కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పెంచింది. పెంచడం పరోక్షంగా జరిగినా జనంపైన మాత్రం ప్రత్యక్షంగా బాదేసింది. సంవత్సరానికి కుటుంబానికి 6 సిలిండర్లు మాత్రమే సబ్సిడీ రేట్లకు ఇస్తానని చెప్పింది. తద్వారా మిగిలిన సిలిండర్లను ఓపెన్ మార్కెట్లో 750/- ధరకి కొనక తప్పని పరిస్ధితి కల్పించింది. బి.జె.పి నాయకుడు వెంకయ్య నాయుడు ప్రకారం ప్రతి కుటుంబం పైనా సంవత్సరానికి అదనంగా 750 రూపాయల భారం పడనుంది. ఈనాడు ఎడిటోరియల్ ప్రకారం ఐదుగురు ఉన్న కుటుంబానికి నెలకి ఒక సిలిండర్ ఖర్చవుతుంది. వీరందరిపైనా ఏడాదికి 2,000/- అదనపు భారం పడుతుందని ఈనాడు తెలిపింది.
ఇది నేపధ్యం. ఈ ఘోరం పైన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలపాలనుకున్నారు. గ్యాస్ ధరల పరోక్ష పెంపుదల ద్వారా ప్రజల్లో ప్రబలిన వ్యతిరేకతను ఆయన సొమ్ము చేసుకోవాలనుకున్నారా లేక నిజంగానే ప్రజలు ఎదుర్కోనున్న భారం తలచుకుని కదిలిపోయారో తెలియదు (తెలుసనుకోండి!) గానీ చంద్రబాబు నాయుడుగారు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసన తెలపడానికి సిద్ధపడ్డారు. దానికాయన ఎంచుకున్న మార్గమే చాలా ఘోరంగా ఉంది. కోట్లాది శ్రమ జీవులని అవమానపరిచేదిగా ఉంది. శ్రమని అమ్ముకోవడం తప్ప బతకడానికి మరొక మార్గం లేని కోట్లాది కూలీలని ఎద్దేవా చేసినట్లుగా ఉంది.
నిరసన తెలియజేయడానికి ప్రతిపక్ష నాయకుడికి గ్యాస్ బండ మోయడం ఒక మార్గం అయితే బతకడానికి గ్యాస్ బండ మోస్తున్నవారి పరిస్ధితిని ఎలా చూడాలి? గ్యాస్ బండ మొయ్యడం అంటే శ్రమ. చంద్రబాబు నాయుడిగారి ఇంటి వంటగదికి గ్యాస్ బండ రావాలన్నా, ముఖ్యమంత్రి ఇంటికి రావాలన్నా, ఎవరో ఒకరు మోస్తేనే గ్యాస్ బండ తాను ఉండవలసిన స్ధానానికి చేరుకుంటుంది. దానంతట అది నడిచిరాదు. బండి మీద తెచ్చినా, రిక్షాలో తెచ్చినా, మినీ లారీలో తెచ్చినా వాహనం నుండి ఇంట్లోకి సిలిండర్ చేరాలంటే ఒక కూలీ దాన్ని మొయ్యాల్సిందే. ‘మొయ్యడం’ అనే శ్రమ ఎవరో ఒకరి చెయ్యాల్సిందే. అలాంటి శ్రమని చంద్రబాబు నాయుడు గారు అవమానించడం తగునా?
శారీరక శ్రమలు ఇమిడి ఉన్న పనులని కింది స్ధాయి శ్రమలుగా, బుద్ధిని ఉపయోగించి చేసే శ్రమలని గొప్ప శ్రమలుగా భావించే బుద్ధి ఒక వైకల్యం. అది సామాజిక అంగవైకల్యం. మానవ జీవనంలో శ్రమ చేస్తే తప్ప పూచిక పుల్ల కూడా నడిచిరాదు. మనిషిని జంతువు నుండి వేరు చేసిందే శ్రమ. శ్రమ ద్వారానే మనిషి కొత్త కొత్త ఉత్పత్తి పరికరాలను తయారు చేసుకుని, ఉత్పత్తి పెంచుకుని, సామాజిక సంబంధాలని నాగరిక స్ధాయికి తెచ్చుకోగలిగాడు.
మేధో పరిజ్ఞానం అభివృద్ధి చెందిందంటే, సాంకేతిక పరిజ్ఞానం అనూహ్య స్ధాయికి చేరుకుందంటే, శారీరక శ్రమే వాటికి మూలం. కోట్లాది శారీరక శ్రమల వైఫల్యాల, విజయాల అనుభవాలే వేలాది ఉత్పత్తిపరికరాల సృష్టికి దారి తీసాయి. కొడవలయినా, కంప్యూటరయినా శ్రమ చేయకుండా ఒక ఉత్పత్తి పరికరం తయారు కాదు. ఉత్పత్తి పరికరంపై శ్రమని వెచ్చించకపోతే ఆ పరికరమే పనికిరానిదిగా ఉండిపోతుంది. శారీరక శ్రమల తాలూకు అనుభవాలు పోగుపడితేనే విజ్ఞానం. శ్రామిక అనుభవాలు, వాటి ఫలితాలను ఒక క్రమ పద్ధతిలో పేర్చితేనే ఒక శాస్త్రం పుడుతుంది. అంటే, శాస్త్ర పరిజ్ఞానం అనేది కోట్లాది శ్రామికులు వేల యేళ్లపాటు చేసిన శారీరక శ్రమల ఫలితం.
శారీరక శ్రమల ఫలితాన్ని అక్షరీకరించుకుని, శాస్త్రబద్ధం చేసుకుని, పుస్తకాల్లో బధ్రపరిస్తే అది టెక్స్ట్ బుక్స్ గా, పరిశోధనా గ్రంధాలుగా, శాస్త్ర సిద్ధాంతాలుగా మనముందు ఉన్నాయి. వాటిని చదివి, అర్ధం చేసుకుని, వీలయితే కొంత చేర్చి మళ్ళీ అప్పజెబితే, పరీక్ష పేపర్లపై రాసి సర్టిఫికెట్లు తెచ్చుకుంటే… అదే మేధావితనంగా చలామణి అవుతోంది. అంతేతప్ప పుస్తకాలు వాటికవే విజ్ఞానం కాదు. విజ్ఞాన ప్రతిబింబం పుస్తకాలు. శారీరక శ్రమల నుండి నేర్చుకున్న జ్ఞానాన్ని బుర్రలో భద్రపరుచుకుని ఆ శారీరక శ్రమలనే ఈసడించుకోవడం బుద్ధి వైకల్యం.
పాలకులకి, ధనికులకి, మేధావులం అనుకుంటున్నవారికీ శ్రమని అవమానించడం కొత్తకాదు. చాలా యేళ్ళ క్రితం పంజాబ్ ముఖ్యమంత్రి ఒకరు ఏదో మతపరమైన తప్పు చేశాడని గురుద్వారా ముందు కూర్చుని చెప్పులు తుడవాలని శిక్ష విధించారు. మెడికోలకి కోపం వస్తే నిరసనగా రోడ్లు ఊడవడం పరిపాటి. రిజర్వేషన్లపై నిరసన చెప్పాలనుకున్నపుడు మన భారత అగ్రకుల ప్రతిభావంతులు కూడా ఇలాగే చెప్పులు తుడవడం, బూట్ పాలిష్ చెయ్యడం, రోడ్లు ఊడ్వడం ఒక నిరసన కార్యక్రమగా చేపడతారు. పెట్రోల్ రేట్లు పెంచితే ఆటోలు, కార్లను తాళ్ళతో లాగి ఫోటోలకు ఫోజులిస్తూ జాతర చేస్తారు. వీళ్ళ దృష్టిలో ఈ శారీరక శ్రమలు చెయ్యడం ఒక శిక్ష. ఒక శిక్షను తమకు తామే వేసుకోవడం వారు తెలియజేసే నిరసన.
రెండొందల యేళ్లు భారత దేశాన్ని దోచుకుతిన్న తెల్లోడిని మెడబట్టి బైటికి గెంటకుండా అన్నం మానేసి తనతోపాటు కోట్లాది భారత పోరాట కార్యకర్తలను కూడా శిక్షించిన గాంధీ ఈ దరిద్రగొట్టు నిరసన రూపానికి మూల పురుషుడు. ఆ తర్వాత పాలకులు, పాలకులతో కుమ్మక్కయిన ప్రజా విద్రోహులు దీన్ని ఒక కళగా అభివృద్ధి చేసి ఆకలితో, దరిద్రంతో, అణచివేతలతో వేగిపోతున్న శ్రామిక ప్రజలపై రుద్దారు. తద్వారా ప్రజా చైతన్యాన్ని మొద్దుబార్చారు. గాంధీ పోరాట రూపానికి ప్రపంచంలో అనేక దేశాల ఆధిపత్య వర్గాలకు ఆదర్శ పోరాటరూపం. తాము ఆచరించడానికి కాదు, ప్రజల చేత ఆచరింపజేయడానికి. అలాంటి పోరాట రూపం ఆంధ్ర పదేశ్ సంస్కరణల రూపకర్త అయిన చంద్రబాబు నాయుడికి అనుసరణీయం కావడంలో ఆశ్చర్యం లేదు.
బుద్ధి జీవుల బుద్ధి వైకల్యం వల్ల శారీరక శ్రమకూ, మేధో శ్రమకూ మధ్య ఉన్న వైరుధ్యం వెర్రితలలు వేస్తున్నది. అగ్ర స్ధానం పొందవలసిన శ్రమ అధోస్ధానంలో ఉంది. దానితో శ్రమను అవమానించడం కొందరికి అలవాటుగా మారితే ఇంకొందరికి ఫ్యాషన్ గా మారింది. ఈ వైకల్యాన్ని సరి చేసుకోకపోతే ఇక సమాజానికి పుట్టగతులు ఉండవు.
-15/09/2012