మావో ఆలోచనా విధానం అంటే…

http://teluguvartalu.files.wordpress.com/2012/05/mao-thought.jpg

ఇప్పుడు ప్రపంచంలో రెండు ప్రధాన వ్యవస్ధలు ఉన్నాయి. ఒకటి సంపూర్ణ పెట్టుబడిదారీ వ్యవస్ధలు, రెండు అర్ధ భూస్వామ్య అర్ధ వలస వ్యవస్ధలు.

సాధారణంగా బయటి దేశాల జోక్యం లేకుంటే భూస్వామ్య వ్యవస్ధలను కూల్చివేయాల్సిన కర్తవ్యం పెట్టుబడిదారీ వర్గంపై ఉంటుంది. ఇతర వర్గాలను కలుపుకుని తన నాయకత్వంలో పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి నిరోధక భూస్వామ్య వర్గాన్ని ఆధిపత్యం నుండి కూలదోసి వ్యవస్ధ పగ్గాలను చేజిక్కించుకుంటాయి. దీనిని ‘ప్రజాస్వామిక విప్లవం’ అంటారు. ఇలాంటి విప్లవాలు ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా, రష్యా, జర్మనీ లాంటి దేశాలలో జరిగాయి. అందువల్లనే అవి పక్కా పెట్టుబడిదారీ దేశాలుగా పరిపక్వం చెందాయి.

మూడో ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామిక విప్లవాలకు వలస దురాక్రమణ దేశాలు అడ్డు పడ్డాయి. బ్రిటన్, ఫ్రాన్సు, హాలండ్, పోర్చుగల్ లాంటి దేశాలు వ్యాపారం కోసం వచ్చి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను ఆక్రమించి వలసలుగా చేసుకున్నాయి. వీరిలా రావడం వల్ల మూడో ప్రపంచ దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం స్వతంత్ర వర్గంగా అభివృద్ధి కాలేదు. దానికి కారణం వలస శక్తులే. వీరిని మనం సామ్రాజ్యవాదవర్గం అంటున్నాం. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వర్గం ఇతర పెట్టుబడిదారుల్ని ఎదగనివ్వదు. తనకు పోటీ రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎదగనివ్వకుండా అణచివేస్తుంది. లేదా తనకు అనుచరులుగా, జూనియర్ పార్టనర్లుగా చేసుకుంటుంది. తన ప్రయోజనాలకి లోంగి ఉండేలా చేసుకుంటుంది. మూడో ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారీ వర్గాన్ని వలస వాదులు (సామ్రాజ్యవాదులు) ఇలాగే అణచివేశారు. లేదా తమకు లొంగి ఉండేలా చేసుకున్నారు. భారత దేశ పెట్టుబడిదారీ వర్గం కూడా ఇలాగే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఎదిగారు తప్ప స్వతంత్రంగా ఎదగలేదు.

స్వతంత్ర పెట్టుబడిదారీ వర్గం అంటే ఏమిటి? పెట్టుబడిదారులు సర్వ స్వతంత్రులయితే తమ దేశ వనరులని ఇతర దేశాల పెట్టుబడిదారీ వర్గం దోచుకోవడానికి అనుమతించరు. వారికి నేషనలిస్టు సెంటిమెంట్స్ ఉంటాయి. జాతీయత వారిలో ఉట్టిపడుతుంది. జాతీయ భావనలతో సామ్రాజ్యవాద పెట్టుబడి తమ దేశంలోకి రాకుండా అడ్డుకుంటారు. మా దేశంలోకి రావడానికి మీరెవరని ప్రశ్నిస్తారు. వారిని దేశం నుండి పారద్రోలడానికి నడుం కడతారు. దురాక్రమణలకి వ్యతిరేకంగా సాయుధ యుద్ధానికి దిగుతారు. సామ్రాజ్యవాదులను లేదా వలస వాదులను దేశం నుండి తరిమి కొట్టేదాక నిద్రపోరు. వారలా చేయకపోతే వారి వారి దేశాల్లో వారే స్వతంత్రంగా తమ కార్మికవర్గాన్ని దోపిడీచేసే స్వేచ్ఛ వారికి ఉండదు.

కాని మూడో ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారీ వర్గం స్వతంత్రంగా ఎదగడానికి వలస సామ్రాజ్యవాదం అడ్డుపడింది. వారి స్వతంత్ర ఆకాంక్షలను అణచివేసి తమకు లొంగి ఉండేలా చేసుకున్నారు. ఫలితంగా పేద దేశాల పెట్టుబడిదారీ వర్గం వలస సామ్రాజ్యవాదులకు లొంగిపోయారు. తద్వారా తమ దేశ ప్రజల స్వతంత్ర ఆకాంక్షలకు ద్రోహం చేశారు. దేశ వనరులను సామ్రాజ్యవాదులు కొల్లగొడుతుంటే వారికి సహకరిస్తూ దోపిడీ సొత్తు లో జూనియర్ భాగం పంచుకున్నారు.

తమ తమ దేశాల్లో భూస్వామ్య వర్గాన్ని కూలదోసిన పెట్టుబడిదారులు (ప్రధానంగా పశ్చిమ దేశాల్లో) మూడో ప్రపంచ దేశాల్లో భూస్వామ్య వర్గాన్ని కూలదోసే పని పెట్టుకోలేదు. అది వారికి అనవసరం. తమ దేశాల్లొ తమ ఆధిపత్యానికి, పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధికీ భూస్వామ్య వర్గం అడ్డుపడింది గనక దాన్ని కూలదోయవలసిన అవసరం వారికి తలెత్తింది. కాని మూడో ప్రపంచ దేశాల్లో వారికా అవసరం లేదు. అప్పటికే ఆ దేశాలని వలసలుగా చేసుకున్నందున అక్కడి ఆధిపత్య వర్గాలన్నీ వారి ఆధీనంలోనే ఉన్నాయి. కనుక మూడో ప్రపంచ (మూ.ప్ర) దేశాల్లో భూస్వామ్య వర్గాన్ని వారు కొనసాగింపజేసారు. కాని భూస్వామ్య వర్గానిది పూర్తి ఆధిపత్యం కాదు కనక అది అర్ధ భూస్వామ్య వ్యవస్ధ అయింది వలసగా ఉంది గనక వలస వ్యవస్ధ అయింది. ఆ విధంగా ‘సో కాల్డ్’ స్వతంత్రం వచ్చేవరకూ అవి వలస-అర్ధ భూస్వామ్య దేశాలుగా కొనసాగాయి.

అర్ధ భూస్వామ్య వ్యవస్ధ అంటే భూ సంబంధాలన్నీ భూస్వామ్య వ్యవస్ధ రీతిలోనే కొనసాగడం. భూమిలో అధిక భాగం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడం. భూమి కేంద్రంగా ఉన్న శ్రామికవర్గం (రైతులు, కూలీలు) చేతిలో భూమి లేకపోవడం. భూమిపై వారు శ్రమలో అధికభాగం భూస్వాముల పరం కావడం. వలస వ్యవస్ధ అంటె దేశ వనరుల సంపద అంతా విదేశాలకు తరలి వెళ్లడం దేశంలోని ఏ వర్గానికి స్వతంత్రత లేకపోవడం. వలస శక్తుల దయాదాక్షిణ్యాలపైనే దేశీయ వర్గాలన్నీ ఆధారపడడం.

అర్ధ భూస్వామ్య వ్యవస్ధలో మేజార్టీ ప్రజలకు భూమి పధాన ఉత్పత్తి సాధనంగా, శ్రమ సాధనంగా కొనసాగుతుంది. కానీ భూస్వామ్య వర్గాలదే పూర్తి ఆధిపత్యం కాదు. వారిలో కొందరు పెట్టుబడిదారీ వర్గంగా రూపాంతరం చెందుతారు. కొంతమంది గ్రామాల్లో భూస్వామ్య ఆధిపత్యం కొనసాగిస్తూనే పట్నాల్లో పెట్టుబడిదారీ వర్గంలోకి ప్రవేశించారు. భారత దేశంలో ఇలాంటి అనేకమందిని మనం చూడగలం.

[భారత దేశ భూస్వామ్య వ్యవస్ధకు ‘కుల వ్యవస్ధ’ ప్రధాన పట్టుగొమ్మ. కులం పునాదులు బలహీనపడుతున్నాయని చెబుతున్నప్పటికీ అగ్ర కుల భూస్వామ్య వర్గ రాజకీయాధిపతుల చుట్టూ కులాల ప్రాతిపదికన సమీకృతం కావడం కొనసాగుతోంది. కులాల ప్రతిపదికన నిమ్న కులాలను అణచివేయడం కొనసాగుతోంది. అగ్ర కుల పేదలను కులం ప్రాతిపదికన తమ చెప్పుచేతల్లో పెట్టుకుని వారిని అణచివేస్తూనే నిమ్న కులాలకు చెందిన విశాల ప్రజా రాశుల శ్రమను దోపిడీ చెయ్యగలుగుతున్నారు. అయితే ఈ దోపిడీని భూస్వామ్య వర్గం ఒక్కటే తినడం లేదు. సామ్రాజ్యవాదులు, వారికి లొంగి ఉన్న పెట్టుబడిదారులు శ్రమ దోపిడిని భోంచేస్తున్నాయి. ప్రధాన భాగం సామ్రాజ్యవాద వర్గాలకి వెళుతుండగా, జూనియర్ భాగాన్ని భారత పెట్టుబడిదారులు, భూస్వాములు పంచుకుంటున్నారు. ]

మూ.ప్ర దేశాల్లో జాతీయ విముక్తి ఉద్యమాలు బద్దలయాక వలస పాలకులకు ప్రత్యక్ష దోపిడిని కొనసాగించడానికి వీలు లేకుండా పోయింది. అశేష శ్రామిక ప్రజలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా ఉద్యమించడంతో వలస పాలకులు కొత్త ఎత్తుగడ వేశారు. ప్రత్యక్షంగా వలస దేశాల్లో ఉంటూ దోపిడికి పాల్పడడం కాకుండా ఆయా దేశాల్లో తమ ప్రతినిధులను నియమించుకోవడం వారి కొత్త ఎత్తుగడ. మూ.ప్ర దేశాల భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలు అప్పటికే విదేశీ వలస పాలకుల కనుసన్నల్లో అభివృద్ధి చెంది ఉన్నాయి. తమ అదుపులో ఉన్న దేశీయ పాలకవర్గాలకే ఆయా దేశాల్లో అధికార పగ్గాలను వలస పాలకులు కట్టబెట్టారు. ఆ విధంగా ‘అధికార మార్పిడి’ కి వారు పూనుకున్నారు. అలాంటి ‘అధికార మార్పిడి’ కే ‘స్వాతంత్ర్యం’ గా దేశీయ పాలకవర్గాలు ఇప్పటికీ చెప్పుకుంటున్నాయి.

దేశాలు స్వతంత్రాన్ని కోరుతున్నాయి. జాతులు విముక్తిని కోరుతున్నాయి. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు. -మావో సేటుంగ్

‘పెట్టుబడిదారీ వ్యవస్ధ అత్యున్నత దశే సామ్రాజ్యవాదం’ అంటూ సామ్రాజ్యవాద దశ గురించి లెనిన్ చేసిన సూత్రీకరణ ఎంతటి సుప్రసిద్ధమో అందరికీ తెలిసినదే. అలాంటి సామ్రాజ్యవాద దశ ప్రవేశించాక ‘ఫైనాన్స్ పెట్టుబడి’ మూ.ప్ర దేశాలను కొల్లగొట్టడానికి శక్తివంతమైన సాధనంగా ముందుకు వచ్చింది. ఫైనాన్స్ పెట్టుబడిని మూ.ప్ర దేశాలకు ఎగుమతి చేసి అక్కడి ఆధిపత్య వర్గాలను లొంగదీసుకుని సామ్రాజ్యవాద దోపిడిని యధేచ్ఛగా కొనసాగించడం ఈ దశలో ముఖ్య లక్షణం. ఈ లక్షణం ఇప్పటికీ కొనసాగుతోంది. భారత దేశం అందుకు మినహాయింపు కాదు.

సామ్రాజ్యవాద దశలో దేశీయ పెట్టుబడిదారులు, భూస్వాములు స్వతంత్రులు కారు. వారి ఆర్ధిక ప్రయోజనాలన్నీ సామ్రాజ్యవాదుల ప్రయోజనాలతో కట్టివేయబడి ఉంటాయి. సామ్రాజ్యవాద కంపెనీలు పెట్టుబడులతో, టెక్నాలజీతో మూ.ప్ర దేశాల వనరులను, శ్రమ శక్తిని కొల్లగొడుతుండగా వారి దోపిడిలో భాగం తీసుకుంటూ దేశ బూర్జువాలు, భూస్వాములు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను, తిరుగుబాట్లను అణచివేస్తూ ఉంటాయి.

ఈ దశలో మూ.ప్ర దేశాల్లో విప్లవాలకి ఎవరు నాయకత్వం వహిస్తారు? మామూలుగానైతే భూస్వామ్య వర్గాలను కూలదోసి సమాజాన్ని ప్రజాస్వామిక యుగం వైపుగా విప్లవీకరించవలసిన బాధ్యత పెట్టుబడిదారీ వర్గంపైనే ఉంటుంది. కాని మూ.ప్ర దేశాల పెట్టుబడిదారీ వర్గం స్వతంత్రులు కాకపోవడం వల్ల వారికి జాతీయ ఆకాంక్షలు లేకపోవడం వల్ల, వలస సామ్రాజ్యవాదులకు లొంగి ఉండడం వల్ల ప్రజాస్వామిక విప్లవాలకి నాయకత్వం వహించే శక్తి, అర్హత లేవు. ప్రజాస్వామిక విప్లవాలు భూస్వామ్య వ్యవస్ధలను కూల్చి పెట్టుబడిదారీ సమాజ ఏర్పాటుకి అవకాశం కల్పిస్తాయి. అయితే అలాంటి ప్రజాస్వామిక విప్లవాలకి నాయకత్వం వహించే శక్తి పెట్టుబడిదారీ వర్గానికి లేకపోవడం వల్ల తదుపరి విప్లవకర వర్గమైన కార్మికవర్గమే ఆ బాధ్యతను నెత్తిన వేసుకోవలసి ఉంటుంది.

భూస్వామ్య వర్గాలపైన పెట్టుబడిదారీ వర్గం నాయకత్వంలొ చెలరేగే తిరుగుబాటు ప్రజాస్వామిక విప్లవం. అదే ప్రజాస్వామిక విప్లవానికి కార్మిక వర్గం నాయకత్వం వహించడమే ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’. పెట్టుబడిదారీ వర్గం తన చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించలేని పరిస్ధితుల్లో ఉన్నందున ఆ బాధ్యతని కార్మిక వర్గం నెత్తిన వేసుకోవడమే నూతన దశ. అయితే కార్మిక వర్గం నాయకత్వం వహించి తిరుగుబాటు విజయవంతం చేశాక అధికారాన్ని పెట్టుబడిదారీ వర్గానికి అప్పగిస్తుందా? చస్తే ఇవ్వదు. సమాజాన్ని విప్లవకరంగా నూతన ప్రజాస్వామిక విప్లవ దశకి తీసుకెళ్లి ‘సోషలిస్టు నిర్మాణాన్ని’ ప్రారంభిస్తుంది.

పెట్టుబడిదారీ వర్గం విదేశీ సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వెళ్లిపోయి, దళారీ పెట్టుబడిదారీ వర్గంగా మారిపోయాక, వారు భూస్వామ్య వర్గం నుండి అధికారం చేపట్టి సమాజాన్ని విప్లవకరంగా పునర్నిర్మించే కర్తవ్యాన్ని నిర్వర్తించరు. ఆ కర్తవ్యాన్ని ఇక కార్మికవర్గమే చేపట్టాలి. కార్మిక వర్గం సమాజంలో ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నాక ఇక పెట్టుబడిదారీ వర్గాన్ని దేశంలో ఉండనివ్వదు. దాన్ని సమూలంగా పెరికివేస్తుంది. ఉంటే దేశంలో ఉంటూ శ్రమలో భాగం పంచుకోవాలి, లేదా బిచాణా ఎత్తివేసి తమ మాస్టర్ (సామ్రాజ్యవాద దేశాలు) వద్దకు పారిపోవాలి.

పెట్టుబడిదారీ వర్గం నిర్వర్తించాల్సిన ‘ప్రజాస్వామిక విప్లవం’ స్ధానంలో కార్మికవర్గం నాయకత్వంలో ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ సాధించడమే మావో ధాట్ లో ప్రధాన అంశం. ఈ సూత్రీకరణ వెనుక మార్క్స్, లెనిన్, స్టాలిన్ లు సాగించిన మహత్తర విప్లవాత్మక కృషి పునాదిగా ఉంది. మార్క్సిజం-లెనినిజం కూ, దానికి మహోపాధ్యాయుడు స్టాలిన్ జోడించిన ఆచరణాత్మక అభివృద్ధి లకు మావో ధాట్ గొప్ప కొనసాగింపు. దక్షిణార్ధ గోళంలో వ్యాపించి ఉన్న అనేక మూ.ప్ర దేశాలలో కార్మికవర్గం నాయకత్వంలో విప్లవాలు సాధించడానికి ‘మావో ధాట్’ కరదీపిక.

ఇదొక్కటే మావో ధాట్ కాదు. మూడో ప్రపంచ దేశాల్లో ఉండే అనేకానేక వైరుధ్యాలను విపులీకరించి వైరుధ్య సూత్రాన్ని విస్తృత స్ధాయిలో అభివృద్ధి చేయడంలో, శత్రువులను మిత్రులను గుర్తించడంలో, ఎత్తుగడలను వ్యూహాలను వేరు పరిచి సమ్మిళతం చేయడంలో, వ్యూహాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో, అశేష రైతాంగాన్ని కార్మికవర్గం నాయకత్వంలోని ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’లో అత్యంత ముఖ్యమైన నమ్మకమైన భాగస్వామిగా చేయడంలో, మావో సాగించిన సైద్ధాంతిక కృషి అనితర సాధ్యం. అలాంటి మావో కృషిని స్వీకరించలేని గుడ్డి పార్టీలు ఈరోజు వామ పక్షాలుగా చెలామణి అవుతున్నాయి.

మావో కృషికి ఇంతవరకూ జోడింపు లేదు. కొత్త పరిస్ధితులు లేవు గనక జోడింపు లేదు. కాని ‘సోషలిస్టు నిర్మాణం’ లో భాగంగా, సాంస్కృతిక విప్లవం ద్వారా చైనా బూర్జువా, భూస్వామ్య వర్గాలని నిర్దాక్షిణ్యంగా అణచివేసినందున ఆయనపై అనేక దుర్మార్గ ప్రచారాలు సాగాయి. చైనాకి చెందిన భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలే ఈ ప్రచారానికి దోహదం చేశాయి. చైనాలాంటి వెనకబడిన సామాజిక వ్యవస్ధల్లో అభివృద్ధి నిరోధక శక్తులు బలంగా ఉన్నందున వారిని ఎదుర్కొని విజయం సాధించడానికి మావో నాయకత్వంలోని విప్లవ వర్గాలకి అనేక ప్రతికూల పరిస్ధితులు ఎదురయ్యాయి. చైనా కమ్యూనిస్టు పార్టీలోకే పెట్టుబడిదారీ శక్తులు జొరబడి సోషలిస్టు నిర్మాణానికి ఆటంకం కలిగించాయి. అడ్డుకున్నాయి. కేంద్ర కమిటీని సైతం తమ వశంలోకి తెచ్చుకున్నాయి.

సాంస్కృతిక విప్లవ దశలో మేధో-శ్రామిక వైరుధ్యాలనీ, పట్టణ-గ్రామీణ వైరుధ్యాలనీ, స్త్రీ-పురుష వైరుధ్యాలనీ, రైతు-కూలీ వైరుధ్యాలనీ పరిష్కరించడానికి చేసిన కృషిని ప్రారంభంలోనే ఆయా వైరుధ్యాలలోని ఆధిపత్య పక్షాలు తీవ్రంగా ఆటంక పరిచాయి. డాక్టర్లని రోడ్లను ఊడ్వాలి రమ్మంటె వారికి కోపం. ఆడవాళ్లని సమానంగా చూడాలంటె పురుష పుంగవులకి కోపం. పట్టణాల్లో పేరుకుపోయిన జనాన్ని గ్రామాలకి తరలించి ఉత్పత్తి కార్యక్రమాల్లో భాగస్వామ్యుల చేయాలంటే అదొక తీవ్ర సమస్య. మధ్య తరగతి అభిజాత్యాన్ని వదులుకొమ్మంటే అదొక నేరం. ఇలాంటి చిన్న చిన్న అసంతృప్తులని ఆర్గనైజ్ చేసి మావో ‘మాస్ లైన్’ కి ప్రతిగా నిలబెట్టడంలో చైనా కమ్యూనిస్టు పార్టీలోని ప్రతికూల శక్తులు సఫలం అయ్యాయి. ఫలితమే పార్టీలో డెంగ్ ముఠా ఆధిపత్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: