మావోయిస్టులది హింస కాదు, ప్రతి హింస -అరుంధతీ రాయ్ ఇంటర్వ్యూ

మావోయిస్టులలో 99 శాతం గిరిజనులే -రాయ్ (మావోయిస్టులతో అరుంధతి)(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలకు బుకర్ ప్రైజ్ గెలుచుకుని ప్రపంచానికి పరిచయం అయినప్పుడు ఆమె భారతీయ ఆంగ్ల సాహిత్యానికి కీర్తి, వన్నె తెచ్చిన ఒక అర్బన్ మహిళ. తర్వాత్తర్వాత భారత దేశ శ్రామిక ప్రజలకు నిఖార్సయిన, రాజీలేని మద్దతుదారుగా అవతరించిన అరుంధతి, భారత పాలక వర్గాలకు కంటిలో నలుసుగా మారారు.

‘వాకింగ్ విత్ ద కామ్రేడ్స్’ వ్యాస రచన ద్వారా మావోయిస్టుల లేదా మార్కెస్టు-లెనినిస్టు తాత్విక చింతనతో దాదాపు ఏకీభవించిన రాయ్, ‘కేపిటలిజం: ఎ ఘోస్ట్ స్టోరీ’ రచన ద్వారా దేశ సహజ వనరులను స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారీ వర్గం ఏ విధంగా కొల్లగొడుతున్నదీ శక్తివంతగా వివరించారు.

పాలకవర్గాలతో కుమ్మక్కై ప్రజల పోరాటాలను అందమైన వాగాడంబరాల మాటున పక్కదారి పట్టించి, నీరుగార్చే ఎన్.జి.ఓ (నాన్ గవర్న్ మెంటల్ ఆర్గనైజేషన్స్) లు కుప్పలు తెప్పలుగా వెలిసిన భారత దేశంలో అరుంధతీ రాయ్ లాంటి అర్బన్ మేధో మహిళ భారత దేశంలోని అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య పీడితులైన అశేష శ్రామిక ప్రజలకు అందించిన మేధో మద్దతు అనుపమానం అని చెప్పవచ్చు.

ఈ ఇంటర్వ్యూ 2010లో ఆమె సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ యాంకర్ సాగరికా ఘోష్ కు 2010 ఏప్రిల్ లో ఇచ్చినది. ఛత్తీస్ ఘర్ లో మే 25 తేదీన రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకుల కాన్వాయ్ పైన మావోయిస్టులు జరిపిన మెరుపుదాడి తర్వాత భారత కార్పొరేట్ పత్రికలు మరొకసారి మావోయిస్టులపై విషం కక్కుతున్నాయి. దేశ సహజ వనరులను కొల్లగొడుతున్న విదేశీ కంపెనీల దురన్యాయాలపైనా, వారికి మద్దతుగా మహేంద్ర కర్మ లాంటి నాయకులు ‘సల్వాజుడుం’ లాంటి సంస్ధల ద్వారా అమాయక గిరిజన ప్రజానీకం పై సాగించిన ఊచకోతల పైనా పల్లెత్తు మాట మాట్లాడని పత్రికలు దేశంలో హింస మే 27, 2013 తేదీనే మొదలైనట్లు గగ్గోలు పెడుతున్నాయి. ఈ సందర్భంలో ఆమె ఇంటర్వ్యూని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ వెబ్ సైట్ పునర్ముద్రించింది. ఆ ఇంటర్వ్యూ యధాతధ అనువాదం ఇది. -విశేఖర్)

——***——

సాగరిక ఘోష్ (ఎస్.జి): దంతెవాడ ఘటన*కు ముందు ది ఔట్ లుక్ పత్రిక కోసం మీరు ‘వాకింగ్ విత్ ద కామ్రేడ్స్’ అని ఒక ఆర్టికల్ రాశారు. దంతెవాడ (ఘటన) తర్వాత కూడా ఆ వ్యాసంలో మావోయిస్టుల లక్ష్యం పట్ల మీరు వ్యక్తపరిచిన సానుభూతితో ఇంకా కొనసాగిస్తున్నారా?

అరుంధతీ రాయ్ (ఎ.ఆర్): దంతెవాడ ముందు, తర్వాత అనే చట్రంలో ఇరికించడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే, ఈ హింసాత్మక వలయం నిజానికి ఎప్పటి నుండో జరుగుతూ వస్తున్నదేనని మీకు తెలుసు. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను చంపడం ఇదే మొదటిసారి కాదు. దానితోపాటు 2005-07 మధ్య కాలంలో చోటు చేసుకున్న దాడుల గురించి నేను రాశాను. నేను వాటిని ఎలా చూస్తానంటే, ‘ఓహో, సి.ఆర్.పి.ఎఫ్ జవాన్ల హత్యల పట్ల ఆనందం ప్రకటించే ప్రజలు ఇటువైపూ ఉన్నారు, మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టాలని కోరే ప్రజలు అటువైపూ ఉన్నారు’ అని ధ్వనించేలాగా జనం చెబుతారు. ఇది అలాంటిది కాదు. ప్రజలపైన బలవంతంగా రుద్దబడుతున్న ఒక యుద్ధంలో, దురదృష్టవశాత్తూ ఆ యుద్ధం పేదలపై ధనికులు సాగించే యుద్ధంగా అవతరిస్తున్న పరిస్ధితుల్లో; ఒక వ్యవస్ధలో ప్రతి చావునీ ఓ భయంకరమైన విషాదంగా మీరు చూడవలసి ఉంటుంది. ఇందులో పేదలలోకెల్లా అతిపేదలైనవారిని పేదలపై యుద్ధానికి ధనికులు నిలబెడతారు. సి.ఆర్.పి.ఎఫ్ (జవాన్లు) భయంకరమైన బాధితులు. కానీ వారు కేవలం మావోయిస్టుల వల్ల మాత్రమే బాధితులు కాదు. ఇప్పుడు చోటు చేసుకుంటున్న నిర్మాణాత్మక హింసతో కూడిన ఒక వ్యవస్ధకు వారు బాధితులు; కొనసాగుతూ పోయే ఈ శూన్య ఖండనల పరిశ్రమలో ముంచివేయాల్సిన తరహా హింస అది. ఇది పూర్తిగా అర్ధరహితం, ఎందుకంటే, వాటిని (హింసలను) ఖండించేవారికి, చాలావరకు, వారిపట్ల (జవాన్ల పట్ల) సానుభూతి ఏమీ ఉండదు. వారిని కేవలం పావులుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారు.

ఎస్.జి: మరయితే హింసా వలయాన్ని ఎవరు బద్దలు చేస్తారు? తాను ఏ అభివృద్ధి పనిని చేపట్టినా, బ్రిడ్జిల నిర్మాణం గానీ లేక ఒక స్కూల్ ప్రారంభించినా గానీ, వాటిని మావోయిస్టులు పేల్చివేస్తున్నారనీ, అందుకే ఆ ప్రాంతాన్ని (మావోయిస్టులు లేకుండా) తుడిచి పెడుతున్నామనో, లేదా పరిశుభ్రం కావిస్తున్నామనో ప్రభుత్వం చెబుతోంది. మీ ప్రకారం ఆ హింసా వలయాన్ని ఆపడం  రాజ్యం మాత్రమే చేయగలదనా, రాజ్యం (తన బలగాలను) ఉపసంహరించుకున్నట్లయితేనే అది సాధ్యమనా మీ ఉద్దేశం?

ఎ.ఆర్: దానికొక మామూలు తరహా లిట్మస్ పరీక్ష ఉంది: మావోయిస్టులు లేని పేద ప్రాంతాల్లో ఆసుపత్రులు, స్కూళ్ళు, ఇంకా అలాంటి గొప్ప భారీ అభివృద్ధి ఉందనా దానర్ధం? అలా లేదు కదా. నిజం ఏమిటంటే, బిలాస్ పూర్ లాంటి చోట్ల డాక్టర్లు నిర్వహించిన అధ్యయనాలను చూసినా, డాక్టర్ బినాయక్ సేన్ చెప్పిన పౌష్టికాహార సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు పాఠశాలల లోపలికి వెళ్ళినట్లయితే అవి బ్యారక్ లుగా ఉపయోగించబడడాన్ని మీరు చూడవచ్చు. అవి బ్యారక్ లుగానే నిర్మించబడ్డాయి. కాబట్టి మావోయిస్టులు పాఠశాలలను పేల్చివేస్తున్నారు కాబట్టి వారు అభివృద్ధికి వ్యతిరేకం అన్నవాదన హాస్యాస్పదం.

ఎస్.జి: మీరు రాజ్య హింసను ఖండిస్తారు. కానీ నక్జల్స్ హింసను మీరు ఖండించరని మీ మీద ఆరోపణ. నిజానికి మీరు దానిని (నగ్జల్ హింసను) హేతుబద్ధం చేస్తారు. హింసను ఆరాధ్యనీయం (రొమాంటిసైజ్) సైతం చేస్తారు. ఇది మీపై చేయబడిన ఆరోపణ. నిజానికి మీరు రాసిన వ్యాసంలో నుండి చదివి వినిపించగలను కూడా. మీరేమీ రాశారంటే, “హింస యొక్క నిష్ప్రయోజనం గురించి ఏదో ఒకటి చెప్పాలన్న కోరికగా నాకు ఉందని నేను భావిస్తాను. కానీ వారేం చేస్తున్నారని నేను సూచించాలి? కోర్టుకు వెళ్లమనా, ర్యాలీ? అమరణ నిరాహార దీక్ష చేయాలనా, ఇవన్నీ హాస్యాస్పదంగా ధ్వనిస్తాయి; ఏ పార్టీకి వాళ్ళు ఓటు వేయాలి, ఏ ప్రజాస్వామిక సంస్ధ వద్దకు వారు వెళ్ళాలి?” అహింస నిష్ప్రయోజనమని మీరు చెబుతున్నట్లు కనిపిస్తోంది?

ఎ.ఆర్: అహింస గురించి, అహింసాయుత ఉద్యమాల గురించి గత 10 సంవత్సరాలుగా రాస్తున్న ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణ చేయడం ఒక వింత. కానీ అడవుల్లోకీ వెళ్ళినపుడు నేను చూసింది ఇది – అహింసాయుత ప్రతిఘటన వాస్తవంగా పని చేయలేదు; ‘నర్మదా బచావో ఆందోళన్’ లో పని చేయలేదు, మరే ఇతర అనేక అహింసాయుత ఉద్యమాలలోనూ పని చేయలేదు, మిలిటెంటు ఉద్యమాలు కూడా పని చేయలేదు. ఉద్యమాలలోని కొన్ని భాగాలలో అది పని చేసింది. కానీ అడవుల లోపల అది వేరే కధ. ఎందుకంటే, అహింస, ముఖ్యంగా గాంధేయవాద అహింస అనేదానికి ఒక విధంగా చెప్పాలంటే అలకించేవారు (audience) కావాలి. అది, ఆలకించేవారు కావలసిన ఒక నాట్య ప్రదర్శనా క్షేత్రం. అర్ధరాత్రి వేళ అటవీ గ్రామాన్ని ఒక వెయ్యి మంది పోలీసులు వచ్చి చుట్టుముడితే వాళ్లేమి చెయ్యాలి? తినడానికి ఆహారమే లేనివారు నిరాహార దీక్ష ఎలా చేయాలి? అసలు చెల్లించడానికి డబ్బే లేనివారు పన్ను చెల్లింపులను, విదేశీ వస్తువులను లేదా వినియోగ సరుకులను ఎలా బహిష్కరించాలి? 

వారి వద్ద ఏమీ లేదు. అడవిలోని హింసను నేను ‘ప్రతి హింస’గా చూస్తాను. ‘ప్రతిఘటనా హింస’గా చూస్తాను. అంతకంతకూ పెరుగుతూ పోయే హింసా వలయం నెలకొని ఉందన్న వాస్తవం పట్ల నేను భయభ్రాంతురాలనవుతాను – ప్రభుత్వం మరిన్ని ఆయుధాలు పోలీసుల చేతికి ఇచ్చేకొద్దీ, ఆ ఆయుధాలు చివరికి మావోయిస్టు పి.ఎల్.ఎ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) చేతుల్లోకి వెళ్తున్నాయి. ఏ సమాజానికైనా అది భయంకరమైనదే. అందులో నాకు ఏ విధమైన ఆరాధన ఉన్నదని నేను అనుకోవడం లేదు. అయితే, నేను ఆరాధనకు వ్యతిరేకం కాదు. ఈ పేదజనం వేలాది మంది పారా-మిలటరీ బలగాలను పంపుతున్న అత్యంత శక్తివంతమైన రాజ్యాన్ని ఎదుర్కొని నిలబడడం నమ్మలేని వాస్తవంగా నేను భావిస్తాను. అంటే, ఆ అడవుల్లో ఆ ప్రజలకు వ్యతిరేకంగా ఎ.కె-47 లతో, గ్రెనేడ్లతో వారు ఏమి చేస్తున్నారు?

ఎస్.జి: కానీ మావోయిస్టుల వద్ద కూడా ఎ.కె-47 లు ఉన్నాయి కదా? వారి వద్ద ప్రెజర్ బాంబులు కూడా ఉన్నాయి?

ఎ.ఆర్: వాటిని పోలీసుల వద్ద నుండి లాక్కున్నారు.

సాగరికా ఘోష్: ఈ హింసా వలయానికి వ్యతిరేకంగా మీలాంటివారు గొంతెత్తవలసిన అవసరం లేదంటారా? లేదా మీలాంటి వారు వాస్తవానికి దానికి హేతుబద్ధతను కనిపెట్టడానికి ప్రయత్నించాలంటారా? ఎందుకంటే, మిమ్మల్ని ‘మావోయిస్టుల ఆపాలజిస్టు’గా పిలుస్తున్నారు! బి.జె.పి మిమ్మల్ని ‘నగ్నలిజం యొక్క అధునాతన ముఖం’ అని పిలుస్తారు. వారి హింసకు వ్యతిరేకంగా మీరు గొంతెత్తకపోతే, రాజ్యం (యొక్క హింస) కు నైతికంగా న్యాయబద్ధమైన ప్రతిఘటన అని చెబుతూ అది నైతికంగా సమర్ధనీయం అని చెబితే, పౌర సమాజంలోని ఒక సభ్యురాలిగా మీరు విఫలం చెందడం లేదా?

అరుంధతీ రాయ్: లేదు. నేను అలా (విఫలం అయినట్లు) కాదు. ప్రతి ఒక్కరూ ‘అది చాలా భయంకరం’ లాంటివి ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటే అది యధాతధ పరిస్ధితి కొనసాగింపుకు మద్దతు ఇవ్వడమే అవుతుంది. వాస్తవంలో ఆ గిరిజన ప్రాంతాల్లో ‘సామూహిక హత్యాకాండ పరిస్ధితిని’ సృష్టిస్తున్న భయంకరమైన నిర్మాణాత్మక హింసను పరిగణనలోకి తీసుకోకుండా దానిని (యధాతధ పరిస్ధితి) కొనసాగనిద్దాము (అని చెప్పడం అవుతుంది). అక్కడ ఉన్న పోషకాహార లోపం యొక్క స్ధాయిలను మీరు చూసినట్లయితే, అక్కడి ప్రజల పూర్తి నిరాశా నిస్పృహలను మీరు చూసినట్లయితే; ఆ ప్రజలను హింసించడం ఆగితేనే (ప్రతి) హింస ఆగుతుందని బాధ్యతాయుత పౌరుడు ఎవరైనా చెప్పాల్సి ఉంటుంది. అనేక దేశాల జనాభా కంటే పెద్దదైన ఆ గిరిజనాల సమూహం వాస్తవానికి తమను తాము నిర్మూలించుకోవడానికి వ్యతిరేకంగా పోరాడుతూ,  తమ ఉనికికి కొన అంచున ఉన్నది. రాజ్యం యొక్క హింసతో వారి ప్రతిస్పందనలను, వారి ప్రతిఘటనను నేను సమానం చేయలేను. రెండింటినీ సమానం చేయడం అనైతికం అని నేను భావిస్తాను.

ఎస్.జి: మీ వ్యాసంలోని ఇతర అంశాలను మీ దృష్టికి తెస్తాను. మీరు గాంధి విషయంలో ప్రత్యేకంగా కఠినంగా ఉన్నారు. భారత దేశంలో విప్లవ కలను చారు మజుందార్ ఒక వాస్తవ ఉనికిగా ఉంచారన్నారు. ఆ కల అనేది లేకుండా సమాజాన్ని ఊహించండి, ఎందుకంటే అలా ఊహించినా గాంధీ పట్ల అంత కఠినంగా తీర్పు ఇవ్వలేము. ముఖ్యంగా, ‘గాంధీ అహింసా మార్గం, దాని ట్రస్టీషిప్ భావనలు, పవిత్ర భక్తి మాటున దాగిన కపటత్వం’ అనే అవగాహనా పొత్తిళ్లలో మనల్ని మనం చుట్టుకోనంతవరకూ. మనం కాల్పులకు గురవుతున్నపుడు ఏమి చేయాలో మీకు తెలుసా అని కూడా మీరు అడుగుతున్నారు… గాంధి అపహాస్యం చేయదగిన వ్యక్తి అని మీరు భావిస్తున్నారా?

ఎ.ఆర్: అపహాస్యం చేయదగిన కొన్ని విషయాలు గాంధి గురించి ఉన్నాయని నేను భావిస్తాను; గొప్ప గౌరవం ఇవ్వవలసిన అంశాలు గాంధీ గురించి కొన్ని ఉన్నాయని కూడా నేను భావిస్తాను. ముఖ్యంగా వినియోగం, కనీసమైన మరియు భరించయోగ్యమైన జీవనం లకు సంబంధించిన ఆయన భావాలు. అయితే, ట్రస్టీషిప్ గురించి ఆయన ఏమన్నారో నన్ను చదవనివ్వండి. ట్రస్టీషిప్ గురించిన ఆయన అవగాహనకు సంబంధించిన కొటేషన్ ఇది, “ధనికుడు తన స్వాధీనంలో ఉన్న సంపదలో నుండి తన హేతుబద్ధ అవసరాలకు తగినంతగా వినియోగించుకుని మిగిలినదాని పట్ల సమాజం యొక్క బాగోగుల కోసం ఒక ట్రస్టీగా వ్యవహరిస్తాడు.” ఇది అపహాస్యం చేయదగిన ఒక ప్రకటన అని నేను భావిస్తాను. దానిని అపహాస్యం చేయడానికి నాకేమీ సమస్య లేదు.

ఎస్.జి: అమెరికాలో, లెఫ్ట్ ఫోరం వేదికపైన మార్చిలో ఒక లెక్చర్ ఇస్తూ ‘భారత దేశం ఒక బూటకపు ప్రజాస్వామ్యం’ అని మీరన్నారు. హింసకు మీరిచ్చే సమర్ధన లేదా అర్ధ-సమర్ధన తో అది కొంతవరకు ఏకీభవిస్తుంది. భారత ప్రజాస్వామ్యం బూటకమైనది కాబట్టి మావోయిస్టులకు భారత ప్రజాస్వామ్యం ఎటువంటి నమ్మకాన్ని ఇవ్వలేదని మీరు భావిస్తారా?

ఎ.ఆర్: లేదు. ఇండియా అల్ప సంఖ్యలో ఉన్న ధనికుల స్వామ్యం అనీ, మధ్య తరగతి వర్గం, ఉన్నత తరగతి వర్గాల ప్రజలకు అది ప్రజాస్వామ్యంగా పని చేస్తుందని నేను రూఢిగా భావిస్తాను.

ఎస్.జి: కానీ అది బూటకపు ప్రజాస్వామ్యం కదా?

ఎ.ఆర్: అవును. ప్రజాసామాన్యం కోసం అది పనిచేయదు గనుక అది బూటకపు ప్రజాస్వామ్యం. కనుక, పూర్తిగా శూన్యీకరించబడిన ఒక వ్యవస్ధ ఇక్కడ ఉన్నది, పేదలకు ఎ మాత్రం ప్రవేశం లేని సంస్ధలు ఇక్కడ ఉన్నాయి. ప్రజాస్వామిక వ్యవస్ధను గనుక మీరు చూసినట్లయితే, ఎన్నికలు, కోర్టులు, మీడియా, న్యాయ వ్యవస్ధ వీటన్నిటినీ చూడండి. ఒక ప్రమాదకరమైన వ్యవస్ధా నిర్మాణం ఇక్కడ కొనసాగుతోంది. ఈ దేశంలో విశాలరాశులలో ఉన్న పేద ప్రజానీకాన్ని అంతకంతకూ మినహాయించుకుంటూ, పక్కకు నెట్టుకుంటూ పోతే; అందుకే నేను దానిని బూటకం అంటున్నది. మీరు మీ కాలిని ఎక్కడ మోపుతారు అన్నదానిని బట్టి అది కొంతమందికి పని చేస్తుంది, మరికొంతమందికి పని చేయదు. గ్రేటర్ కైలాస్ లో మీరు నిలబడితే; నిజమే, అది నిజంగా గొప్ప, క్రీయాశీలకమైన ప్రజాస్వామ్యం, కానీ దంతెవాడలో నిలబడి చూడండి -అదసలు ప్రజాస్వామ్యమే కాదు. అడవుల నుండి బైటికి వచ్చి సల్వాజుడుం శిబిరాల్లో నివశించకపోతే గనుక అలాంటి వారంతా మౌలికంగా టెర్రరిస్టులే అని ప్రకటించిన ముఖ్యమంత్రిని మీరు కలిగి ఉన్నారు. కాబట్టి మీ కోళ్ళను చూసుకుంటే, మీ పొలాలను సాగు చేసుకుంటే అది టెర్రరిస్టు చర్యా? అది ప్రజాస్వామ్యమేనా?

ఎస్.జి: దీనికి పరిష్కారం చెప్పవలసిన అవసరం మీకు వస్తే, మీ పరిష్కారం ఏమిటి? ఈ ప్రతిష్టంభనను బద్దలు కొట్టడానికి మీరు చూపే మార్గం ఏమిటి?

ఎ.ఆర్: ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, తాత్విక స్ధాయిలో, నేనేమంటానంటే, (భూ) గ్రహాన్ని ఇలాంటి సంక్షోభంలోకి నెట్టిన తలంపు ఏదైతే ఉన్నదో అది ఒక ప్రత్యామ్నాయ పరిష్కారం చూపుతుందని నేను నమ్మడం లేదు. కాబట్టి కనీసం మనం చేయగలిగింది ఏమిటంటే, మన గతాన్ని కాపాడగలరని , అదే సమయంలో మన భవిత కోసం తగిన వివేకం కలిగినవారని ఎవరైతే మనం మనం భావిస్తామో వారిని చైతన్యవంతులను కావించండి.

కానీ “ఆపరేషన్ గ్రీన్ హంట్” విషయానికి వస్తే నేను మూడు అంశాలను చెబుతాను. ఈ అవహనా ఒప్పందాలు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్టులు మొదలైనవాటి విషయంలో ప్రభుత్వం పరిశుభ్రంగా ముందుకు రావాలని నేను భావిస్తాను; అవి ఏమిటో బహిరంగంగా ప్రకటించి మనకు చెప్పాలి. ప్రస్తుతానికి వాటిని స్తంభింపజేయాలి. బైటికి నెట్టివేయబడిన గ్రామాల ప్రజలందరికీ, కొన్ని వందల వేలమంది జనం గురించి మనం మాట్లాడుకుంటున్నాము, పునరావాసం కల్పించాలి. తుపాకులను ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది.

ఎస్.జి: ప్రతి దేశమూ వృద్ధి చెందడానికి ఖనిజ వనరులను వినియోగిస్తుంది. మన దేశానికి కావలసిందే అభివృద్ధి. ప్రస్తుత మావోయిస్టు నాయకత్వం పోస్కో ( దక్షిణ కొరియా ఉక్కు కంపెనీ) తో సంబంధాలు నెరిపేది; (వారికి) సంవత్సరానికి చెల్లించవలసిన నష్టపరిహారం రు. 30 లక్షలు. అంతమొత్తాన్ని వారు మావోయిస్టులకు చెల్లించేవారు. ఇప్పుడు ఆ ఒప్పందాలేవీ లేవు. అన్నీ రద్దయ్యాయి. ఆ ప్రాంతాలలోని ప్రాజెక్టులన్నింటినీ రద్దు చేసుకుని వెళ్లిపోవాలని మీరు ప్రతిపాదిస్తున్నారా?

ఎ.ఆర్: మైనింగ్ రంగాన్ని ప్రైవేటీకరించడం వలన ఇప్పుడు ఏం జరుగుతున్నదో మీరు చూడండి. మైనింగు వృద్ధిని పైకి తోస్తుందన్న ఒక తప్పుడు తరహా అవగాహన వ్యాపించి ఉంది. దానిని (అభివృద్ధిని) అది ఒక వింత పద్ధతిలో పైకి నెడుతుంది. నిజమైన అభివృద్ధితో దానికి ఎలాంటి సంబంధమూ లేదు. కానీ ప్రభుత్వం పొందుతున్న రాయల్టీలను చూస్తే గనుక, ఉదాహరణకి ముడి ఇనుమును తీసుకుంటే 5,000 టన్నుల లాభానికి గాను కేవలం 27 రూపాయలు మాత్రమే ప్రైవేటు కంపెనీ చెల్లిస్తుంది. ఇతర ప్రజల ఆర్ధిక స్ధితిగతుల పర్యావారణాన్ని ఏ మాత్రం గమనంలో ఉంచుకోకుండా మనం మూల్యం చెల్లిస్తున్నాము. కాబట్టి ఈ అభివృద్ధి అనేదే ఒక మిధ్య.

సాగరికా ఘోష్: మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి మీరు ఇష్టపడతారా? ఎందుకంటే కబీర్ సుమన్ తో పాటు మీ పేరు కూడా వారు (మావోయిస్టులు) మధ్యవర్తిత్వం కోసం ప్రతిపాదించారు. అయితే మీరు తిరస్కరించారు. మీరు ఎవరికి భయపడుతున్నారు? మీరు మధ్యవర్తిత్వం వహించవచ్చు కదా?

అరుంధతీ రాయ్: నేను నాకే భయపడుతున్నాను. అలాంటి నిపుణుతలు నాకు లేవు. నాపైన నాకు నమ్మకం లేదు. మీరు బాస్కెట్ బాల్ ఆటగాళ్లయితే మీరు ఈతగాళ్ళు కాలేరు (అనలేము) కదా? ఆ విషయంలో బాగా పని చేసేవారు కొందరు ఉంటారు, కానీ వారిలో నేను ఒకరినని నేను అనుకోవడం లేదు. కానీ మనం ఒక ప్రశ్న అడగాలని నేను భావిస్తున్నాను. అదేమిటంటే, మనం మావోయిస్టు అని అంటున్నపుడు ఎవరిని ఉద్దేశించి అంటున్నాము? ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ ఎవరిని లక్ష్యంగా చేయాలనుకుంటోంది? ఎందుకంటే, ఇదిగో… ఇక్కడ మావోయిస్టులు ఉన్నారు, అదిగో… అక్కడ గిరిజనులు ఉన్నారు, అనే ప్రత్యేకమైన విభజన చేస్తున్నారు. మరో పక్క చూస్తే మావోయిస్టులు గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని కొందరు చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏదీ నిజం కాదు. నిజం ఏమిటంటే 99 శాతం మంది మావోయిస్టులు గిరిజనులే. కానీ గిరిజనులంతా మావోయిస్టులు కాదు. అయినప్పటికీ వారి సంఖ్య పదుల వేల సంఖ్యలో ఉన్నారు. వారంతా తమను తాము అధికారికంగానే మావోయిస్టులం అని చెబుతారు. వారిలో 90,000 మంది మహిళా సంఘాలకు చెందినవారు. ఒక 10,000 మంది వరకూ సాంస్కృతిక సంఘాలకు చెందినవారు. కాబట్టి వారందరినీ తుడిచిపెట్టేస్తారా?

ఎస్.జి: హోమ్ మంత్రి పి.చిదంబరం (ఇప్పుడు మాజీ) కు మీరు ఏమని సందేశం ఇస్తారు? ఏ తరహా సందేశాన్ని మీరు ఆయనకు ఇవ్వదలుచుకున్నారు? ఆయన తన అహం కోసం ఈ యుద్ధం చేస్తున్నారని మీరు భావిస్తున్నారా?

ఎ.ఆర్: ఆయన తాను సేవ చేయదలుచుకున్న  కార్పొరేట్ కంపెనీల కోసం -ఎన్రాన్ నుండి వేదాంత వరకు తాను ప్రాతినిధ్యం వహించిన అన్ని కంపెనీలు- ఒక ఊహా చిత్రాన్ని (ఏర్పాటు చేసుకుని) దానికోసం  యుద్ధం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆయన తప్పనిసరిగా అవినీతిపరుడే అయ్యుంటాడని నేను ఆరోపించడం లేదు. కానీ ఈ దేశాన్ని అత్యంత తీవ్ర పరిస్ధితిలోకి నెడుతున్న ఒక ఊహా ప్రపంచాన్ని ఆయన కలిగి ఉన్నాడని నేను ఆరోపిస్తున్నాను. అది మనందరిని విపత్కర పరిస్ధితిలోకి తీసుకెళ్తోంది.

ఎస్.జి: మీపైన మోపబడిని కేసు గురించి మీరు చింతిస్తున్నారా? ఛత్తీస్ ఘర్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కింద మీపైన ఒక ఫిర్యాదు నమోదయింది. మీ ఆర్టికల్ తర్వాత మీరు మావోయిస్టులకు మద్దతు ఇస్తున్న విషయం పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజ్యం ప్రాసిక్యూషన్ పట్ల చింతిస్తున్నారా?

ఎ.ఆర్: ఖచ్చితంగా. చింత లేనట్లు చెబితే నేను వాగాడంబరిని అవుతాను. కాను వారు వెంటపడినవారిలో నేను మొదటి వ్యక్తిని కాను. జనానికి ఒక హెచ్చరిక పంపాలని వారు ప్రయత్నిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారీ యుద్ధాన్ని తీవ్రం చేయాలనుకుంటున్నారని నా భావన. ఈ దేశపు అత్యంత పేద ప్రజలపైనా డ్రోన్ దాడులను మనం చూడబోతున్నాం. అంతేకాకుండా యుద్ధ క్షేత్రాన్ని అష్టదిగ్బంధనం చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఎవరైనా కలిగి ఉన్నట్లయితే వాటిని వ్యక్తం చేయొద్దని హెచ్చరించడానికి వారు ప్రయత్నిస్తున్నారు.

ఎస్.జి: మీ రచనలు వివాదాస్పదం. అలా ఎందుకయ్యాయని మీరు భావిస్తున్నారు? అరుంధతీ రాయ్ ని ద్వేషించడానికి ఇండియా ఎందుకు ఇష్టపడుతోంది? మిమ్మల్ని లక్ష్యం చేసుకుని అంత విద్వేషపూరితమైన మెయిల్ ఎందుకు వస్తున్నట్లు? ప్రజలు అంగీకరించిన విషయాలను మీరు చెబుతారని జనం ఎందుకు అనుకుంటున్నారు? ఇండియా ద్వేషించడానికి ఇష్టపడే రచయితగా ఎందుకున్నారు?

ఎ.ఆర్: ఇండియాకు మీరు మాత్రమే ప్రతినిధులని మిమ్మల్ని మీరు భావించుకోవడం అతి అహంకారం అని నా భావన. సరిగ్గా దానికి విరుద్ధంగా ఉందని చెబుతాను. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆనందగా దగ్గరికి తీసుకునేవారే, అది ఒరిస్సా కానివ్వండి, నర్మదా కానివ్వండి. కానీ నేను ఏ ఘోరాల గురించయితే రాస్తున్నానో వాటిల్లో భాగస్వామ్యం ఉన్నవాళ్ళే నన్ను ద్వేషిస్తున్నారు. వారి భాగం దక్కదని వారు బెదురుతున్నారు. కానీ దేశం మొత్తం నన్ను ద్వేషిస్తోందని నేను అనుకునేపనయితే నేనేదో భయంకరమైన తప్పు చేస్తున్నట్లే అర్ధం. ఒక రాజకీయ రచయితగా అలాంటిది చేయడానికి నేను పిచ్చిదాన్ని అయుండాలి. కానీ నిజం ఏమిటంటే, అత్యంత గాఢంగా నేను ప్రేమించబడుతున్నానని నేను భావిస్తున్నాను. అసలు విషయం అదే.

ఎస్.జి: కానీ సమస్య ఒకటి ఉందని మీరు భావిస్తున్నారా? ప్రభుత్వం, మీడియా, మేధావులను టార్గెట్ చేసుకుంటున్న ఆధిపత్య సంస్కృతి… ఇవన్నీ మానవహక్కుల కార్యకర్తల లాంటివారిని టార్గెట్ చేస్తున్నాయని మీరు భావిస్తున్నారా? ఇది ప్రమాదకరమా?

ఎ.ఆర్: మరి ప్రమాదం కాకేముంది? కోబాడ్ గాంధీ పైన నేరారోపణ చేయడంలో దంతెవాడ ఢిల్లీకి వచ్చినట్లయిందని నేనొక ఆర్టికల్ చదివాను. పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్… సంస్ధలన్నీ (మావోయిస్టులకు) ఫ్రంట్ ఆర్గనైజేషన్లని చెబుతున్నారు.

భిన్నమైన అభిప్రాయం ఎవరు వ్యక్తం చేసినా వారు మావోయిస్టులే అనే ఉన్మత్త ఆరోపణల తరహా అవరోధాలను నిర్మిస్తున్నారు. ఎవరో కూడా తెలియని వందలాది మందిని తెచ్చి జైళ్ళలో కుక్కుతున్నారు. కార్పొరేట్ దాడికి గురికాని ఉద్యమం అంటూ ఏదీ లేదిక్కడ. అడవుల బైట కొనసాగుతున్న అహింసా ఉద్యమాల దగ్గర్నుండి అడవులలోపల జరుగుతున్న సాయుధ పోరాటం వరకూ అన్నీ వాస్తవంలో కార్పొరేట్ దాడులకు గురవుతున్నవే. ప్రపంచంలో మరే ఇతర చోటా ఇలాంటిది జరగలేదని నేను చెప్పగలను.

ఎస్.జి: ఒక ప్రేక్షకుడు రాసిన ప్రశ్నను మిమ్మల్ని అడుగుతాను. “ఒక 16 యేళ్ళ వ్యక్తి తుపాకితో కనపడితే దానిని చూసి నేను చాలా ఆందోళనతో దుఃఖిస్తాను. 16 యేళ్ళ వ్యక్తి చేతిలో తుపాకిని చూసి అరుంధతీ రాయ్ ఎందుకని సంబరం చేసుకుంటుంది? ఆమె చాలా అందంగా  ఉందని, ఆమెకు సమ్మోహనమైన నవ్వు ఉందని అరుంధతీ రాయ్ ఎలా చెబుతుంది?”

ఎ.ఆర్: ఎందుకంటే, ఒక 16 యేళ్ళ వ్యక్తి సి.ఆర్.పి.ఎఫ్ మనిషి చేతిలో అత్యాచారానికి గురయితే, తన గ్రామం మొత్తం తగలబడడాన్ని ఆమె చూసినట్లయితే, తన తల్లిదండ్రులు చంపబడుతున్నా చూస్తూ లొంగి ఉన్నట్లయితే నేను ఆమెను చూసి చాలా దుఃఖిస్తాను. ఎవరైనా ఒకరు లేచి నిలబడి ‘నేను దీనిపై పోరాడతాను’ అని నడుం బిగిస్తే నేను భయ విహ్వలనవుతాను. అలాంటి పరిస్ధితి రావడం నిజంగా భయంకరమైన సంగతి. కానీ తాను నిర్మూలించబడడాన్ని అంగీకరించడం కంటే అదే (తుపాకి పట్టడమే) మంచిది.

ఎస్.జి: మీ సహచర ఆలోచనాపరులు, కార్యకర్తలపై ఎక్కుపెట్టబడిన కొన్ని విమర్శలను మీకు చదివి వినిపిస్తాను. “అధికారం కోసం జరుపుతున్న వారి మొండి వెతుకులాటను అడవుల్లో నివసించేవారి న్యాయబద్ధమైన డిమాండ్లు, హక్కులు, ఆందోళనలతో ఆమె సమానం చేస్తుంది. జార్జి డబ్ల్యూ. బుష్ ని ఆమెయే అపహాస్యం చేసిన ద్వంద్వ తర్కానికి (binary logic) ఆమె నూతన అర్ధాన్ని ఇస్తుంది. ఇప్పటి క్షణంలో ఆమె స్టాక్ హోమ్ సిండ్రోమ్ బాధితురాలు. మరో వాడుక ఏమిటంటే ఆమెను (మావోయిస్టులలో) ఒదగబడిన జర్నలిస్టు (embedded journalist) అని చెప్పవచ్చు.” ఈ విమర్శకు మీరు ఎలా స్పందిస్తారు?

ఎ.ఆర్: ఒదిగిపోవడం అనేది దానికదే చెడ్డ విషయం ఏమీ కాదని నా భావన. మీరు ఎవరితో ఒదగబడ్డారు అనే విషయంపైన ఆధారపడి ఉంటుంది. మీరు మీడియాతో ఒదగబడ్డారా లేక కార్పొరేట్ లతోనా? లేక దీనిని ప్రతిఘటిస్తున్నామని తమను తాము భావించుకుంటున్న పక్షంలో ఒదగబడ్డారా? ఇక్కడ నేను మావోయిస్టుల గురించి ప్రస్తావించడం లేదు. మావోయిస్టులు ఎవరు? మావోయిస్టు సిద్ధాంతవేత్తలు – వారి పోరాట శక్తిగా ఉన్న జనానికి భారత రాజ్యం అంటేనే ఏమిటో తెలియని పరిస్ధితుల్లో, వాళ్ళ లక్ష్యం భారత రాజ్యాన్ని కూలద్రోయడమని మనం చెబుతున్నాం. కానీ ఖచ్చితంగా వారి లక్ష్యాలు, ఉద్యమాలకు ఒక యాదృచ్చికత ఉన్నది; వారు ఒకరినొకరు ఉపయోగపెట్టుకుంటున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, భారత రాజ్యాన్ని కూలదోయాలని అనుకుంటున్నది మావోయిస్టులు ఒక్కరే కాదు; హిందూత్వ ప్రాజెక్టు చేత, కార్పొరేట్ ప్రాజెక్టు చేత భారత రాజ్యం ఇప్పటికే కూలదోయబడింది.

ఎస్.జి: కాబట్టి రాజ్యంగం ఉనికిలో లేకుండా పోయిందని మీరు నమ్ముతున్నారు?

ఎ.ఆర్: అది లోతుగా బలహీనం చేయబడిందని నేను నమ్ముతున్నాను.

సాగరికా ఘోష్: ఇండియా వదిలిపెట్టి ఇంకెక్కడికయినా వెళ్ళి నివసించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?

అరుంధతి రాయ్: ఖచ్చితంగా లేదు. నావరకు అది ఒక సవాలు, ఒక సౌందర్యం, అదొక అద్భుతం, ఎందుకంటే ప్రపంచంలోకెల్లా అత్యంత కష్టభూయిష్టమైన భారతదేశ పోరాటాన్ని ఈ దేశ ప్రజలు నిర్వహిస్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నది చూస్తే నాకు నిజంగా వారికి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. నేను ఇక్కడికి చెందినదానిని. సి.ఎస్.పి.ఎ (ఛత్తీస్ ఘర్ స్పెషల్ పవర్స్ యాక్ట్) నన్ను జైల్లో పెట్టాలని కోరుకున్నా సరే, నేనేమీ స్విట్జర్లాండ్ లో నివసించబోవడం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: