ముస్లిం వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా? -గిరీష్ కర్నాడ్

[సుప్రసిద్ధ నాటక రచయిత, సినీ నటుడు గిరీష్ కర్నాడ్ ముంబై గడ్డపై ఒక సాహితీ వేదికలో నిర్వాహకులపైనే కత్తి దూశాడు. ట్రినిడాడియన్-బ్రిటిష్ పౌరుడు, నోబెల్ సాహితీ బహుమతి స్వీకర్త విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ కు ‘టాటా లిటరేచర్ లైవ్! ఫెస్టివల్’, లైఫ్ అఛీవ్మెంట్ అవార్డ్ ప్రకటించడంపై మండిపడ్డాడు. ‘నాటకరంగంలో తన ప్రయాణం’ పై ప్రసంగించడానికి నిర్వాహకులు గిరీష్ ను ఆహ్వానించగా ఆయన నైపాల్ రాతలపై, భావాలపై దాడి చేయడానికి అవకాశాన్ని వినియోగించాడు.బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్ధించిన వ్యక్తికి అవార్డు ఏ ప్రాతిపదికన ఇస్తారని ఆయన నిర్వాహకులను ప్రశ్నించాడు.

హిందూ మతోన్మాద విజృభణను భారతీయ సంస్కృతి పునరుద్ధానంగా అభివర్ణించిన వి.ఎస్.నైపాల్ ట్రినిడాడ్ లో పుట్టి బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నాడు. 2001లో నోబెల్ సాహితీ పురస్కారాన్ని అందుకున్నాక ఆయన భారతీయ మూలాలు ఇండియాలో ఆయన పాపులర్ కావడానికి దారితీసాయి.

భారతదేశంపై మహమ్మదీయుల దండయాత్రను ‘గాయపడిన నాగరికత’ గా అభివర్ణిస్తూ పుస్తకం రాసిన నైపాల్, బ్రిటిష్ వలస దోపిడీ ద్వారా భారతీయులు నాగరికత నేర్చుకున్నారని చెప్పడానికి వెనకాడని వ్యక్తి. హిందూ ఫ్యూడల్ రాజుల ధనరాశుల కోసం జరిగిన ఫ్యూడల్ మహమ్మదీయ దండయాత్రలు భారతీయ నాగరికతను అణచివేసినట్లయితే, సర్వరంగాల్లోనూ భారత ప్రజల మూలుగలు పిప్పిచేసిన వలస దోపిడీలో భారతీయ నాగరికత ఎలా పరిఢవిల్లిందో అంతుబట్టని విషయం.

పశ్చిమ దేశాల ప్రపంచ దండయాత్రలను, శతాబ్దాల అమానవీయ వలస దోపిడిని జాతుల స్వతంత్ర అభివృద్ధికి నిరోధంగా కాక నాగరికతా వరదాయనిగా చెప్పుకోవడం పశ్చిమ దేశాలకు చారిత్రక అవసరం. వారి సామ్రాజ్యవాద అవసరాన్ని భుజాన వేసుకుని ప్రచారం చేసిన నైపాల్ యొక్క తెల్ల భావదాస్యం నోబెల్ బహుమతికి అర్హత పొందడంలో ఆశ్చర్యంలేదు. కానీ బాబ్రీ మసీదు విధ్వంసకాండను సృజనాత్మక ఆవేశంగా ఆమోదించిన నైపాల్ కి జీవన సాఫల్య అవార్డు కట్టబెట్టడమే ఆశ్చర్యకరం.

టాటా లిట్ ఫెస్ట్ వేదికపై గిరీష్ కర్నాడ్ ప్రసంగం పాఠాన్ని ఔట్ లుక్ పత్రిక తన వెబ్ సైట్ లో ప్రచురించింది. దానికిది యధాతధ అనువాదం]

                     ***                                            ***                                              ****

ఈ సంవత్సరం ముంబై లిటరేచర్ ఫెస్టివల్ వద్ద లాండ్ మార్క్ మరియు లిటరేచర్ అలైవ్ వారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును సర్ విద్యా నైపాల్ కి సంయుక్తంగా ప్రకటించారు.

నైపాల్ భారతీయుడు కాదు. తాను భారతీయుడుగా ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ వద్ద అక్టోబర్ 31 తేదీన జరిగిన అవార్డు ఉత్సవంలో ఆ సంగతి ప్రస్తావించడంలో బిడియపూర్వకంగా విఫలం అయ్యారు. ఏ సందర్భంలోనూ ఆ ప్రశ్న తలెత్తలేదు.

2002 లో ఐ.సి.సి.ఆర్ నిర్వహించిన నీమ్రాణా ఫెస్టివల్ ను “నోబెల్ బహుమతి పొందిన ఒక వ్యక్తి… భారతీయుడేనన్న ఆశతో, వ్యక్తిపూజా దృక్పధంతో ఇండియా జరుపుకున్న ఉత్సవం” గా నవలా రచయిత శశి దేశ్పాండే అభివర్ణించాడు. ఆ మాటలు ప్రస్తుత ఉత్సవానికి సరిగ్గా వర్తిస్తాయి.

ఆయన రాసిన నవలల్లో రెండు మాత్రమే భారత దేశం ఇతివృత్తంగా ఉన్నవి. లోతైన నవలలవి. అవి కాకుండా ఇండియాపై ఆయన మూడు పుస్తకాలు రాశారు. వాటిని అద్భుతంగా రాశారాయన. మనతరంలోని గొప్ప ఆంగ్ల రచయితల్లో ఆయన నిస్సందేహంగా ఒకరు.

ఆధునికత్వంలోకి భారతదేశం సాగించిన ప్రయాణపు అన్వేషణకు కొనసాగింపుగా అవి ప్రశంసలు అందుకున్నాయి. కానీ ఆయన మొదటి పుస్తకం -ఎ వూండెడ్ సివిలైజేషన్ (గాయపడిన నాగరికత)- తోనే ఎవరికైనా తోచేది భారతీయ ముస్లింలపై అవి వ్యక్తం చేసిన వెర్రి వ్యతిరేకత.

టైటిల్ లో ఉన్న గాయం బాబర్ దండయాత్ర వల్ల కలిగిందని చెప్పేది. అప్పటినుండీ ముట్టడిదారులకు వ్యతిరేకంగా చెప్పడానికి ఏ ఒక్క అవకాశాన్నీ నైపాల్ వదల్లేదు. ఐదు శతాబ్దాలపాటు ఇండియాని నాశనం చేశారని నిందించాడు. ఇతర భయానక అంశాలతోపాటు దరిద్రాన్ని దేశంలోకి తెచ్చారన్నాడు. సుప్రసిద్ధమైన ప్రాచీన హిందూ సంస్కృతిని నాశనం చేశారన్నాడు.

ఈ పుస్తకాల గురించి ఎవరికైనా ఒక అంశం వెంటనే తడుతుంది; దేనిలోనూ భారతీయ సంగీతం గురించిన ప్రస్తావనే లేకపోవడం.

మన రోజువారీ ఉనికిని సంగీతం నిర్వచిస్తుందని అందరికీ తెలుసు… మీరు దానిని వీధుల్లో చూడగలరు, రెస్టారెంట్లు మొదలైనవాటిలోనూ చూడగలరు. భారతదేశం గురించిన ఒక అన్వేషణలో దాని గురించిన వ్యాఖ్యానం ఉంటుందని మీరు ఆశిస్తారు. భారాదేశంపై మూడు పుస్తకాలు నైపాల్ రాసినప్పటికీ, అవి కూడా మూడు పెద్ద పుస్తకాలు, ఏ ఒక్కదానిలో కూడా సంగీతం గురించిన ప్రస్తావనే ఉండదు. భారతీయ సంగీతానికి స్పందించకుండానే ఆయన భారతదేశం మొత్తం చుట్టేశాడు.

ఇపుడు నాకేమనిపిస్తుందంటే, దీనర్ధం ఆయన చెవిటివాడని. ఈ పరిస్ధితిపై అది నా పరిశీలన, కానీ ఆయన చెవిటివాడుగా ఎందుకు ఉండకూడదో కారణమేమీ లేదు. అది మనందరికీ ఉన్న రాజ్యాంగ హక్కు. కానీ ఏంజరుగుతుందంటే మీరు సంగీతాన్ని అర్ధం చేసుకోనట్లయితే, మీరు సంగీతానికి స్పందించనట్లయితే, మీరు భారతీయ చరిత్రకు స్పందించలేరు. ఎందుకంటే భారతీయ సంస్కృతి యొక్క నిజమైన అభివృద్ధి సంగీతం ద్వారానే సాధ్యం అయింది.

నైపాల్ యొక్క భారతీయ సంస్కృతీ విశ్లేషణలో ఇదొక సమస్య. ఆయనవద్ద సంగీతం లేదు కనుక మన చరిత్రకు ముస్లింలు ఏమిచ్చారన్న విషయంపై ఆయనకి అంచనా ఏదీ లేదు.

భారత చరిత్రలో ముస్లింలు ఏమి చేశారన్న విషయమై ఆయనకి ఉన్న భావాలను బట్టి కనీసం సంగీతం (చరిత్రలో) ఏమి చేసిందో కూడా ఆయనకేమీ తెలియదని స్పష్టంగా తెలుస్తోంది.

మరోవిధంగా చెప్పాలంటే, ఇపుడు, సంగీతం లేకపోయిన తర్వాత – సంగీతానికి చెవి ఒగ్గలేకపోయాక ఆయన పుస్తకంలో మరొక చాప్టర్ కి నిజంగా స్ధానం లేకుండా పోయింది.

ప్రతి భారతీయ గృహం యొక్క హృదయంలోనూ సజీవంగా ఉన్న ఇంతటి అసామాన్యమైన వారసత్వాన్ని భక్తి మరియు సూఫీ ఉద్యమాలు అందించాయి. ఆ ఉద్యమాల ద్వారా హిందూ మరియు ముస్లిం సృజనాత్మకతలు పరస్పరం చిక్కుముడిగా అల్లుకుపోయిన వాస్తవం పట్ల ఆయనకి గల జడాత్మకతను ఇది వివరిస్తుంది.

నైపాల్ యొక్క భారతీయ ఇస్లాం విద్వేషం దాచిపెట్టేదేమిటంటే, భారతీయ సంస్కృతికి సంబంధించిన ఆయనగారి చరిత్ర నమూనా, విలియం జోన్స్ లాంటి 18 మరియు 19 శతాబ్దాల బ్రిటిష్ మ్యూజికాలజిస్టుల నుండి అరువుతెచ్చుకున్నది. ఈ స్కాలర్లకు ఈజిప్త్షియన్, గ్రీకు, రోమన్ లాంటి అనేక ఇతర ప్రాచీన నాగరికతలతో సాన్నిహిత్య పరిచయం ఉంది. కానీ ఈ నాగరికతలు తమ సంగీత సాంప్రదాయాలను మొత్తంగానే కోల్పోగా భారతీయ సంగీత సాంప్రదాయం సజీవంగా వర్ధిల్లిన వాస్తవం వారిని అయోమయానికి గురి చేసింది.

ఇక ఒకప్పటి ఈ స్వచ్ఛమైన, అద్వితీయమైన సంగీతం, సుదీర్ఘ చారిత్రక క్రమంలో ఏదో ఒక సమయాన ఉనికి కోల్పోయి ఉండాలని, కలుషితం అయి ఉంటుందనీ, నలగగొట్టబడి ఉంటుందనీ  వారు నిర్ణయించేశారు. దానికి విలన్ ముస్లిం దండయాత్రీకులేనని వారు కనిపెట్టారు. కనుక, వారి ప్రకారం, అనగనగా ఒక ఆదిమ భారతీయ సంగీత సంస్కృతి ఉండేది; దానిని ముస్లింలు అందవికారం కావించారు.

విదేశీయులు వస్తారు, వారు భారతీయ సంస్కృతిని చూస్తారు, వారు ఆదిమ హిందూ సంస్కృతిని చూస్తారు, అది కలుషితం అయిందనీ ముస్లింల వల్ల కలుషితం అయిందనీ గమనిస్తారు. అంటే మీరొక విషయం గ్రహించవచ్చు. నైపాల్ పుస్తకం చదివినవారెవరైనా వెంటనే ఈ మాతృక (matrix) ను గుర్తిస్తారు. తనంతటతానే గుర్తించానని ఆయన చెప్పిన విషయం వాస్తవానికి చాలాకాలం క్రితమే భారతదేశ సంబంధిత (Indological) అధ్యయనంలో ఉన్నదే.

తన భారతీయ సంస్కృతీ విశ్లేషణలో నైపాల్, ఈ వాదనను అరువుతెచ్చుకుని తన ఒరిజినల్ దృష్టికోణం గా మనముందు ఉంచుతాడు. అలా ఒక్కసారే జరగలేదు.

విజయనగర శిధిలాలు సంకేతంగా నిలిచే చావుపట్లా, వినాశనం పట్లా ఆర్.కె.నారాయణన్ ఉదాసీనతతో వ్యవహరించాడని నైపాల్ నిందిస్తాడు. ఆయన దృష్టిలో అది (విజయనగర సామ్రాజ్యం) హిందూ సంస్కృతికి కోట; దానిని బందిపోటు ముస్లింలు నాశనం చేశారు. కానీ మళ్ళీ చూస్తే, విజయనగర చరిత్రకు సంబంధించిన ఆయన వివరణ 1900లో ముద్రితమైన రాబర్ట్ సెవెల్ పుస్తకం ‘మరిచిపోయిన సామ్రాజ్యం’ (A Forgotten Empire)లో ఆయనకి రెడీ మేడ్ గా దొరికిందే.

వలసాధీశులు ప్రసాదించిన (చారిత్రక) వనరులపట్ల ఎల్లప్పుడూ దిగ్భ్రమతో ఉండే నైపాల్, ఈ దృశ్యాన్ని అరమరికలులేని వాస్తవంగా చక్కగా స్వీకరించి దాన్ని మొత్తంగానే తన సొంత ఆవిష్కారంగా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాడు. (చారిత్రక) స్ధలాలను గత వంద సంవత్సరాలుగా పరిశోధించిన చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు వాస్తవ స్ధితిగతులు మరింత సంక్లిష్టమైనవనీ రుజువు చేశారు. ఈ విరుద్ధ సంఘర్షణలో మతం పాత్ర లేనేలేదని వారు రుజువు చేశారు. కానీ అవేవీ ఆయనకి అవసరం లేదు.

ఇపుడు మళ్ళీ ఆయన చెప్పేదేమిటో ఊహించదగినదే. అదేమంటే, ముస్లింలు భారతీయ ఆర్కిటెక్చర్ ను నాశనం చేశారు; ప్రతీదీ కూలిపోయింది. వారు దోపిడీదారులు మరియు వినాశనకారులు. ముస్లింల హయాంలో ఏమి జరిగిందో తెలియాలంటే ఏ భవనాన్నైనా చూడవచ్చు. జనం ఆయనతో వాదించినపుడు ఆయన తాజ్ గురించి ఏమాన్నాడో చూడండి: “తాజ్ అనేది పెద్ద వృధా, క్షీణదశలో ఉన్నది. చివరికది ఎంత క్రూరమైనదంటే అక్కడ ఎక్కువసేపు ఉండడం నాకు చాలా కష్టంగా తోచింది. ప్రజల రక్తం గురించి తెలియజెప్పే ఒక విపరీత దుబారా అది.”

మనం తాజ్ వద్ద ఉన్నట్లయితే, ప్రజల రక్తం గురించి తెలియజేసే విపరీత దుబారా గురించి మనం ఎవరమూ ఆలోచించము! మీకు తెలుసో లేదో, నోబెల్ బహుమతి మీకు అందుకే వస్తుంది!

మొఘల్ హయాంలో హిందూ, ముస్లిం రీతుల సమ్మిశ్రమం వెల్లివిరిసిందని చెప్పిన చరిత్రకారిణి రొమిలా ధాపర్ అగాహనను ఆయన మార్క్సిస్టు పక్షపాతంతో ఇచ్చిన తీర్పుగా కొట్టిపారేస్తాడు. ఆయనింకా ఏమంటాడంటే, “దండయాత్రీకులు తమ చర్యలను ఎలా చూస్తారో అదే సరైన నిజం. వారు జయిస్తున్నారు. వారు లొంగదీసుకుంటున్నారు” అని.

నైపాల్ దృష్టిలో భారతీయ ముస్లింలు ఎప్పటికీ దండయాత్రీకులుగానే మిగిలిపోతారు. ఎప్పటికీ ఖండనార్హులుగా ఖండించబడతారు. ఎందుకంటే వారిలో కొంతమంది దండయాత్రీకులను పూర్వీకులుగా కలిగి ఉన్నారు. అమెరికాకి అన్వయించినట్లయితే చాలా విచిత్ర ఫలితాలు వచ్చే వాడుక ఇది.

ప్రధానంగా, భారతీయులతో వరుసగా ఇంటర్వ్యూలు చేయడం ద్వారా, ఆధునిక భారతంపై ఆయన సాగించిన పాత్రికేయ అన్వేషణ విషయానికి వస్తే, అవి చాలా గొప్పగా రాయబడ్డాయని ఎవరైనా ఒప్పుకోవలసిందే. తాను జనంతో సాగించిన సంభాషణలను, సందర్శించిన స్ధలాలనూ తీక్షణమైన, ఖచ్చితమైన దృశ్య రూపాల్లోకి తేవడంలో ఆయన మాస్టర్.

అయితే, ఆ తర్వాత ఎవరినైనా ఒక విషయం బాధించడం మొదలుపెడుతుంది. అదేమిటంటే, ఆయన ఎంతగొప్ప తెలివిమంతులను ఇంటర్వ్యూ చేస్తాడంటే తన ప్రశ్నలకు ఎంతో చమత్కారంతో, నేర్పు సొగసులతో  వారిచ్చే సమాధానాలు తన సొంత భాషా ప్రావీణ్యానికి సరిగ్గా సరిపోతాయి. అర్ధ-అక్షరాస్యులు సైతం తమ వ్యక్తీకరణలో ఎటువంటి సంకోచాలనూ ఎదుర్కోరు.

ఆయన రికార్డు చేసే సంభాషణలు ఎంతవరకు నమ్మదగినవి?

ఒక ప్రసిద్ధమైన వ్యాసంలో, నైపాల్, అహ్మదాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్  సందర్శనను వర్ణిస్తాడు. ఆ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, తన మిత్రుడూ అయిన అశోక్ చటర్జీ తో అప్పుడాయన కలిసే ఉన్నాడు.

ఇటీవల ఒక ఈమెయిల్ లో చటర్జీ ఇలా అన్నాడు. నైపాల్ వ్యాసం “అలా అయి ఉండొచ్చన్న ఒక దృశ్య వివరణ (scenario) మాత్రమే కానీ అది వాస్తవానికి ఆయన చూసింది కాదు. వాస్తవంలోని కొన్ని ముక్కలను ఎన్నుకుని మళ్ళీ ఒక చోట అతికించిన ఫక్తు స్వైరకల్పన (fantasy) మాత్రమే అది.”

తన పుస్తకం ‘ఎ వూండెడ్ సివిలైజేషన్’ ని ఫిక్షన్ గా వర్గీకరించాలని చటర్జీ నైపాల్ తో చెప్పాక నైపాల్ తో చటర్జీ స్నేహం ఆకస్మికంగా ముగిసిపోయింది.

నైపాల్ ఒక ఇటీవలి పుస్తకంలో మున్షి రహ్మాన్ ఖాన్ ఆటో బయోగ్రఫీ ని పరిశీలనకు తీసుకున్నాడు. 19వ శతాబ్దం చివరిలో రహ్మాన్ ఖాన్ సురినాం కి వలస వెళ్ళాడు. గాంధీ పుస్తకంతో పోలుస్తూ నైపాల్ దానితో విభేదించాడు.

‘లండన్ రివ్యూ ఆఫ్ బుక్స్’ లో సంజయ్ సుబ్రమణ్యం అనే చరిత్రకారుడు సదరు పుస్తకాన్ని సమీక్షించాడు. (రహ్మాన్ ఖాన్ పుస్తక) పాఠ్యం మూడు చేతులు మారి కత్తిరించబడిన అనువాదాన్ని మాత్రమే నైపాల్ చదివాడని నిర్ధారించడానికి ఆయన పెద్దగా శ్రమ తీసుకోలేదు: “జపనీస్ భాష నుండి తర్జుమా చేయబడిన నైపాల్ పుస్తక పాఠ్యాన్ని గోరఖ్ పూర్ లో ఉన్న పాఠకుడు చదువుతున్నట్లుగా ఆ పుస్తకం ఉంటుంది” అని సంజయ్ తెలిపాడు.

అయినప్పటికీ రహ్మాన్ ఖాన్ భాషా రీతి, వాడుకల పైన వ్యాఖ్యానించడాన్ని కూడా ఈ వాస్తవం నైపాల్ ని అడ్డుకోలేదు.

సమస్య ఏమిటంటే ఆయనకి ‘లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు’ ఇవ్వడం ద్వారా అవార్డు ప్రదాతలు ఏమి చెప్పదలిచారు?

పాత్రికేయుడుగా ఇండియా గురించి ఆయన ఏమిరాస్తాడన్నదీ ఆయన సొంత విషయం. ఆవివివేకిగా ఉండడానికీ, లాలూచీపరమయిన సందిగ్ధత చూపడానికీ ఆయనకి గల హక్కుని ఎవరూ ప్రశ్నించలేరు.

కానీ నోబెల్ బహుమతి ఆయనకి అకస్మాత్తుగా ఒక సాధికారతను సమకూర్చిపెట్టింది. దాని (సాధికారతా) వినియోగాన్ని ఖచ్చితంగా పరీక్షించాల్సిందే.

నోబెల్ బహుమతి స్వీకరించాక నైపాల్ చేసిన మొట్టమొదటి పనుల్లో ఒకటి ఢిల్లీలోని బి.జె.పి కార్యాలయాన్ని సందర్శించడం. ‘ఒక రాజకీయాభిప్రాయాన్ని కలిగి ఉండడం అంటే, ముందే ప్రోగ్రామ్ కాబడి ఉండడం’ అని గతంలో చెప్పిన నైపాల్ ఇపుడు (బి.జె.పి ఆఫీసు సందర్శన అనంతరం) రాజకీయంగా వినియోగించబడినందుకు సంతోషాన్ని ప్రకటించడానికి వెనుదీయలేదు.

ఆ తర్వాతే ఆయన అత్యంత అపఖ్యాతి పొందిన వ్యాఖ్యానం చేశాడు: “అయోధ్య (కూల్చివేత), ఒక విధమైన ఆవేశం (passion). ఏ ఆవేశమైనా సృజనాత్మకత కలిగి ఉంటుంది. ఆవేశం సృజనాత్మకతకు దారి తీస్తుంది” అన్నాడాయన.

“ఫాసిజానికి సహ ప్రయాణీకుడి తరహాలో ఆయన ప్రవర్తించాడు. నోబెల్ బహుమతికి అగౌరవం తెచ్చిపెట్టాడు” అని  నైపాల్ పట్ల సల్మాన్ రష్దీ స్పందించాడు.

అయోధ్య నేపధ్యంలో ఒక్క బోంబే వీధుల్లోనే 1500 మంది వరకూ ముస్లింలు వధించబడ్డారు. అల్లర్లు బద్దలయినపుడు న్యూఢిల్లీలో నేనొక ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నాను. అపుడు బోంబేలో పరితాపంలో మునిగిన నా ముస్లిం స్నేహితులనుండి ఫోన్ కాల్స్ అందుకున్నాను. ముస్లింలను ఇళ్లలోనుండి లాక్కొచ్చి లేదా వీధుల్లో అడ్డుకుని చంపేస్తున్నారని వారు నాకు చెప్పారు.

నా మిత్రుల్లోని ఒక ముస్లిం ఎడిటర్ కి ఫోన్ చేసి చెప్పాను, పరిస్ధితి కుదుటపడేవరకూ అతనూ, అతని కుటుంబమూ పార్శీలు ఎక్కువగా ఉండే భవంతిలోని నా ఫ్లాట్ లో ఉండవచ్చని.

గొప్ప మరాఠీ నటి ఫయ్యజ్ ను వెతికీ వెతికీ చివరికి పూణేలో ఒక మూల కనుగొన్నాను. భయ దుఃఖాలతో ఆమె ముంబై నుండి అక్కడికి పారిపోయింది. ముస్లిం మురికివాడలపైకి శివ సైనికులు ఎలా ఫైర్ బాంబులు విసిరిందీ ఆమె చెప్పారు. భయ విహ్వలులైన ముస్లింలు ఇళ్ళలోంచి వీధుల్లోకి పరుగెడితే వారిని సమస్య కారకులుగా ముద్రవేసి పోలీసులు వారినెలా కాల్చి చంపిందీ తెలియజేసింది.

ఏడు సంవత్సరాల తర్వాత, పచ్చి రక్త పిపాసతో, నైపాల్ ఈ ఘటనలను ‘ఆవేశం’ గా, ‘సృజనాత్మక చర్యలు’ గా  గ్లామరైజ్ చేస్తున్నాడు.

నైపాల్ సోషియాలజీలోని ఈ భాగాన్ని అవార్డు ప్రదానంలో ఏ మాత్రం ప్రస్తావించకపోవడం గమనించవలసిన విషయం. ఆయనను ఇంటర్వ్యూ చేస్తూ ‘ఎమాంగ్ ద బిలీవర్స్’ పుస్తకాన్ని ప్రస్తావించిన ఫరూక్ డూండీ, వెనువెంటనే సర్ విద్య ఒక పిల్లిని దత్తత తీసుకోవడానికి తానెలా సహాయపడిందీ, పదమూడేళ్ళ తర్వాత తన ఒడిలోనే (శాశ్వత) నిద్రలోకి అదెలా జారిపోయిందీ తెలియ చెప్పే సుదీర్ఘ ప్రస్తావనలోకి త్వర త్వరగా వెళ్లిపోవడాన్ని కూడా గమనించాలి. (పిల్లి ప్రస్తావన ద్వారా) నైపాల్ మరోసారి భావోద్వేగపూరకమైన కన్నీటిలో మునిగిపోవడానికి అవకాశం కల్పించబడింది.

ఊహించగల విషయమేమంటే నైపాల్ లో ఎంతటి మానవత దాగి ఉన్నదో రుజువు చేయడానికి డూండీ అపుడు ప్రయత్నిస్తున్నాడు.

కానీ ఈ అవార్డును ప్రకటించిన ‘లాండ్ మార్క్ అండ్ లిటరేచర్ అలైవ్’ మనకి వివరించాల్సిన బాధ్యత ఉంది. నైపాల్ చేసిన ఈ వ్యాఖ్యల విషయంలో వారు సరిగ్గా ఎక్కడ నిలబడి ఉన్నారు?

నైపాల్ ఒక విదేశీయుడు. తాను కోరుకున్నట్లుగా ఆయన ఏమైనా చెప్పవచ్చు. కానీ భారతీయ ముస్లింలను ముట్టడిదారులుగా, బందిపోట్లుగా చెప్పిన నైపాల్ వ్యాఖ్యలకు వారు విలువ సమకూర్చదలిచారా? భారతదేశంలో ముస్లిం భవనాలను మానభంగాలకూ, దోపిడీలకూ చిహ్నాలుగా ఇప్పటికీ నొక్కి చెబుతున్న ఆయనకు మద్దతు ఇస్తున్నారా? లేదా తమ మౌనం ద్వారా ఈ అంశాలేవీ పట్టించుకోదగినవి కావని సూచిస్తున్నారా?

అవార్డు ప్రదాతలు చెప్పవలసిన సమాధానం చాలా ఉంది.

-11/05/2012

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: