బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలు భారత దేశంలోని దోపిడి వర్గాలైన భూస్వాములు, పెట్టుబడుదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు. ఇవి పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ప్రభుత్వాధికారం చేతికి వచ్చాక దోపిడీవర్గాల ప్రయోజనాలే నెరవేరుస్తాయి. శ్రామిక ప్రజల ప్రయోజనాలను అవి పట్టించుకోవు. పట్టించుకోకపోగా హక్కుల కోసం, మెరుగైన జీవనం కోసం ప్రయత్నించే ప్రజలపైన అణచివేతను అమలు చేస్తాయి. అమెరికా తదితర పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు వీరి ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు కట్టుబడి ఉంటాయి.
సామ్రాజ్యవాదులకు లొంగిపోయి, వారి ప్రయోజనాలు నెరవేరుస్తూ దేశ ప్రజలను దోచుకు తింటున్న వర్గాలు ముఠాలుగా విడిపోయి కాంగ్రెస్, బి.జె.పి, టి.డి.పి, ఎస్.పి, బి.ఎస్.పి తదితర పార్టీలను రాజకీయ రంగంలో ఏర్పరుచుకున్నాయి. రాజకీయ పార్టీల ద్వారా అధికారం సంపాదించి తమ ఆర్ధిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడం ఈ పార్టీల వెనుక ఉన్న వర్గాల లక్ష్యం. ఆర్ధిక ప్రయోజనాలు పునాదిలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఉపరితలంలో ఉండే రాజకీయాలు ప్రజాస్వామిక భ్రమలను కలిగిస్తాయి. అలాంటి భ్రమలకు ప్రధాన ప్రతినిధులు పార్లమెంటు, అసెంబ్లీలు. కనుక పార్లమెంటు, అసెంబ్లీలు కూడా భూస్వాములు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను ‘ప్రజాస్వామ్యం’ ముసుగులో నెరవేర్చే సాధనాలే తప్ప అది ప్రజల అధికారానికి ప్రతినిధి కాదు.
అయితే బానిస, భూస్వామ్య సమాజాలతో పోలిస్తే అర్ధ భూస్వామ్య, పెట్టుబడిదారీ సమాజాల్లో శ్రామిక ప్రజలు సాపేక్షికంగా స్వతంత్రతను కలిగి ఉంటారు. ఈ స్వతంత్రత సారాంశంలో శ్రమను తమకు ఇష్టం వచ్చినవారికి అమ్ముకోగలిగే స్వతంత్రత మాత్రమే. శ్రమని అమ్ముకోవడంలో ఉండే స్వతంత్రత, తమ ‘శ్రమకి తగిన ధర పొందడంలో స్వతంత్రత’ గా మార్పు చెందదు. అలా మార్పు చెందకుండా పోలీసులు, పారామిలటరీ బలగాలు, కోర్టులు, పార్లమెంటు, అసెంబ్లీలతో కూడిన రాజ్యాంగ యంత్రం ఆధిపత్య వర్గాల కోసం కాపలా కాస్తుంది. ఇలాంటి రాజ్యాంగ యంత్రంలో భాగమైన పార్లమెంటుకి జరిగే ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే వచ్చే అధికారం తిరిగి సామ్రాజ్యవాదుల-పెట్టుబడుదారుల-భూస్వాముల సేవలకే వినియోగించగలరు తప్ప శ్రామిక ప్రజలకోసం వినియోగించడం సాధ్యం కాదు.
అంటే ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్ధలో సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకు (దోపిడి త్రయ వర్గాలు) ఈ దేశంలోని ఆస్తులను, వనరులను సొంతం చేసుకుని చిత్తం వచ్చిన రీతిలో వినియోగించే స్వేచ్ఛ ఉండగా, శ్రామిక ప్రజలకు వారికి సేవలు చేసుకుని బతికే స్వేఛ్ఛ మాత్రమే ఉంటుంది. రాజ్యాధికారాన్ని చేతిలో ఉంచుకున్నందున దోపిడి త్రయ వర్గాలు తమ దోపిడిని యధేచ్ఛగా చేయగలుగుతున్నాయి. కనుక శ్రామిక ప్రజలకు దేశ వనరులను స్వేఛ్ఛగా వినియోగించుకోగల పరిస్ధితి రావాలంటే రాజ్యాధికారాన్ని వారు ఆధిపత్య వర్గాలనుండి స్వాధీనం చేసుకోవాలి. అలా స్వాధీనం చేసుకోవడానికి కార్మికవర్గ విప్లవాలు మాత్రమే తగిన, ఏకైక సాధనాలు. కమ్యూనిస్టు పార్టీలు ఈ కార్మికవర్గ విప్లవాన్ని తెచ్చే బాధ్యతను నెత్తిన వేసుకున్నాయి. (వేసుకోవాలి.)
కనుక కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కర్తవ్యం, కార్మిక వర్గ విప్లవం. కార్మికవర్గ విప్లవం ద్వారా శ్రామిక వర్గాల చేతికి రాజ్యాధికారం తెచ్చేందుకు కమ్యూనిస్టు పార్టీలు కృషి చేయాలి. దోపిడి వర్గాల ప్రయోజనాల కోసం ఏర్పరిచిన పార్లమెంటు ద్వారా కార్మిక వర్గ విప్లవం అసాధ్యం. కాకపోతే పార్లమెంటరీ అధికారం కోసం ప్రజాస్వామ్యం పేరుతొ జరిగే ఎన్నికల చుట్టూ ప్రజలకి భ్రమలు పేరుకున్నందున పార్లమెంటరీ ఎన్నికలను కమ్యూనిస్టు పార్టీలు ఒక ఎత్తుగడగా స్వీకరిస్తాయి. కార్మికవర్గ విప్లవాల సాధనలో ఈ ఎత్తుగడను ఉపయోగపెట్టాలని సిద్ధాంతం చెబుతాయి. కమ్యూనిస్టు సిద్ధాంతంలో ఉన్న ఈ స్వల్ప అవకాశం ప్రపంచంలోని అనేక దొంగ కమ్యూనిస్టు పార్టీలకు వరంగా మారింది. ఎత్తుగడగా స్వీకరించవలసిన పార్లమెంటరీ ఎన్నికలను వ్యూహం స్ధానానికి ప్రమోట్ చేసి ఎన్నికల ద్వారా సమకూరే లభాలను అనుభవించడం అవి ప్రారంభించాయి.
ఓ పక్క కమ్యూనిస్టు సిద్ధాంతం చెబుతూ మరోపక్క సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధమైన పార్లమెంటరీ అధికారం కోసం నానా గడ్డీ కరిచేవిగా దిగజారిపోయాయి. కార్మికవర్గం పేరు చెప్పుకుంటూ ప్రజా వ్యతిరేక పార్లమెంటరీ ఎన్నికల్లో పీకలదాకా కూరుకుపోయాయి. వర్గ పోరాటాల్లోకి శ్రామిక ప్రజలను సమీకరించి కార్మికవర్గ నాయకత్వంలో అశేష రైతాంగం, కూలీలు, మధ్య తరగతి, మేధావి వర్గాల మద్దతుతో విప్లవ కర్తవ్యాన్ని నెరవేర్చడం మాని ఎన్నికల చుట్టూ సమస్త ఎత్తుగడలను తిప్పడం ఒక కార్యక్రమంగా చేసుకున్నాయి. అలా పార్లమెంటరీ బురదలో కూరుకుపోయినవే భారత దేశంలోని సి.పి.ఐ, సి.పిఎం, లిబరేషన్ ఇత్యాది పార్టీలు. ఈ పార్టీలకు కమ్యూనిస్టు సిద్ధాంతం తెచ్చే ప్రతిష్ట కావాలి. అదే సమయంలో పార్లమెంటరీ ఎన్నికలు సమకూర్చే సుఖాలు కావాలి. కాకపోతే తమ మారిన స్వభావానికి అనేక సిద్ధాంతాలు జత చేసి తిమ్మిని బమ్మిని చేయడం ఒక కళగా అభివృద్ధి చేశాయి.
ఈ కళలోని అప్రకటిత సూత్రాల ప్రకారం సెక్యులరిజం పేరు చెప్పి కాంగ్రెస్ లాంటి బడా బూర్జువా, బడా భూస్వామ్య పార్టీలతో ప్రభుత్వాలు ఏర్పరచవచ్చు. మతతత్వాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకోవడంలో కాంగ్రెస్, బి.జె.పి పార్టీలకు ఉన్న సారూప్యతను కన్వీనియెంట్ గా విస్మరించవచ్చు. పెద్ద శత్రువుకి వ్యతిరేకంగా చిన్న శత్రువుతో పొత్తు అంటూ టి.డి.పి లాంటి బడా దోపిడీదారీ పార్టీలతో దశాబ్దాల తరబడి ఎన్నికల పొత్తులు పెట్టుకుని ఆ పార్టీలకు వ్యతిరేకంగా చేయవలసిన పోరాటాన్ని గంగలో కలిపేయవచ్చు. టి.డి.పి లాంటి పార్టీలు సామ్రాజ్యవాదుల సేవలో ఆరితేరి సోకాల్డ్ కమ్యూనిస్టు పార్టీలను తన్ని తగలేస్తే, దానికి వ్యతిరేకంగా పెద్ద శత్రువు అయిన కాంగ్రెస్ తో కూడా జత కట్టవచ్చు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సో కాల్డ్ లెఫ్ట్ ని పక్కకి నెట్టేస్తే మళ్ళీ టి.డి.పి లాంటి పార్టీల పంచన చేరవచ్చు.
ఈ విధానాలని ప్రశ్నిస్తే కమ్యూనిస్టు సిద్ధాంతాలను వల్లించి ఏదో విధంగా సమస్యలను దాటవేయవచ్చు. కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రకారం సాయుధ విప్లవానికి కృషి చేస్తున్న విప్లవ పార్టీలపై బడా బూర్జువా, బడా భూస్వామ్య పార్టీలతో సమానంగా అత్యంత క్రూర దమనకాండను అమలు చేసి టెర్రరిస్టులని, ఉగ్రవాదులనీ ముద్ర వేయవచ్చు. భూ సంస్కరణలను చాప చుట్టి ఆధిపత్య వర్గాలకు కానుకగా ఇవ్వవచ్చు. సాయుధ పోరాటం అవసరమని చెబుతూనే ఎంచక్కా పుస్తకాలకు పరిమితం చేయవచ్చు. పారిశ్రామిక విధానం పేరుతో స్వదేశీ, విదేశీ పెట్టుబడుదారుల కోసం భూములు లాక్కోవచ్చు. అదేమని అడిగితే తమ పార్టీ కార్యకర్తలను కూడా దింపి జనాన్ని పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపొచ్చు. ఆ విధంగా సిద్ధాంతం ముసుగులోనే కార్మికవర్గ ప్రజల మధ్య చిచ్చు పెట్టవచ్చు.
ఈ అప్రకటిత సూత్రాలను సి.పి.ఐ, సి.పి.ఎం తదితర పార్టీలు అమలు చేస్తున్నాయి. ఇపుడీ పార్టీల కార్యక్రమం అంతా కార్మికవర్గ రాజకీయాలను ఆధిపత్య వర్గాల రాజకీయాల చుట్టూ తిప్పడమే. ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను నెరవేర్చే పార్లమెంటులో కాసిన్ని సీట్ల కోసం వారి వెంటా, వీరి వెంటా వెళ్లడమే. కార్మిక వర్గ విప్లవం వీరి కార్యక్రమంలో నుండి మాయమైపోయి చాలా కాలం గడిచిపోయింది.
pradamika dasalo unna vidyardulaki avagahana kalpinchadaniki e article entagano dohadapaduthondi.chittipati