కమ్యూనిస్టులు – కమ్యూనిస్టు ఆచరణ

Indian communists

ఒక నవలనుగానీ, పుస్తకాన్ని గానీ చదివినవారు ఎవరైనా అందులో తమకు ఇష్టమైనంతవరకే లేదా అర్ధమైనంతవరకే స్వీకరిస్తారు. నమ్ముతారు కూడా. తమ ఆలోచనా పరిధిలో తర్కించుకుని ‘ఇది బాలేదు’ అనిపిస్తే ఇంకొంతమంది అందులోని అంశాలపై చర్చకు దిగుతారు. ఎక్కువమంది వదిలేస్తారు. రంగనాయకమ్మగారు రాసిన జానకి విముక్తి నవలను చదివి అందులో మార్క్సిజం గురించి ఎక్కువ రాశారు అని భావించి చర్చకు దిగారనుకుందాం. “మీ పరిధి ఇంతే. అందుకే రంగనాయకమ్మగారు రాసింది అర్ధం కాలేదు” అని వ్యంగ్యంగా సరైన పద్ధతిలో చెప్పకుండా ఎద్దేవా చేస్తే అది పద్ధతికి విరుద్ధం. చేతనైతే మనకు తెలిసి నమ్ముతున్న విషయాన్ని తెలియజెప్పి ఒప్పించడానికి ప్రయత్నించాలి తప్ప వెటకారం చేస్తే అసలు విషయం పైనే వ్యతిరేకత వస్తుంది. మార్క్సిజం తెలుసు అనుకుంటున్నవారు చాలామంది ఇలా చేస్తున్నారు. అది సవరించుకోవలసిన విషయం.

మార్క్సిజం మనుషుల్ని ఒక్కసారిగా గొప్పవారిని చేస్తుందా? లేదు, మార్క్సిజం ఒక్కసారిగా ఎవర్నీ మరింత గొప్పవాళ్ళను చేయడం అసాధ్యం. ముందు మార్క్సిజం అర్ధం చేసుకోవాలి. అర్ధం చేసుకుంటున్న క్రమంలోనే సమాజానికీ మార్క్సిజానికీ ఉన్న సాపత్యాన్ని అర్ధం చేసుకోగలగాలి. ముఖ్యంగా సామాజిక సంబంధాల విషయంలో మార్క్సిజం చెబుతున్నది వాస్తవమా, కాదా అన్న విషయంలో ఒక అంగీకారానికి రావాలి. అపుడు మాత్రమే మార్క్సిజం మనుషుల్ని మార్చగలుగుతుంది. అయితే మార్క్సిజం అర్ధం అయిన తర్వాతే మార్పు మొదలవుతుందని కాదిక్కడ. మార్క్సిజం అర్ధం చేసుకుంటున్న క్రమంలో నెమ్మదిగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది నిజాయితీ పరుల విషయంలోనే వాస్తవం అన్నది ముఖ్యంగా గమనించాలి.

ఎందుకంటే, మార్క్సిస్టులం అని తమను తాము చెప్పుకునే వారు రక రకాలుగా ఉంటారు. పైన చెప్పుకున్న నిజాయితీపరులు కొందరైతే, మార్క్సిజాన్ని కొంతవరకే అర్ధం చేసుకుని తమకది పూర్తిగా తెలుసనుకునే వారు చాలమంది ఉన్నారు. అలా కొంతవరకే తెలుసుకున్నవారు అసలు తెలియని చాలామంది ముందు తెలిసీ తెలియని జ్ఞానాన్ని ప్రదర్సిస్తారు. వీరికి సహజంగా కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్ధితిలో ఉంటారు. “జవాబు చెప్పలేను, నేనంతగా అర్ధం చేసుకోలేదు” అని చెప్పడానికి బదులు, తమకు తెలిసిన పరిధిలోనే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అది వాస్తవానికి మార్క్సిజంతో సంబంధం లేనిదై ఉండవచ్చు. వీరి వలన మార్క్సిజం అసలు తెలియని వారికి అర్ధ సత్యాలు, పూర్తి అసత్యాలు అంది మార్క్సిజం పైనే వ్యతిరేకత ఏర్పడ్డానికి కారణమవుతోంది.

ఉదాహరణకి రంగనాయకమ్మగారి పెట్టుబడి పరిచయం పుస్తకం వెనక అట్ట మీడ రంగనాయకమ్మగారు రాసిన “ఒక మంచి డాక్టరు కావాలంటే వారు ముందు మంచి కమ్యూనిస్టు అయి ఉండాలి. ఒక మంచి భర్త కావాలంటే ముందు మంచి కమ్యూనిస్టు అయిఉండాలి” అన్న అంశాన్నే తీసుకుందాం. “అవును, ఆవిడ చెప్పింది ముమ్మాటికీ కరెక్టే. మంచి డాక్టరు కావాలంటే అతను మార్క్సిస్టు కావాల్సిందే. మార్క్సిజం అంత గొప్పది మరి. మార్క్సిజం గురించి మీకేమీ తెలియదు” అని చెప్పేస్తే అవతలి వారు అంతే కటువుగా తమకు కరెక్టనుకున్న దాన్ని చెప్పేస్తారు. దాంతో పాటు మార్క్సిజం పట్ల కూడా ఆటోమేటిక్ గా కొంత నెగిటివ్ ఆలోచన వారిలో నాటుకుంటుంది. అలాంటివారు మరో నలుగురు ఎదురైతే చాలు. మార్క్సిజంపై పూర్తి వ్యతిరేకత పెంచుకోవడానికి.

కొంతమంది మార్క్సిజం పూర్తిగా, లేదా తగినంతగా అర్ధం చేసుకున్నా, వారి వ్యక్తిగత లోపాల వలన, అసమర్ధత వలన మర్క్సిజంపై తప్పు అభిప్రాయాలు ఏర్పడ్డానికి కారణమవుతారు.

ఇకపోతే మార్క్సిస్టు పార్టీలుగా, కమ్యూనిస్టు పార్టీలుగా ఉన్న సంస్ధల్లో పని చేస్తున్నవారు. అలా చెప్పుకుంటున్న పార్టీలన్నీ కమ్యూనిస్టు పార్టీలు కాదని గమనించాలి. కమ్యూనిస్టు సిద్ధాంతాలు వల్లిస్తూ, జీవితంలో ఏ క్షణంలో కూడా అది చెప్పే అంశాల్ని పాటించకుండానే వీరు కమ్యూనిస్టులుగా  చెలామణి అవుతుంటారు. ఇప్పుడు ప్రధాన స్రవంతిలో ఉన్న పార్టీలేవీ మార్క్సిజం చెప్పిన సూత్రాలేవీ పాటించడం లేదు. కనీసం పాటించడానికి కూడా ప్రయత్నించడం లేదు. వారి వలన ఇండియాలో మార్క్సిజానికి రావలసినంత చెడ్డపేరు వచ్చింది.

“మేము/నేను కమ్యూనిస్టులం/ని” అని చెప్పుకునే వారంతా కమ్యూనిస్టులు కాదు. మార్క్సిజం అనేది ఒక ఆచరణీయ సిద్ధాంతం. దాన్ని ఆచరించడానికి నిజాయితీ, నిబద్ధత ఉండాలి. దానికోసం పని చేయాలి. తాము కమ్యూనిస్టులమని చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా ఆ సూత్రాల ప్రకారం నిజాయితీగా పనిచేస్తున్నవారు తప్పని సరిగా సమాజం నుండి ప్రశంసలు పొందుతారు. అందులో అనుమానం లేదు.

కాని కమ్యూనిస్టులం/మార్క్సిస్టులం అని చెప్పుకుంటున్నవారు పాటించేదంతా కమ్యూనిజం కాదని గ్రహించడానికి జనం దగ్గర ఉపకరణాలేవీ లేవు. అందువలన కమ్యూనిస్టులమని చెప్పుకుంటున్నవారు చేసిందే మార్క్సిజంగా చెలామణి అవుతోంది. పుస్తకాలు (ఏవైనా సరే) చదివి జ్ఞానం పొందిన వారు సహజంగా మేధావులుగా చెలామణి అవుతుంటారు. కాని “జ్ఞానం పొందటంతో పాటు దాన్ని సమాజానికి ఉపయోగం లో పెట్టగలిగిన వారే నిజమైన మేధావి” అని చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో అంటాడు. అది  సంపూర్ణంగా నమ్మదగిన నిజం. మార్క్సిజం కూడా అంతే. మార్క్సిజం చదివి అర్ధం చేసుకొని, అది నచ్చి, నమ్మడంతోనే మార్క్సిస్టులు/కమ్యూనిస్టులు ఐపోరని గమనించాలి. నమ్మినవారు ఆచరించడానికీ, పదిమందికీ ఉపయోగపెట్టడానికీ ఏదోమేరకు ప్రయత్నించాలి. అప్పుడే వారు మార్క్సిస్టులు/కమ్యూనిస్టులుగా చెప్పుకోవడానికి అర్హులు.

మనకు కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ తిరిగేవారు చాలా మంది ఎదురవుతుంటారు. వారిలో చాలమంది దగ్గర అటువంటి లక్షణాలు కనపడవు. “గుండు చేయించుకుంటున్న వారంత భక్తులు కానట్టే, మార్క్సిస్టులుగా చెలామణి అవుతున్నవారంతా మార్క్సిస్టులు కాదు. అదే కాకుండా చెడ్డవాళ్ళెవరూ మార్క్సిస్టులు అసలే కాదు” అని గమనించాలి. ఈ బ్లాగరుకు తెలిసి రంగనాకయమ్మ గారిని తీవ్రంగా అభిమానిస్తూ నిజ జీవితంలో గూండాయిజం చేస్తూ, లిటిగెంటుగా డబ్బు సంపాదిస్తున్నవారు ఉన్నారు. మార్క్సిజం తరపున అతను చేసే వాదన కూడా గూండాయిజంతో చేస్తుంటాడు. అటువంటి వారు అసలు మార్క్సిస్టులు కానే కారు. అనుభవాలనుండే ఎవరైనా ఏ విషయంపైనైనా ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ‘ఇది మార్క్సిజం, ఇది మార్క్సిజం కాదు’ అని విడమరిచి చెప్పే పరిస్ధితి ఇప్పుడు సమాజంలో లేదు. కమ్యూనిస్టులుగా ఉన్నవారు సైతం అలా వివరించేందుకు ఉదాహరణలుగా లేరు. అందువలన మార్క్సిస్టులుగా అనుకుంటున్న నిజాయితీపరులు ఓపిగ్గా పనిచేయడమే చేయగలిగింది.

ఓ సిద్ధాంతం గొప్పదని చెప్పినంతలోనే గొప్పదైపోదు. అది ఆచరణలో రుజువైతేనే గొప్పదవుతుంది. మార్క్సిజం-లెనినిజం అలా ఆచరణలో రష్యా, చైనాల్లో రుజువైంది. కాని కొంతకాలమే. అది కూడా చాలా లోపాలతో అమలయ్యింది. లోపాలు సవరించుకుని సరైన పద్ధతిలో అమలు చేసేలోపే ఆ దేశాల్లొ రాజకీయ మార్పులు సంభవించాయి. రష్యాలో స్టాలిన్ మరణం తర్వాత, చైనాలో మావో మరణం తర్వాత సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం ఆగిపోయి పెట్టుబడిదారీ వ్యవస్ధవైపుకి వెనక్కి ప్రయాణం కట్టారు. ఇప్పుడు చైనాలో ఉన్నది కమ్యూనిస్టు పార్టీ కాదు, సోషలిస్టు వ్యవస్ధా కాదు. ఆ ముసుగులో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్ధ మాత్రమే. చైనా ప్రజల్లో ఇంకా మావో పట్ల అభిమానం పోలేదు. అందువలన రష్యాలాగా కమ్యూనిజాన్ని బహిరంగంగా త్యజించడానికి వెనకాడుతున్నారు.

ప్రజా కోర్టులు సరైనవేనా అన్న ప్రశ్న ఒకటుంది. ‘జానకి విముక్తి’ నవల్లో సత్యం ప్రజాకోర్టులో విచారించి వెంకట్రావుని షూట్ చేయాలని భావిస్తాడు. అది విచారణ లేకుండా శిక్ష వేసినట్లు అర్ధం వస్తుంది. కానీ కేసు, కోర్టు అన్నీ “ప్రజా కోర్టు” అన్నదాన్లోనే వచ్చేశాయని గమనించాలి. ఇప్పుడు మావోయిస్టులు అనుసరిస్తున ప్రజాకోర్టులు మార్క్సిస్టు సిద్ధాంతంతో సంబంధం లేనివి. అవి మార్క్సిజం అని వారు నమ్మినా, చెప్పినా అవి మాత్రం మార్క్సిజం కానే కావు. అలా ఏకపక్షంగా చంపేయమని ఎవరూ చెప్పలేదు. చైనాలో విప్లవం వచ్చాక గూడా భూస్వాముల భూములు వశం చేసుకోవడం పార్టీ గైడెన్స్ లో జరిగిన చోట వెనువెంటనే మొరటుగా జరగలేదు. భూస్వామిలో క్రమంగా మార్పు రావడానికి కొన్ని సంవత్సరాలు వేచి చూసిన ఉదాహరణలు ఉన్నాయి. దానితో పాటు స్ధానిక నాయకులకు అవగాహన లేని చోట మొరటుగా లాక్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రారంభ దశల్లో అప్పటికీ సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి సంబంధించిన అనుభవం లేనందున రష్యా, చైనాల్లో చాలా తప్పులు దొర్లాయి. అవి ఉద్దేశ్య పూర్వకంగా జరగలేదని గమనించాలి.
రంగనాయకమ్మ గారు ‘జానకి విముక్తి’ నవలద్వారా చదువరులను మార్క్సిజం వైపుకు మళ్ళేలా చేయాలని ప్రయత్నించడం  బాగాలేదని కొంతమంది భావించవచ్చు. మార్క్సిస్టు సిద్ధాంతాల భోధన పంటికింద రాయిలా తోస్తుంది. అయితే “మార్క్సిజం వైపు మళ్ళేలా చేయడం” నేరం కాదని గమనించాలి. “మార్క్సిజం మంచిది. వెలుగునిస్తుంది” అని నమ్మి రంగనాయకమ్మ గారు ఆ ప్రయత్నం చేశారు. నవలనుండి ఎవరికి కావలసినంత వారు స్వీకరించవచ్చు. మార్క్సిజంతో కలిపి జానకి విముక్తిని స్వీకరించిన వారు (ఈ బ్లాగర్కు తెలిసి తక్కువేననుకోండి) కూడా ఉన్నారని గమనించండి. మార్క్సిజం గ్రహించకపోయినా, తనకు అర్ధం అయిన మేరకు తన జీవితాన్ని బాగుచేసుకోవడానికి ప్రయత్నించిన వారూ ఒకరిద్దరు ఈ బ్లాగరుకు తెలుసు. జానకి విముక్తి చదివి అర్జెంటుగా మార్క్సిస్టులు కావాలని రంగనాయకమ్మ గారు కూడా అనుకుని ఉండరు. మార్క్సిజం గురించిన పరిచయం ఇవ్వడం ద్వారా ఆ ఇజం గురించి ఆలోచించేలా ప్రేరేపించడానికి ఓ ప్రయత్నం చేస్తే తప్పు కాదు కదా!

జావకి విముక్తి నవల చదివిన వారికి మార్క్సిజం ఓ బోనస్సు లాంటిదని ఓ ఫ్రెండ్ సూచించారు. మార్క్సిజం పై ఆసక్తి పెంచగలిగితే అది నిస్సందేహంగా బోనస్సే. అసక్తి కలిగించకపోయినా నష్టం లేదు. జానకి విముక్తితో మార్క్సిజంతో సంబంధం లేకుండా ప్రేరేపణ పొందగలిగనా ఉపయోగమే. పది రూపాయల వలన కొంత ఉపయోగం. ఇరవై రూపాయల వలన మరింత ఉపయోగం. మార్క్సిజంపై ఆసక్తి పెంచగలిగితే జానకి విముక్తి ఉపయోగపు విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అదే రంగనాయకమ్మ గారి ప్రయత్నం. దాన్లో తప్పులేదని గమనించాలి.

ఓ మిత్రుడు “మార్క్సిజం ‘ఇలా ఉంటే బాగుండును’ అనుకోవడానికి పనికొస్తుంది” అన్నారు. అది మార్క్సిజానికి ఆయన ఇచ్చిన సర్టిఫికేట్. మార్క్సిజం మంచి చెబుతుంది అని ఆయన రూఢి పరిచారు. అయితే ఆచరణీయమా కాదా అన్నదగ్గరే కొంతమంది విభేదిస్తున్నారు. ఆ అంశం నిజానికి సాపేక్షికం. చైనా, రష్యా విప్లవాల గురించి చదివితే వారి అభిప్రాయం మారవచ్చునేమో. ఆ విప్లవాల గురించి మీరు చదివి ఉండరని భావిస్తూ ఇలా అనవలసి వస్తోంది. చదివి కూడా ఎవరికైనా అలాగే అనిపిస్తే అది చర్చనీయాంశం. మానవ ప్రవృత్తి అని మిత్రుడు చెప్పింది కూడా సాపేక్షమైనదే. గతంలో బానిస, భూస్వామ్య సమాజాల్లో మానవ ప్రవృత్తిగా కనిపించింది ఇప్పుడు మానవ ప్రవృత్తికి వ్యతిరేకంగా మారింది. బానిస సమాజంలో బలహీనుల్ని బానిసలుగా చేసుకోవచ్చు. కాని ఇప్పుడు వెట్టి చాకిరి చట్ట విరుద్ధం. అలానె మార్క్సిజం ప్రతిపాదించే సిద్ధాంతాలు మానవ ప్రవృత్తికి వ్యతిరేకం అని శివరాం అంటున్నారు గాని, అవి మానవ సమాజానికి అత్యవసరం అని చెబుతున్నావారూ ఉన్నారు కదా? సమాజాన్ని మనం అర్ధం చేసుకున్న దృక్పధాన్ని బట్టే ఏ అంశానాన్నైనా చూస్తాం. మార్క్సిజాన్ని కూడా అలానే చూసి ప్రకృతా, వికృతా అన్నది తేల్చేసుకుంటాం. కానీ మానవ సమాజానికి ఏది మంచిది అన్న ప్రశ్నకు విశ్వజనీనన మైన సమాధానం ఎల్లప్పుడూ ఉంటుంది. దాన్ని చూడగలగడమే ఇక్కడ కావలసింది.

మరో మాట. జానకి విముక్తి రంగనాయకమ్మ గారి ఒక్కరి గొప్పతనమేనా? కాదనే చెప్పాలి. “కాలం గర్భంతో ఉండి మార్క్సును కన్నది” అని మార్క్సు గురించి అతని ఆప్త మిత్రుడు ఎంగెల్సు అంటారు. అంటే మార్క్సు కాలానికి మార్క్సిజం పుట్టడానికి అవసరమైన సిద్ధాంతాలన్నీ అభివృద్ధి చెంది ఉన్నాయనీ, వాటి ఆధారంగానే మార్క్సిజం తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించగలిగాడనీ అర్ధం. అలాగే సమాజంలో జానకిలు చాలామంది ఉన్నారు కనకనే ‘జానకి విముక్తి’ నవల అంత పాపులర్ అయింది. అందులో అనుమానం లేదు. అయితే సంఘంలో స్త్రీలపై ఉన్న కుటుంబ హింస, అణచివేతలను సరైన దృక్పధంతో చూడగలిగినప్పుడే అంత ప్రతిభావంతంగా ఆకట్టుకునేలా రాయగలరు. రంగనాయకమ్మగారికి అటువంటి దృక్పధాన్ని మార్క్సిజం ఇచ్చిందని గమనించాలి. ఈ విషయం వెంటనే ఒప్పేసుకొమ్మని ఎవరినీ ఈ బ్లాగరు కోరడం లేదు. వీలైతే, మార్క్సిజాన్ని చదవగలిగితే, వారికి మార్క్సిజం గొప్పతనం తెలుస్తుందని ఈ బ్లాగరు నమ్మకం.

మార్క్సిజం అంటే ఏవి చదవాలి? తెలుగులో ఉన్న పుస్తకాలు:

  1. పెట్టుబడి పరిచయం: మార్క్సు రాసిన “దాస్ కేపిటల్” కి ఇది సంక్షిప్త పరిచయం. ఒట్టి పరిచయమే కదా అని తీసి పారెయ్యకండి. కేపిటల్ సారాంశాన్ని ఆవిడ అద్భుతంగా అర్ధమయ్యే రీతిలో చక్కగా రాశారు. గతంలో ఇది నాలుగు భాగాలుగా రాశారు. ఇప్పుడది ఒకే భాగంగా తెచ్చారనుకుంటా.
  2. గతితార్కిక భౌతిక వాదం: ఇది మార్క్సిస్టు తత్వ శాస్త్రం. దీనిపై  మావో రాసిన పాఠాలు సులభంగా అర్ధమవుతాయి.
  3. చారిత్రక భౌతిక వాదం: గతితార్కిక భౌతిక వాదం వెలుగులో సామాజిక పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తే వచ్చేది చారిత్రక భౌతిక వాదం. ఈ పేర్లు చూడ్డానికి అదోలా ఉన్నా చదివితే చాలా ఆసక్తిగా ఉంటాయి.

పైన మొదటి  రెండు చదివితే చాలు మార్క్సిజం గురించిన ఓనమాలు వచ్చేస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: