన అతి ముఖ్యమైన అంశం అదనపు విలువ‘. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇలా ఉంది ఇతర ఆర్ధికవేత్తలు కూడా కొంత తేడాలతో చెప్పినా, మార్క్స్ దర్శించిన అదనపు విలువను మిగిలిన వారు చూడలేకపోయారు. ఎందుకంటే వారికి గతితార్కిక భౌతికవాద తాత్విక భూమిక లేదు గనక.

అప్పటివరకూ తత్వవేత్తలు తత్వశాస్త్రాన్ని పండితులకే పరిమితమైన శాస్త్రంగా భావించేవారు. జీవిత కాలమంతా కాచివడపోసి ఉన్న మహా పండితులు మాత్రమే చర్చించుకునే శాస్త్రంగా భావించేవారు. కాని కారల్ మార్క్సు ఆ తత్వ శాస్త్రం మెడపట్టి లాక్కొచ్చి కార్మికవర్గానికి పాదాక్రాంతం చేశాడు. తత్వ శాస్త్రాన్ని కార్మిక వర్గానికి పాదాక్రాంతం చేయడం అంటే మాటలు కాదు. సమాజంలో తొంభైతొమ్మిది మందికి అర్ధం కాని శాస్త్రంగా, పడక్కుర్చీ పండితులకే పరిమితమైన శాస్త్రంగా మన్ననలందుకుంటున్న తత్వ శాస్త్రాన్ని అసలు ఉపయోగపెట్టవలసింది తొంభైతొమ్మిది మంది కష్టించి పనిచేసే వారి కోసమని కారల్ మార్క్స్ నిర్ద్వంద్వంగా నిరూపించాడు. తత్వశాస్త్రానికి ఉన్న పండిత, మేధో బంధనాలని ఒక్క ఉదుటున తెంచి కార్మిక వర్గ కాళ్ళపై పడవేసిన కారల్ మార్క్స్ బహుధా అభినందనీయుడు. సర్వకాల సర్వావస్ధలందు కూడా స్మరణీయుడు. మానవ సమాజం ఉన్నంత కాలం మనిషి శ్రమ చేయవలసిందే. శ్రమ చేయకుండా ఈ ప్రపంచంలో ఒక్క పూచిక పుల్ల కూడా నడిచిరాదు. అటువంటి శ్రామికులని ఈసడించుకుంటూ, శాస్త్రాల పరిజ్ఞానాన్ని తమ సొత్తుగా భావిస్తూ వచ్చిన కులీన వర్గ పండితుల విశ్వాసాలను మార్క్సు బదాబదులు చేస్తూ శ్రమకి అగ్రపీఠాన్ని అందించాడు.

మధ్య యుగాలలొ కులవ్యవస్ధ బలిష్టంగా ఉన్న కాలంలో మెడకు ముంత, మొలకు తాటాకు కడితే తప్ప రోడ్డు మీదకి పంచములని రానీయని వ్యవస్ధ ఉన్న కాలంలో ఒక పంచముడికి, దేశ దేశాల రాజులు వశం చేసుకోవాలని పోటీపడుతున్న ఒక అందమైన సుకుమారమైన బ్రాహ్మణ యువతిని (దురుద్దేశం ధ్వనిస్తే అది నాది కాదని విన్నవించుకుంటున్నాను) ఇచ్చి పెళ్ళి చేయడం సాధ్యమవుతుందేమో ఒక్క సారి ఊహించండి! అటు సూర్యుడు ఇటు పొడవచ్చు గాక! మన్నూ మిన్నూ ఏకం కావచ్చుగాక! సాగరములన్నియు ఏకము కావచ్చును గాక! అది మాత్రం సాధ్యం అయి ఉండేది కాదు. కానీ కారల్ మార్క్సు దాన్ని సుసాధ్యం చేశాడు. కులీనుల పడక్కుర్చీ మేధావుల చర్చలలో ఓలలాడే తత్వశాస్త్ర సామ్రాజ్యానికి కార్మికవర్గాన్ని పట్టాభిషిక్తుడిని చేయడం దానితో సమానంగా భావించవలసి ఉంది.

సరే, ఈ క్రమాన్ని బట్టి మనకు అర్ధమవుతున్నదేమిటి? కారల్ మార్క్స్ తన సిద్ధాంతాన్ని ప్రకటించేనాటికి సామాజిక, ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధ లో ఉన్న పరిస్ధుతులనుండే మార్క్సిజం పుట్టింది. ఇక్కడ ఏది ముందు? సమాజం ముందు. దాని తర్వాతే మార్క్సిజం. కారల్ మార్క్సు ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని ఊహించుకుని దానికి అనుగుణంగా తన సిద్దాంతాన్ని తయారు చేయలేదు. సామాజిక వ్యవస్ధల పరిణామాన్ని ఆయన పరిశీలించాడు. ఒక వ్యవస్ధ నుండి మరొక వ్యవస్ధ మారిన క్రమాన్ని పరిశీలించాడు వ్యవస్ధలు విప్లవాల ద్వారా మారుతున్న క్రమాన్ని పరిశీలించాడు. ఏయే విప్లవాలకు ఏయే ఆర్ధిక వర్గాలు నాయకత్వం వహించాయో, ఏయే ఆర్ధిక వర్గాలు వారికి సహకరించాయో పరిశీలించాడు. విప్లవాల అనంతరం ఏర్పడిన నూతన సమాజాల గతిని పరిశీలించాడు. ఆ గతి వెళ్తున్న మార్గాన్ని గమనించాడు. వ్యవస్ధలను పైపైన మాత్రమే చూడకుండా వ్యవస్ధ నిలబడడానికి మూలకారకులైన వర్గాలెవరో గమనించాడు. వ్యవస్ధ నిలబడడానికి మూలమైన వర్గాల పరిస్ధితినీ, మూలంగా లేకపోయినా వ్యవస్ధనంతటినీ గుప్పెట్లో పెట్టుకున్న వర్గాలేవిటో గ్రహించాడు. విప్లవాలలో వారి పాత్రను చూశాడు. బానిస వ్యవస్ధల నుండి పారిస్ కమ్యూన్ వరకూ ప్రతి విప్లవాన్నీ, ప్రతి సామాజిక పరిణామానికి ఆద్యులెవరో, చివరికి పై స్ధానానికి చేరిందెవరూ చూశాడు. ఈ పరిణామాలన్నింటిలోనూ దండలో దారంలాగా ఒక క్రమాన్ని గమనించాడు కారల్ మార్క్సు. అ క్రమంలోనే తానున్న వ్యవస్ధ తదుపరి ఏ రూపంలోకి మారుతుందో అంచనా వేశాడు. అలా వేసిన అంచనాయే సామ్యవాద వ్యవస్ధ.

ముందు వెళ్ళినవారు ఎటువైపు వెళ్లారో కనుక్కొవడానికి వెనక వచ్చేవారు ఏం చేస్తారు? వారి కాలి జాడలను చూస్తారు. అవి ఏదిక్కుకి వెళుతున్నాయో చూస్తారు. ఆ దిక్కువైపే వెళ్ళి ముందు వెళ్ళినవారితో కలుస్తారు. కారల్ మార్క్స్ చేసిందిదే. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి పెట్టుబడిదారి వ్యవస్ధ వరకూ జరిగిన పరిణామక్రమాన్నీ, ఆ పరిణామాల క్రమాన్ని శాస్త్ర బద్ధంగా, జీవ, బౌతిక, రసాయన, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, శాస్త్రాల ఆధారంగా గత సమాజాల అడుగుజాడల్ని పసిగట్టాడు. ఆ అడుగుజాడల ఆధారంగా సామాజిక పయనాన్ని గమనించి దాని భవిష్యత్తు గమనాన్ని చూశాడు కారల్ మార్క్సు. ఊహాలతో కాదు సుమా! పెట్టుబడిదారీ వ్యవస్ధ అభివృద్ధి క్రమంలోనే దాని తదుపరి వ్యవస్ధల తీరుతెన్నులను కూడా చూశాడు. తదుపరి వ్యవస్ధ మూలాలు పెట్టుబడిదారీ వ్యవస్ధలోనే ఉన్నాయని ఎత్తి చూపించి, దాని ప్రకారమే సామ్యవాద వ్యవస్ధ ఏర్పడుతుందని నిరూపించాడు.

అంటే సామ్యవాద వ్యవస్ధ యుటోపియా ఎంత మాత్రమూ కాదు. సామ్యవాద యుటోపియా కారల్ మార్క్స్ పుట్టక ముందరి సంగతి. దానికీ కారల్ మార్క్స్ నిరూపించిన సామ్యవాద వ్యవస్ధకే పొంతనే లేదు. సామ్యవాదం అనగానే మార్క్సుకి ముందరి యుటోపియా భావజాలాన్ని గుర్తు తెచ్చుకుని అదొక ఆదర్శవంతమైన సమాజం. అది ఊహలలోనిదే అని ఆలోచనలను అంతటితో ముగించడం మార్క్సిజం కాదు. మార్క్సిజం చెప్పిన సామ్యవాద వ్యవస్ధ, సామాజిక వ్యవస్ధలు తాము నడుస్తున్న దారిలో పయనమై వెళుతూ ఉన్న క్రమంలో ఏర్పడే అనివార్య సామాజిక పరిణామం. దానికి ఒకరి ఇష్టాఇష్టాలతో సంబంధం లేదు. ఒకరి ఊహలు ఆదర్శాలతో సంబంధం లేదు. ఒకరి చావు పుట్టుకలతో సంబంధం లేదు. మరొకరి సిద్ధాంత రాద్ధాంతాలతో అసలే సంబంధం లేదు. తూర్పున పొడిచే సూర్యుడు ఎటు అసమిస్తాడు? ప్రతి రోజూ లేచి ఈరోజు ఉత్తరాన అస్తమిస్తాడా, దక్షిణాన అస్తమిస్తాడా, లేక ఎప్పటిలా పడమట అస్తమిస్తాడా అని చర్చిస్తూ కూచుంటే, ఆ చర్చల ఫలితం కోసం సూర్యాస్తమయం ఆగదు. అది తన దారిన తాను పోతుంది.

హాలీవుడ్ దర్శకుడొకరు ఒక పరిస్ధితిని ఊహించి ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్అని సినిమా తీశాడు. అందులో హీరో  ముసలోడిగా పుట్టి పసివాడిగా చనిపోయినట్లు చూపిస్తాడు. ఆయన అది ఊహించి తీసిన సినిమా. అది చూసి ఏ జంటయినా అదెలాగొ ఉంటుందో చూద్దామను కుంటే సాధ్యమేనా? పెట్టుబడిదారీ వ్యవస్ధ శాశ్వతమని భావించడం అలాంటిదే. వ్యవస్ధలో సమస్యలు, వైరుధ్యాలన్నీ పరిష్కారం అయ్యేంతవరకూ అది ముందుకు పోతూ ఉంటుంది. ఆ గమనంలో కొన్ని సార్లు వెనకడుగులుండవచ్చు, మానవ సమాజం గనక. కాని అవి తాత్కాలికమే.

మనం ధరించే ఫ్యాంట్ ఎన్ని రూపాలు మార్చుకుందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం! 1970 ల ప్రారంభ కాలంలో పురుషులు ధరించిన ఫ్యాంట్ బాగా narrow గా ఉండేది. కాలికి అంటుకు పోయినట్లుండేది. ఫ్యాంట్ విడవాలంటే ఎవరైనా కింద కూర్చుని చివర్ల పట్టుకుని లాగవలసి ఉండేది. కొన్నాళ్ళకి అది అసౌకర్యంగా తోచింది. కిందినుండి తేలికగా విడవడానికి వీలు కలిగేటట్లుగా రూపం మార్చుకుని బెల్ బాటమ్ అయింది. 70 ల దశాబ్దం రెండో అర్ధభాగానికి వచ్చేసరికి ఈ బెల్ బాటం విస్తృతంగా వాడకంలోకి వచ్చింది. కానీ అది కూడా అసౌకర్యంగా మారింది. వెడల్పైన  బెల్ బాటం నేలమీదికి రాసుకుని చినిగిపోయి అసహ్యంగా ఉండేవి. మళ్ళీ narrow వైపుకి మార్పు జరిగింది. ఈ సారి అంతకుముందరి narrow కాకుండా మరికొంత సౌకర్యవంతంగా మారింది. పైన లూజుగా, కిందికి వచ్చేసరికి పాదాలలో సగం వరకు ఉండేలా మారింది. అంటే పాత నేరో లోని అసౌకర్యాన్ని తొలగించుకుని బెల్ బాటంగా మారిన సౌకర్యాన్ని నిలుపుకుంది. కానీ అదీ తర్వాత అసౌకర్యంగా మారి మొత్తం లూజుగా ఉండేలా పార్లల్ వచ్చింది. అది గొట్టం ఫ్యాంటులా ఉండేసరికి అది కొద్ది కాలం మాత్రమే మనగలిగింది. ఇప్పుడది బ్యాగీగా స్ధిరపడింది. పైనుండి కిందివరకూ ఏ స్ధానంలో ఎంత లూజు ఉండాలో అంతే ఉండేలా దర్జీలు ఫ్యాంటులు కుడుతున్నారు.

ఈ పయనానికి ఎవరు మార్గదర్శకం? ఎవరిది పధకరచన? ఏ ఒక్కరిదీ కాదు. వస్త్రధారణకి ఒక వ్యవస్ధ మనకి తెలియకుండానే ఏర్పడిపోయింది. అది comfortability వైపుగా రూపం మార్చుకుంటూ వచ్చింది. సౌకర్యవంతంగా ఉండేలా రూపం మార్చుకుంటూ వచ్చింది. ఏ వ్యవస్ధకి సంబంధించిన పరిణామ క్రమాన్నైనా చూడండి మనకొక క్రమం కనిపిస్తుంది. అది సౌకర్యవంత మైన స్ధితికి దారితీస్తూ ఉంటుంది. మన హెయిర్ స్టైల్ కూడా ఇలాగే మారుతూ వచ్చిన క్రమాన్ని మనం గమనించవచ్చు.

మానవ సమాజం కూడా అంతే. సౌకర్యవంతమైన వ్యవస్ధ స్ధిరపడేదాకా వ్యవస్ధ మారుతూ ఉంటుంది. మానవ సమాజానికి సౌకర్యవంతమైనది ఏమిటి? వైరుధ్యాలు లేకపోవడమే సౌకర్యవంతం. పేద, ధనిక వ్యత్యాసాలు, పాలకుడు పాలితుదు వ్యత్యాసాలు, పట్టణం గ్రామం వ్యత్యాసాలు, శారీరక శ్రమకూ, మేధో శ్రమకీ వ్యత్యాసాలూ, మతం, కులం, ప్రాంతం, ఇలా సమస్త వ్యత్యాసాలు పరిష్కరించబడే వరకూ సమాజం మారుతూనె ఉంటుంది. కారల్ మార్క్సు ఈ మార్పులను శాస్త్ర బద్దం చేశాడు. అది మార్క్సు రచించాడు కనక మార్క్సిజం అయ్యింది. పుల్లయ్య గమనించి రచించినట్లయితే పుల్లయ్యిజం అయి ఉండేది. మార్క్సిజం అనగానే జర్మనీకి చెందిన ఒక గడ్డపాయన రాస్తే, ఎక్కడో రష్యాలో, చైనాలో విప్లవాలు వస్తే, వారిని చూసి భారతీయులు అనుకరించేది కాదు. ధామస్ ఎడిసన్ బల్బు కనిపిడితే అమెరికా వాడు విదేశీయుడు కనిపెట్టాడని వాడడం మానేస్తున్నామా? శాస్త్ర బద్ద ఆవిష్కరణ ఎవరు చేసిన ప్రపంచం అంతా దానిని వినియోగిస్తుంది.

మార్క్సిజం అంతే. సామాజిక, రాజకీయ, ఆర్ధిక వ్యవస్ధ పరిణామ క్రమానికి చెందిన నియమాల సమాహారమే మార్క్సిజం. ఒక క్రమంలో పెట్టిన విజ్ఞానం, శాస్త్రంగా మారుతుంది. అలా మారిన సామాజికార్దిక రాజకీయ శాస్త్రమే మార్క్సిజం. ఆయన కాలంలో సామ్రాజ్యవాదం అభివృద్ధి చెందలేదు. అందుకని మొదటి విప్లవం బ్రిటన్ లో వస్తుందని మార్క్సు ఊహించాడు. ప్రపంచంలో పరిపక్వ దశకు వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ బ్రిటన్ లోనే ఉంది గనక అక్కడే మొదటిసారి సోషలిస్టు విప్లవం సంభవిస్తుందని ఆయన భావించాడు. కాని అలా జరగలేదు. కారణం?

మార్క్సు కాలంనాటికి పూర్తిగా అభివృద్ధి చెందని సామ్రాజ్యవాద వ్యవస్ధ (ఫైనాన్సియల్ పెట్టుబడిని ఎగుమతి చేసి దానిపై పట్టుద్వారా మూడవ ప్రపంచ దేశాలని అదుపులో పెట్టుకోవడం) లెనిన్ కాలానికి అభివృద్ధి చెందింది. ప్రపంచంలో ఉన్న సామ్రాజ్యవాద దేశాలు ఒకరినొకరు సహకరించుకుంటూ గొలుసుకట్టుగా ఏర్పడ్డారనీ, ఆ గొలుసుకట్టులో ఎక్కడ లింకు బలహీనంగా ఉంటే అక్కడ మొదట సోషలిస్టు విప్లవం సంభవిస్తుందని లెనిన్ సూత్రీకరించాడు. ఆయన చెప్పినట్లే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా సామ్రాజ్యవాదం బలహీనపడి అక్కడ విప్లవం బద్దలైంది. చైనాకి వచ్చేసరికి అక్కడ కార్మికవర్గం సరిగా అభివృద్ధి చెందలేదు. రైతాంగం ప్రధానంగా ఉండి భూములు వారి చేతిలో కాక భూస్వాముల చేతిలో కేంద్రీకరించబడి రైతులపై దోపిడీ సాగింది. కార్మికవర్గం అభివృద్ధి చెందని వ్యవసాయక దేశాల్లో కార్మికులు రైతులు ఉమ్మడిగా నూతన ప్రజాస్వామిక విప్లవం తేవాలని మావో సూత్రీకరించి ఆ మేరకు కృషి చేసి విజయం సాదించాడు.

అంటే మార్క్సిజం మార్క్సు సూత్రీకరణల దగ్గరే ఆగిపోలేదు. వ్యవస్ధలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందింది. మార్క్సిజం, మార్క్సిజం-లెనినిజం అయ్యింది. అది మార్క్సిజం-లెనినిజం-మావో ధాట్ గా అభివృద్ధి చెందింది. మార్క్సిజం పిడివాదం అనేవారికి ఇది సమాధానం.

కనుక మార్క్సిస్టు సూత్రాలు సామాజిక పరిణామక్రమాలనుండి గ్రహించిన క్రమానుగత నియమాల సారాంశం. ఎవరు ఏ యిస్టు లైనా, ఈ సామాజిక నియమాలకి కట్టుబడి ఉండవలసిందే. నేనుండను అన్నా అది ఆచరణలో వీలు కాదు. హోళీ పండగరోజే రంగులు చల్లడానికి జనం పరిచయం లేకపోయినా అనుమతిస్తారు. కాని రోజు వచ్చి నేనీరోజు హోళీ జరుపుకుంటున్నా, రంగులు జల్లుతా అంటే జనం నాలుగిచ్చుకుంటారు. అంటే సామాజిక నియమాలకు ఒకరి ఇష్టాఇస్టాలతో నిమిత్తం లేదు. అవి జరిగిపోతుంటాయి. అయితే మనిషి చేయగల పని ఏమిటి? ఆ నియమాలను కనుగొని, పరిణామాలు ముందుకు సాగే క్రమంలో వాటిని వేగవంతం చేయడానికి తగిన చర్యలను మనిషి తీసుకోగలడు. ఏమిటా చర్యలు? విప్లవ సిద్ధికి ఒక వ్యవస్ధను ఏర్పరుచుకుని అందుకోసం కృషి చేయడం. ఆ కృషే కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటు. ఆందోళనలు, ప్రజల సమీకరణ, వారి సహకారంతో సామాజిక మార్పుకు కృషి చేయడం. చేయకపోతే? ఆ పరిస్ధితి ఉండదు. మనిషి చేస్తాడు. ఎంతటి నిరాశామయ పరిస్ధితిలోనయినా మనిషి ప్రయత్నిస్తూనే ఉంటాడు. లేకుంటే సౌకర్యవంతమైన స్ధితి రాదు.

ఇప్పటి సామాజిక మార్పులు ఒక జీవిత కాలంలో సాద్యం కాకపోవచ్చు. ఇపుడున్నవారు తమ కృషి తాము చేస్తే తరువాతివారు అక్కడినుండి కృషిని అందుకుంటారు. ప్రజలు పూనుకోవడానికి కొన్ని సామాజిక పరిస్ధితులు కూడ అవసరమే. ఇప్పటి పరిస్ధితులు అందుకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని మార్క్సిస్టు లెనినిస్టులు భావిస్తున్నారు. కాని స్వీయాత్మక పరిస్ధితులు సిద్ధంగా లేవు. అంటే మార్పుని తలపెట్టాల్సిన కార్మిక వర్గం ఐక్యంగా లేదు. రైతులు కూడా తమ సమస్యలపై ఉద్యమిస్తున్నారు గానీ వారికి నాయకత్వం వహించవలసినవారు సిద్ధంగా లేరు. రైతాంగం, కార్మికవర్గం కూడా ఐక్యం కాలేదు. పెట్టుబడిదారీ వర్గం, వారు ఒకటికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నందున ఉద్యమాలు కూడా దూరం జరుగుతున్నాయి. కాని మనిషి అది తలపెడతాడు. ఎప్పుడన్నదే సమస్య తప్ప వస్తుందాలేదా అన్నది సమస్య కాదు.

చివరిగా చెప్పేది మానవ స్వభావం అనేది తనంతట తానే ఎక్కడా ఉండదు. మనిషి చుట్టూ ఉన్న సామాజిక పరిస్ధితుల భావాలు మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుపై ప్రతిబింబించినప్పుడు పుట్టేవే భావాలు. సమాజం నుండి పుట్టే భావాలు సామాజిక సూత్రాలకు అతీతంగా ఉంటాయనడం సరైంది కాదు. రాముడి కాలంలో పుష్పక విమానం అంటే ఆర్టిస్టులు ఎలా గీస్తారు? బోయింగ్ విమానం బొమ్మని గీయరు. నాలుగు స్తంభాలు గల మందిరం గీసి రెక్కలు తొడుగుతారు. రాముడి కాలానికి మనిషి ఊహించగల విమానం అదే. గాల్లొ ఎగిరేవాటికి రెక్కలుండాలి. రాజులు ప్రయాణించేది కనుక రాజమందిరం ఊహించి దానికి రెక్కలు తొడిగారు. మనిషి మెదడుకి తమ చుట్టూ ఉన్న పరిస్ధితులకు అతీతంగా ఊహలు, భావాలు సాధ్యం కాదని చెప్పడానికి ఇది. అలాగే ఒక మనిషి ఇస్టా ఇష్టాలు, అతని భావాలు, ఊహలు, ఆశలు అన్నీ సమాజ పరిదులకి లోబడే ఉండాలి ఉంటాయి కూడా. మనిషి భౌతిక పరిస్ధితికి అతీతంగా అతని ఊహలు, భావాలు ఉంటాయని భావిస్తే చాలా శాస్త్రాలని తిరగరాయాల్సి ఉంటుంది.

అందువలన మనిషి స్వభావం ఊహాతీతంగా, సామాజిక నియామలకు అతీతంతా ఉండదని గ్రహించాలి. అది గ్రహించాక ఇతర అనుమానాలన్నీ దూదిపింజల్లా తేలిపోవలసిందే.

2 comments

 1. చాలా బాగుంది సర్.
  బాలగోపాల్ గారి భావజాలాన్ని రంగనాయకమ్మ గారు కాక ఇంకెవరైనా కూడా విమర్శించారా? వాటిలో వేటికైనా ఆయన జవాబులిచ్చారా?
  నేను చదివిన బాలగోపాల్ ‘మనిషీ మార్క్సిజమూ’ లో నాకర్ధమైనంత వరకూ ఆయన ఇలా అభిప్రాయపడినట్టు తోచింది. కాపిటలిస్ట్ వ్యవస్థ పతనం తప్పదు కానీ భవిష్యత్తులో సోషలిజం వస్తుందో, ఇంకా దాని కంటే మెరుగైన దేదైనా వస్తుందో అని ఆయన ఊహాగానాలు చేసారనిపించింది.
  సోషలిజం అంతిమ గమ్య స్థానం కాదనడానికి ఆయన ఇచ్చే కారణం – మానవ స్వభావం. మానవుడు తన స్వార్ధ ప్రయోజనాలకో లేక తన వారి ప్రయోజనాలకో తప్ప మానవాళి అంతటికీ ప్రయోజనం చేకూర్చాలని ప్రవర్తించడట, ఆ విషయం మార్క్సిజం పరిగణన లోకి తీసుకోలేదట. అందరికీ ‘ఉమ్మడి ప్రయోజనం’ ఉందనుకోడం లోనే సిద్ధాంత లోపం ఉందని ఆయన వాదం.
  ఆయన వేసిన ప్రశ్నలన్నిటికీ మార్క్సిజం లోనే జవాబులున్నాయని మీరు రాసారు, నిజానికి అదే నా విశ్వాసం కూడా. ఏ పుస్తకాలు చదివితే వీటి పట్ల సరైన అవగాహన కలుగుతుందో వివరించగలరు. ఆయన (అటువంటి భావజాలపు) విమర్శలకు జవాబులను వెతుక్కునేందుకు మీ సహాయం అపెక్షించి ఇదంతా రాస్తున్నాను.

 2. కళ్యాణి గారు ఆర్టికల్ లో చెప్పినట్లు బాలగోపాల్ గారి వాదనకు రంగనాయకమ్మ గారే సమాధానం ఇచ్చారు. “కొండను తవ్వి ఎలకను కూడా పట్టనట్లు” పేరుతో ఆమె రాసిన పుస్తకంలో మీరు కోరిన జవాబులు ఉంటాయి.

  మానవ స్వభావం అన్న కాన్సెప్టే అర్ధ రహితం. మనిషికి సంఘంలోని పరిసరాల నుండి ఒక స్వభావం వస్తుంది తప్ప ‘మానవ స్వభావం’ అంటూ ఒకటి దానంతట అదే మనిషిలో ఉండదు. ఒక వ్యక్తి సమాజం నుండి తాను స్వీకరించగలిగిన అంశాల నుండే ఆ వ్యక్తి యొక్క స్వభావం నిర్ణయం అవుతుంది. ఈ స్వభావం ఎల్లప్పుడూ సంబంధిత స్ధలము, కాలం లలోని సామాజిక వాస్తవాలకు కట్టుబడి ఉంటుంది తప్ప భిన్నంగా, అతీతంగా ఉండదు.

  ఈ బ్లాగ్ లోనే “మావో ఆలోచనా విధానం అంటే ఏమిటి?” పేరుతో మరో ఆర్టికల్ ఉంది. వీలయితే చదవగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: